Festive Sales: బిగ్‌ సేల్‌లో పాల్గొంటున్నారా? ముందే ఈ ప్రశ్నలు వేసుకోండి!

పండగ సీజన్‌ నేపథ్యంలో ఇ-కామర్స్‌ సంస్థలు అనేక రాయితీలను ప్రకటిస్తున్నాయి. మరి విచ్చలవిడిగా షాపింగ్‌ చేసి ఆర్థిక ఇబ్బందులకు గురి కావొద్దంటే.. ముందుగానే ఈ ప్రశ్నలను మీకు మీరు సంధించుకోండి... 

Updated : 19 Sep 2022 12:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు అవసరమైతేనో లేక పండగలప్పుడో మాత్రమే షాపింగ్‌ చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు ఇ-కామర్స్‌ సంస్థలు ఎప్పుడు రాయితీలు, ప్రయోజనాలు ప్రకటిస్తే అప్పుడు కొనుగోలు చేయాలని నియమం పెట్టుకుంటున్నారు. ఫలితంగా అవసరం తీరడంతో పాటు కావాల్సిన వస్తువు తక్కువ ధరలో లభ్యమవుతుందని భావిస్తున్నారు. ఈ పండగ సీజన్‌లో ఇ-కామర్స్‌ సంస్థలు ప్రకటించే ఆఫర్ల మోజులో పడి కొంతమంది విచ్చలవిడిగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేస్తున్నారు. తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరి ఇలాంటి సేల్‌లో పాల్గొనేముందు మనకు మనం కొన్ని ప్రశ్నలు సంధించుకుంటే సరిపోతుంది! అవేంటో చూద్దాం..

వస్తువు అవసరం నిజంగా ఉందా?

షాపింగ్ మోజులో పడి ఓ వస్తువును కొనుగోలు చేసేటప్పుడు దాని అవసరమెంతో కూడా వినియోగదారులు లెక్కలోకి తీసుకోవడం లేదు. ఆఫర్‌ ఉంది కదా.. లేదా తక్కువ ధరలో దొరుకుతోంది కదా అని కొనేస్తున్నారు. రూ. వేలకు వేలు ఖర్చు చేసి కనీసం సంవత్సరానికి ఒకసారి కూడా ఉపయోగించని వస్తువులను కొని ఉపయోగం ఏంటి? అందుకే ఏ చిన్న వస్తువు కొన్నా.. దాని అవసరం మీకెంత? దాంతో ఎంత ప్రయోజనం? ముందే పరిశీలించుకోండి. మీరు కొనే వస్తువు మీ అవసరం తీరుస్తుందనుకున్నా లేదా మీ సమయాన్ని ఆదా చేస్తుందనుకున్నా కొనుగోలు చేయండి. అదీ మీ ఆర్థిక పరిస్థితి సహకరిస్తేనే!

బడ్జెట్‌ ఎంత?

ఒకసారి ఇ-కామర్స్‌ సైట్లను తెరిచి ఆఫర్లను వెతకడం ప్రారంభిస్తే.. బోలెడన్ని ఆకర్షణీయ ప్రయోజనాలు, రాయితీలు కళ్ల ముందుంటాయి. వాటిని నిశితంగా పరిశీలించడంలో పడి వినియోగదారులు తమ బడ్జెట్‌ పరిమితుల్ని కూడా పట్టించుకోరు. అన్నింటినీ కార్ట్‌కు జత చేస్తూ పోతారు. చివరకు అన్నీ అవసరమే కదా.. కొనేస్తే పోలా అనుకుంటుంటారు. కానీ, ఈ తరహా పద్ధతిని అవలంబిస్తే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మీరు ఫెస్టివల్‌ సేల్స్‌లో పాల్గొనాలనుకుంటే.. ముందే మీ బడ్జెట్‌ను నిర్ధారించుకోండి. దాని లోపలే కొనుగోలు చేయాలని నియమం పెట్టుకోండి.

అప్పు చేస్తున్నారా?

ఆఫర్లు ఉన్నాయి కదా అని అప్పు చేసి కొనడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే వస్తువు అవసరం, మీ బడ్జెట్‌ను నిర్ధారించుకున్నాక ఆ పరిమితులకు లోబడే కొనడం మంచిది. ఏదైనా చాలా ముఖ్యమైన లేదా ఎప్పటి నుంచో మీరు కొనాలనుకుంటున్న వస్తువుపై ఆకర్షణీయమైన రాయితీ ఉందనుకోండి! అలాంటప్పుడు అత్యవసరం కాని వస్తువుల కొనుగోలును వాయిదా వేసుకోండి. ఆ డబ్బుల్ని ముఖ్యమైన వాటి కొనుగోలుకు వినియోగించుకోండి. అప్పటికీ కొనుగోలు తప్పదు.. బడ్జెట్‌ సహకరించడం లేదనుకుంటే.. క్రెడిట్‌ కార్డును ఉపయోగించుకోండి. బిల్లు పెద్ద మొత్తంలో ఉంటే దాన్ని ఈఎంఐ కిందకు మార్చుకోండి.

వాస్తవానికి మీరు ఇలాంటి పండగల సీజన్‌లో నిర్వహించే ప్రత్యేక సేల్స్‌లో పాల్గొనాలనుకున్నప్పుడు ముందు నుంచే పొదుపు చేసుకోవడం ప్రారంభించాలి. మీ నెలవారీ ఆదాయం నుంచి కొంతమొత్తాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఏదైనా ఖరీదైన వస్తువు కావాలంటే.. దానికి కావాల్సిన మొత్తాన్ని ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలో ముందే నిర్ణయించుకోండి.

నిజంగా రాయితీ లభిస్తుందా?

ఇ-కామర్స్‌లో ఏదైనా వస్తువును కొనే ముందు దాని వాస్తవ ధరను క్షుణ్నంగా పరిశీలించాలి. రాయితీ ఎంత ఉందో చూసుకోవాలి. ఇతర సైట్లలో దాని ధర ఎంతో తెలుసుకోవాలి. అప్పుడే నిజంగా ఆ వస్తువుపై మీకు ఎంత ప్రయోజనం లభిస్తుందో తెలుస్తుంది. ఒక్కోసారి వినియోగదారులను ఆకర్షించడం కోసం సంస్థలు ధరను పెంచి దానిపై రాయితీ ప్రకటిస్తుంటాయి. వీలైతే మీరు కొనాలనుకుంటున్న వస్తువు ధరను కొన్ని నెలల ముందు నుంచే గమనిస్తూ ఉండాలి. ఎలా మారుతూ వస్తుందో చూసుకుంటే.. నిజంగా రాయితీ ఇస్తున్నారా.. లేదా.. ఇట్టే అర్థమైపోతుంది. కొన్ని వస్తువులపై రాయితీ పొందాలంటే షరతులు ఉంటాయి. వాటిని ముందే గమనించాలి. లేదంటే ప్రయోజనాన్ని పొందలేరు. తీరా ఆర్డర్‌ చేశాక చూస్తే రాయితీ వర్తించకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

వస్తువు కొత్తదేనా?

కొనాలన్న మోజులో పడి కొంతమంది ఆ వస్తువు పాతదా.. కొత్తదా గమనించరు. ఉదాహరణకు.. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు రోజురోజుకీ మరింత ఆధునికతను సంతరించుకుంటాయి. రెండు, మూడు సంవత్సరాల క్రితం విడుదలైన వస్తువులను ఇప్పుడు కొనడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. తక్కువ ధరకు లభించినప్పటికీ.. దాని ప్రయోజనాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. కాబట్టి, ఒక వస్తువును కొనేటప్పుడు దాంట్లో ఉన్న వివిధ వెర్షన్లను గమనించండి. మీరు కొనేది లేటెస్ట్‌ వెర్షన్‌ అవునో.. కాదో.. చూసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని