Post office scheme: ఈ పోస్టాఫీస్‌ స్కీమ్‌తో నెలవారీ ఆదాయం.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

ఈ నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం 5 సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్ వ్య‌వ‌ధితో వ‌స్తుంది.

Updated : 03 Jun 2022 15:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పొదుపు చేసేవారు, రిస్క్‌కు ఇష్ట‌ప‌డ‌నివారు, సంప్రదాయ పెట్టుబడిదారులు ముందుగా చూసేది పోస్ట‌ల్ డిపాజిట్లు, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లే. వీటికి ఆదాయ ప‌న్ను ఉన్నా.. ప్ర‌భుత్వ గ్యారెంటీ హామీ ఉండ‌టం వల్ల వీటి మీద అపారమైన‌ న‌మ్మ‌కం. వ‌డ్డీ రేట్లు క్ర‌మ క్ర‌మంగా త‌గ్గుతున్నా కూడా ఇవి అనేక ద‌శాబ్దాల నుంచి పొదుపు చేసే మ‌దుపుదార్ల‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ సంప్రదాయ ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి పెట్టేవారి సంఖ్య పెరిగిందే గానీ త‌గ్గ‌లేదు. అలాంటి పొదుపు ప‌థ‌కాల్లో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్ ఒక‌టి.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్‌ (PO-MIS)తో హామీతో కూడిన నెల‌వారీ ఆదాయాన్ని పొందొచ్చు. పెట్టుబ‌డిదారులు డిపాజిట్ చేసిన డ‌బ్బు మార్కెట్ రిస్క్‌కు లోబ‌డి ఉండ‌దు. రిస్క్ లేకపోవడం వల్ల సంప్రదాయయ పెట్టుబ‌డిదారుల్లో ఈ ప‌థ‌కం మంచి ప్ర‌జాద‌ర‌ణ పొందింది. ఇది ప్ర‌భుత్వ హామీ ఉన్న ప‌థ‌కం కాబ‌ట్టి, మెచ్యూరిటీ వ‌ర‌కు పెట్టుబ‌డుల‌కు ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ ఉంటుంది. సంప్రదాయ పెట్టుబ‌డిదారులతో పాటు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఈ ప‌థ‌కం స‌రిపోతుంది.

ఈ ప‌థ‌కం భార‌త‌దేశంలో ప్ర‌సిద్ధ పెట్టుబ‌డి ఎంపిక‌ల్లో ఒక‌టి. ఎందుకంటే దీన్ని నామ‌మాత్ర‌పు మొత్తంతో ప్రారంభించ‌వ‌చ్చు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో క‌నీసం రూ.1,000 పెట్టుబ‌డిగా పెట్ట‌వ‌చ్చు. ఒక ఖాతాలో గ‌రిష్ఠంగా ₹4.5 ల‌క్ష‌లు, ఉమ్మ‌డి ఖాతాలో ₹9 ల‌క్ష‌లు గ‌రిష్ఠంగా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. సంవ‌త్స‌రానికి ల‌భించే వ‌డ్డీ రేటు 6.6%. ప్రతి నెలా వడ్డీని అందిస్తారు. ఈ నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం 5 సంవ‌త్స‌రాల లాక్‌-ఇన్ వ్య‌వధితో వ‌స్తుంది. పెట్టుబ‌డి మెచ్యూర్ అయిన త‌ర్వాత నిధుల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. తిరిగి పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. అయితే ఇది ఆదాయ ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తుంది. డిపాజిట్ల‌పై ఆదాయ ప‌న్ను మిన‌హాయింపుల్లేవు. ఈ పోస్టాఫీసు ప‌థ‌కంలో పెట్టుబ‌డులు సెక్ష‌న్ 80సీ కింద‌కు రావు.

ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డులు పెట్టిన మొద‌టి నెల నుంచి మీరు ఈ ప‌థ‌కం నుంచి చెల్లింపును అందుకుంటారు. అయితే ఇందులో రాబ‌డులు ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అధిగ‌మించ‌వ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పెట్టుబ‌డిదారుగా ఉన్న‌ప్ప‌టికీ, మీరు బ‌హుళ ఖాతా యాజ‌మాన్యాన్ని క‌లిగి ఉండ‌వ‌చ్చు. అయితే డిపాజిట్ మొత్తం రూ.4.5 ల‌క్ష‌ల‌కు మించ‌కూడ‌దు. మీరు మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్‌తో గ‌రిష్ఠంగా ముగ్గురు వ్య‌క్తుల‌తో ఉమ్మ‌డి ఖాతాను కూడా తెర‌వొచ్చు. ఖాతా ఎవ‌రు స‌హ‌క‌రిస్తున్నార‌నే దాంతో సంబంధం లేకుండా ఖాతాదారులంద‌రికీ స‌మానంగా ఖాతా చెందుతుంది. 10 లేదా అంత‌కంటే ఎక్కువ వ‌య‌స్సున్న మైన‌ర్ త‌ర‌ఫున ఖాతాను తెర‌వ‌వ‌చ్చు. మైన‌ర్ 18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌చ్చిన త‌ర్వాత ఖాతాను నిర్వ‌హించ‌డానికి అనుమ‌తి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు