Health Insurance: పాల‌సీదారుడే స్వ‌యంగా టీపీఏను ఎంచుకోవ‌చ్చు!

థ‌ర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేట‌ర్లు బీమా సంస్థ‌కు, పాల‌సీదారునికి మ‌ధ్య వారదిలా ప‌నిచేస్తాయి.

Published : 08 Dec 2021 16:05 IST

ఆరోగ్య బీమాలో న‌గ‌దు ర‌హిత క్లెయిమ్‌ల‌ను ఫైల్ చేయ‌డంలో థ‌ర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేట‌ర్లు(టీపీఏ) ముఖ్య పాత్ర పోషిస్తారు. టీపీఏలు ఆరోగ్య బీమా పాల‌సీల‌ను విక్ర‌యించవు. పాల‌సీదారుడు అందించిన ప‌త్రాల స‌హాయంతో క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి, ఆసుపత్రుల నెట్వర్కింగ్, నగదు రహిత వైద్య సేవల ఏర్పాటు, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌, స‌కాలంలో సెటిల్ చేసేలా చూడ‌టం వంటి పలు రకాల సేవలను బీమా సంస్థ నుంచి పాల‌సీదారునికి అందించ‌డంలో థ‌ర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేట‌ర్లు స‌హాయ‌ప‌డ‌తారు.

సాధార‌ణంగా థ‌ర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేట‌ర్ల‌ను బీమా సంస్థ‌లు నియ‌మిస్తాయి. ఇవి బీమా సంస్థ‌కు, పాల‌సీదారునికి మ‌ధ్య వారదిలా ప‌నిచేస్తాయి.  ఇందుకోసం టీపీఏలు ఇన్సురెన్స్ రెగ్యుటేట‌రీ అండ్ డ‌వ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ) వ‌ద్ద రిజిస్ట‌ర్ కావాల్సి ఉంటుంది. పాల‌సీ కొనుగోలు చేసే స‌మ‌యంలో పాల‌సీదారుడు స్వ‌యంగా టీపీఏను ఎంచుకోవ‌చ్చు. ఒక‌వేళ ప్ర‌స్తుతం ఉన్న‌ టీపీఏ అందించే సేవ‌ల‌తో మీరు సంతృప్తి చెంద‌క‌పోతే, పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ స‌మ‌యంలో టీపీఏను మార్చుకోవ‌చ్చు. పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలో ఎంచుకోనివారికి,  బీమా సంస్థే టీపీఏను కేటాయిస్తుంది. టీపీఏలు పాల‌సీ దారుల‌కు హెల్త్ కార్డులు జారీ చేస్తాయి. ఇవి ఆసుప‌త్రిలో చేరే స‌మ‌యంలోనూ, క్లెయిమ్‌ల‌ను పూర్తిచేయ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అంతేకాకుండా పాల‌సీదారుని స‌మాచారం, క్లెయిమ్ స్టేట‌స్‌ను ట్రాక్ చేసేందుకు ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. 

క్లెయిమ్‌ల‌ను అంగీకరించ‌డం, తిరస్క‌రించ‌డం పూర్తిగా బీమా సంస్థపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఈ విష‌యంలో టీపీఏకు సంబంధం ఉండ‌దు. పాల‌సీ సంబంధిత ప‌త్రాలు, ఆసుప‌త్రి బిల్లులు, క్లెయిమ్ సెటిల్‌మెంటుకు కావ‌ల‌సిన ఇత‌ర ప‌త్రాల‌ను పాల‌సీదారుని నుంచి సేక‌రించి, సెటిల్‌మెంట్ ప్రాసెస్ త్వ‌ర‌గా పూర్తి చేసేందుకు టీపీఏ స‌హాయ‌ప‌డుతుంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు