Updated : 07 Jul 2022 14:23 IST

Positive Pay: చెక్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా? పాజిటివ్ పే కి రిజిస్ట‌ర్ చేయాల్సిందే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: చెక్ ద్వారా చేసే చెల్లింపుల‌కు పాజిటివ్ పే క‌న్ఫ‌ర్మేష‌న్‌ను 2022 ఆగ‌స్టు 1 నుంచి చాలా వ‌ర‌కు బ్యాంకులు త‌ప్ప‌నిస‌రి చేయ‌నున్నాయి. అధిక విలువ గ‌ల‌ చెక్కుల‌ను జారీ చేసే వారు చెల్లింపుల‌ను నిర్ధారించ‌పోతే.. అటువంటి చెక్కుల‌ను బ్యాంకులు తిర‌స్క‌రిస్తాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా వంటి ప‌లు బ్యాంకులు ఇప్ప‌టికే ఈ విధానాన్ని అమ‌లు చేస్తున్నాయి. అయితే, చాలా వ‌ర‌కు బ్యాంకులు ఆగస్టు 1 నుంచి రూ.5 ల‌క్ష‌లు, అంత‌కంటే ఎక్కువ విలువ ఉన్న చెక్కుల‌కు పాజిటివ్ పేను త‌ప్ప‌నిస‌రి చేయ‌నున్నాయి. ఈ నేపథ్యంలో పాజిటివ్ పే అంటే ఏమిటి? ఎలా రిజిస్ట‌ర్ చేసుకోవాలి? త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకుందాం..

పాజిటివ్ పే సిస్టమ్ అంటే ఏమిటి?

  • చెక్కులోని వివ‌రాల‌ను మ‌రోసారి ధ్రువీకరించుకోవడమే పాజిటివ్ పే వ్య‌వ‌స్థ ముఖ్య ఉద్దేశం. ఈ ప్ర‌క్రియలో అధిక విలువ‌తో కూడిన చెక్కును జారీ చేసినప్పుడు, చెక్కు నంబ‌రు, చెక్కులో పేర్కొన్న‌ తేదీ, ఖాతా నంబ‌రు, ల‌బ్ధిదారుని పేరు, చెక్ జారీ చేసిన వారి పేరు, చెక్ విలువ (అమౌంట్‌) త‌దిత‌ర‌ వివ‌రాలు పాజిటివ్ పే వ్య‌వ‌స్థ ద్వారా పునఃనిర్ధార‌ణ చేస్తారు. ఇందుకోసం చెక్ జారీ చేసే వారు.. ల‌బ్ధిదారునికి చెక్‌ ఇచ్చే ముందే.. చెక్ ముందు, వెనుక ఫోటో తీసి పెట్టుకుని.. ఆ వివ‌రాల‌ను ఫోటోల‌తో పాటు బ్యాంకుకి షేర్ చేయాలి.
  • చెక్ జారీ చేసే వారు, ఎస్ఎంఎస్‌, మొబైల్‌ యాప్‌, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైన ఛానెళ్ల ద్వారా ఎలక్ట్రానిక్‌గా చెక్‌లోని క‌నీస వివ‌రాల‌ను బ్యాంకుకు తెలియ‌జేయ‌వ‌చ్చు. ల‌బ్ధిదారుడు చెక్‌ను న‌గ‌దుగా మార్చుకునేందుకు గానూ బ్యాంకు వ‌ద్ద చెక్‌ను స‌బ్మిట్ చేసిన‌ప్పుడు.. ఈ వివ‌రాల‌ను సీటీఎస్ వ‌ద్ద‌ స‌మ‌ర్పించిన చెక్కుతో క్రాస్ చెక్ చేస్తారు. చెక్‌లోని వివ‌రాలు.. చెక్ జారీ చేసిన వ్య‌క్తి ఇచ్చిన వివ‌రాల‌తో స‌రిపోలితే చెక్ పాస్ చేస్తారు. ఒక‌వేళ‌ ఏదైనా వ్య‌త్యాసం ఉంటే అటువంటి చెక్‌ల‌ను పాస్ చేయ‌కుండా బ్యాంక్ నిలిపివేస్తుంది.
  • వినియోగ‌దారులు వారి వారి నెట్ బ్యాంకింగ్‌కి లాగిన్ అయ్యి లేదా బ్యాంక్ యాప్ ద్వారా పాజిటివ్ పే వివ‌రాల‌ను అందించ‌వ‌చ్చు. ఇది చెక్‌ల‌ను వెరిఫై చేయ‌డంతో పాటు చెక్కుల‌ను త్వ‌ర‌గా క్లియ‌ర్ చేసేందుకు స‌హాయ‌ప‌డుతుంది. ఎల‌క్ట్రానిక్ సేవ‌లు అందుబాటులో లేని వారు నేరుగా బ్యాంక్ బ్రాంచికి వెళ్లి వివ‌రాల‌ను తెలుప‌వ‌చ్చు.

ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు పాజిటివ్‌ పే కి రిజిస్ట‌ర్ చేసుకునే విధానం..

  • ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు ముందుగా పాజిటీవ్ పే కోసం నిర్ణీత ఫార్మాట్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకుని.. వ‌న్-టైమ్ రిజిస్ట్రేష‌న్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ద‌గ్గ‌ర‌లోని ఏదైనా ఎస్‌బీఐ శాఖ‌కు వెళ్లి గానీ, రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ (RINB), కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ (CINB), మొబైల్ బ్యాంకింగ్ (యోనోలైట్ ), యోనో (మొబైల్ యాప్‌) ద్వారా గానీ రిజిస్ట్రేషన్ చేయవచ్చు.
  • రిజిస్ట్రేష‌న్ చేసుకునేట‌ప్పుడు.. ఎంత విలువ గ‌ల చెక్కుల‌ను పాజిటివ్ పే కింద క్రాస్ వెరిఫై చేయాలో తెలియ‌జేయాలి. క‌స్ట‌మ‌ర్ తాము రిస్క్ తీసుకోగ‌ల స్థాయి ఆధారంగా దీన్ని ఎంచుకోవ‌చ్చు. అయితే ఎస్‌బీఐ మాత్రం పొదుపు ఖాతాదారులు రూ.5 ల‌క్ష‌ల‌కు మించి ఇచ్చే చెక్కుల‌కు, ఇత‌ర ఖాతాదారులు (క‌రెంట్/క్యాష్ క్రెడిట్/ఓవ‌ర్ డ్రాఫ్ట్‌) రూ.10 ల‌క్ష‌లు, అంత‌కు మించి జారీ చేసే చెక్కుల‌కు పాజిటివ్ పే ను త‌ప్ప‌నిస‌రి చేయాలని భావిస్తోంది.

ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వండి..

  • ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు ఆన్‌లైన్ ద్వారా పాజిటివ్ పే కి రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు. అలాగే, చెక్ విలువ‌ను మార్చుకోవ‌చ్చు లేదా రిజిస్ట్రేష‌న్‌ను ర‌ద్దు చేసుకోవ‌చ్చు. 
  • ముందుగా హోమ్ పేజీలో కనిపిస్తున్న రిక్వెస్ట్ & ఎంక్వైరీస్ ట్యాబ్‌లో అందుబాటులో ఉన్న చెక్ బుక్ స‌ర్వీసెస్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.
  • ఇందులో పాజిటివ్ పే సిస్ట‌మ్  అందుబాటులో ఉంటుంది. ఇక్క‌డ మీరు రిజిస్ట‌ర్ చేసుకోవచ్చు.
  • ఇప్ప‌టికే రిజిస్ట‌ర్ చేసుకున్న‌వారు త‌నిఖీ చేయాల్సిన చెక్ విలువ‌ను మార్చుకోవాల‌నుకుంటున్నారా లేదా రిజిస్ట్రేష‌న్‌ను ర‌ద్దు చేయాల‌నుకుంటున్నారా అనేది తెలియ‌జేయాలి.
  • మీరు ఆప్ష‌న్‌ను ఎంచుకున్న త‌ర్వాత ముంద‌స్తు నిర్ధార‌ణ పేజీ తెరుచుకుంటుంది. ఇక్క‌డ వివ‌రాల‌ను నిర్ధారిస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబ‌రుకు ఓటీపీ వ‌స్తుంది. ఓటీపీని ఎంట‌ర్ చేసి క‌న్ఫర్మ్ బ‌టన్‌పై క్లిక్ చేయాలి.
  • ఓటీపీ వెరిఫై చేసిన త‌ర్వాత మీరు ఏ సేవ‌ను (రిజిస్ట్రేష‌న్/మాడిఫై/డీ-రిజిస్టర్ ) ఎంచుకున్నారో అది విజ‌య‌వంతంగా పూర్తి అయిన‌ట్లు మెసేజ్ వ‌స్తుంది.

చెక్ ద్వారా జ‌రిగే మోసాల‌ను నివారించేందుకు ఆర్‌బీఐ 2020లో పాజిటివ్ పే క‌న్ఫ‌ర్మేష‌న్‌ను తీసుకొచ్చింది. దీని ప్ర‌కారం బ్యాంకులు అధిక విలువ గ‌ల చెక్కుల‌ను పాస్ చేసేముందు అందులోని వివరాల‌ను క్రాస్ చెక్ చేయాల్సి ఉంటుంది. రూ. 50 వేలు, లేదా అంత‌కంటే ఎక్కువ విలువ గ‌ల చెక్కుల‌ను జారీ చేసే క‌స్ట‌మ‌ర్ల‌కు ఈ విధానం అందుబాటులో ఉంచాల‌ని ఆర్‌బీఐ తెలిపింది. కానీ రూ. 5 ల‌క్ష‌లు, అంత‌కు మించిన విలువ గ‌ల చెక్కుల‌ను మాత్రం త‌ప్ప‌నిస‌రిగా వెరిఫై చేయాల్సి ఉంటుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts