Small Saving Schemes: పోస్టాఫీసు పొదుపు పథకాలు గురించి తెలుసా?

పోస్టాఫీసు అనేక స్మాల్‌ సేవింగ్స్‌ స్కీంలను అమలు చేస్తోంది. ఈ పథకాలు దేనికవే ప్రత్యేకతను కలిగి ఉంటాయి, వీటి గురించి క్లుప్తంగా చూడండి.

Published : 04 May 2023 16:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలో మదుపుదారుల కోసం పోస్టల్‌ శాఖ (Postal department) అనేక పొదుపు పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు సరిపోయే విధంగా నిర్వహిస్తోంది. ఈ పొదుపు పథకాల ఫీచర్లు, కాలవ్యవధి, పన్ను ప్రయోజనాలు విభిన్నంగా ఉంటాయి. ఈ పథకాల అసలు, రాబడులపై కేంద్రం హామీ ఉంటుంది. చాలా పథకాలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సి కింద రూ.1.50 లక్షల వరకు పన్ను ప్రయోజనాన్ని అందిస్తాయి. వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో సవరిస్తుంది. అన్ని పథకాలకు కనీస పెట్టుబడులు, కొన్ని పథకాలకు గరిష్ఠ పెట్టుబడి పరిమితి ఉంటుంది. ఈ స్కీంలలో పెట్టుబడి పెట్టడానికి, నిర్వహించడానికి అవసరమైన విషయాలను ఇక్కడ చూడండి.

పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతా

ఈ ఖాతాను ఒక్కరిగా లేదా ఇద్దరు పెద్దలు ఉమ్మడిగా తెరవొచ్చు. 10 ఏళ్లు పైబడిన మైనర్‌ తరఫున, మానసిక స్థితి లేని వ్యక్తి తరఫున సంరక్షకుడు ఉన్నా ఈ ఖాతాను తెరవొచ్చు.
వడ్డీ రేటు: 4% (ఏడాదికి)
ఖాతాలో కనీస డిపాజిట్‌: రూ.500

రికరింగ్‌ డిపాజిట్‌ (RD)

5 సంవత్సరాల పోస్టాఫీసు ఆర్‌డీ కింద ఎన్ని ఖాతాలనైనా తెరవొచ్చు.
వడ్డీ రేటు: 6.20% (ఏడాదికి)
కనీస డిపాజిట్‌: రూ.100
గరిష్ఠ డిపాజిట్‌: పరిమితి లేదు.

నేషనల్‌ సేవింగ్స్‌ టైమ్‌ డిపాజిట్‌ (TD)

మదుపుదార్లు 1, 2, 3, 5 సంవత్సరాల పాటు పోస్టాఫీసు టైమ్‌ డిపాజిట్‌ ఖాతాలలో పెట్టుబడి ఎంచుకోవచ్చు. టైమ్‌ డిపాజిట్‌ మెచ్యూర్‌ అయిన తర్వాత అదనంగా ఒక సంవత్సరం పాటు కొనసాగించవచ్చు. పోస్టాఫీసు, ఖాతాదారు పొదుపు ఖాతాలో వార్షికంగా వడ్డీ జమ చేస్తుంది. 5 ఏళ్ల టైమ్‌ డిపాజిట్‌కు ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్‌ 80సి కింద పన్ను ప్రయోజనానికి అర్హత ఉంటుంది.
వడ్డీ రేటు: ఏడాదికి 6.80%, 2 ఏళ్లకు 6.90%, 3 ఏళ్లకు 7%, 5 ఏళ్లకు 7.50% 
కనీస డిపాజిట్‌: రూ.1000
గరిష్ఠ డిపాజిట్‌: పరిమితి లేదు.

మంత్లీ ఇన్‌కమ్‌ స్కీం (MIS)

ఇందులో ప్రతి నెలా వడ్డీ పొందొచ్చు. ఆదాయపన్ను స్లాబ్‌ ప్రకారం పన్ను వర్తిస్తుంది.
వడ్డీ రేటు: 7.40%(ఏడాదికి)
కనీస డిపాజిట్‌: రూ.1000
గరిష్ఠ డిపాజిట్‌: సింగిల్‌ ఖాతాలో రూ.9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో రూ.15 లక్షలు. 

గమనిక: సంరక్షకునిగా మైనర్‌ తరఫున తెరిచిన ఖాతాకు డిపాజిట్‌ పరిమితి వేరుగా ఉంటుంది.

సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీం (SCSS)

60 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్లు ఈ స్కీంలో పెట్టుబడి పెట్టొచ్చు. మూడు నెలలకొకసారి వడ్డీ చెల్లిస్తారు. వడ్డీని అదే పోస్టాఫీసు పొదుపు ఖాతాకు ఆటో క్రెడిట్‌ అయ్యేలా సెట్‌ చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి/ అన్ని SCSS ఖాతాలలో వడ్డీ రూ.50 వేలు దాటితే ఆదాయ పన్ను వర్తిస్తుంది.
వడ్డీ రేటు: 8.20% (ఏడాదికి)
కనీస డిపాజిట్‌: రూ.1000
గరిష్ఠ డిపాజిట్‌: రూ.30 లక్షలు.

పీపీఎఫ్‌

పోస్టాఫీసులో లేదా ఏదైనా బ్యాంకులో దేశవ్యాప్తంగా ఒకరికి ఒక పీపీఎఫ్‌ ఖాతాను తెరవడానికి మాత్రమే అర్హత ఉంటుంది. అసలు, వడ్డీ కలిపి మెచ్యూరిటీ సమయానికి ఇస్తారు. వడ్డీపై ఎటువంటి ఆదాయపన్ను ఉండదు. ఖాతాదారు మైనర్‌ అయితే అతడి తరఫున సంరక్షకుడు ఖాతా తెరవొచ్చు.
వడ్డీ రేటు: 7.10%(ఏడాదికి)
కనీస డిపాజిట్‌: రూ.500 (ఏడాదికి)
గరిష్ఠ డిపాజిట్‌: రూ.1.50 లక్షలు
డిపాజిట్‌ కాలవ్యవధి: 15 సంవత్సరాలు
15 ఏళ్ల తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు డిపాజిట్‌ కాలవ్యవధిని పొడిగించుకోవచ్చు.  

సుకన్య సమృద్ధి ఖాతా (SSA)

ఒక కుటుంబంలో గరిష్ఠంగా ఇద్దరు అమ్మాయిల కోసం ఈ ఖాతాలను తెరవొచ్చు. 2వ కాన్పు కవలలు (అమ్మాయిలు) అయితే ముగ్గురు అమ్మాయిల తరపున ఖాతాలను తెరవొచ్చు. సాధారణంగా 10 ఏళ్ల లోపు మైనర్‌ తరపున ఈ ఖాతాలను తెరుస్తారు కాబట్టి, తండ్రి గానీ సంరక్షకుడు గానీ ఖాతాను తెరవొచ్చు, ఆపరేట్‌ చేయొచ్చు. వడ్డీని వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు. మెచ్యూరిటీ సమయానికి అసలు, వడ్డీ కలిపి పోస్టాఫీసు చెల్లిస్తుంది. మెచ్యూరిటీపై ఎటువంటి ఆదాయపన్ను ఉండదు.
వడ్డీ రేటు: 8%
కనీస డిపాజిట్‌: రూ.250 (ఏడాదికి)
గరిష్ఠ డిపాజిట్‌: రూ.1.50 లక్షలు

నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికెట్లు (NSC)

ఈ పథకం కింద ఎన్ని ఖాతాలనైనా తెరవొచ్చు. వడ్డీని ఏడాది ప్రాతిపదికన లెక్కిస్తారు. మెచ్యూరిటీ సమయానికి అసలు, వడ్డీతో సహా చెల్లిస్తారు. 18 సంవత్సరాలు నిండినవారు ఖాతాను తెరవొచ్చు. మైనర్‌ అయితే (10 ఏళ్లు దాటిన), వారి పేరు మీద సంరక్షకుడు ఖాతా తెరవొచ్చు. ఈ డిపాజిట్‌కు 80సి సెక్షన్‌ ప్రకారం ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది.
వడ్డీ రేటు: 7.70%
కనీస డిపాజిట్‌: రూ.1000
డిపాజిట్‌ కాలవ్యవధి: 5 ఏళ్లు
గరిష్ఠ డిపాజిట్‌: పరిమితి లేదు.

కిసాన్‌ వికాస్‌ పత్ర (KVP)

ఈ పథకం కింద ఎన్ని ఖాతాలనైనా తెరవొచ్చు. పెట్టుబడి మొత్తం 115 నెలల్లో (9 సంవత్సరాల 7 నెలలు) రెట్టింపు అవుతుంది. 18 సంవత్సరాలు నిండినవారు ఖాతాను తెరవొచ్చు. మైనర్‌ అయితే (10 ఏళ్లు దాటిన), వారి పేరు మీద సంరక్షకుడు ఖాతా తెరవొచ్చు.
వడ్డీ రేటు: 7.50%
కనీస డిపాజిట్‌: రూ.1000
గరిష్ఠ డిపాజిట్‌: పరిమితి లేదు.

మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్జిఫికెట్‌

ఈ ఖాతాను ఒక మహిళ తన కోసం లేదా మైనర్‌ బాలిక తరపున సంరక్షకుడు ఖాతాను తెరవొచ్చు. మెచ్యూరిటీ సమయానికి అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తారు.
వడ్డీ రేటు: 7.50%
కనీస డిపాజిట్‌: రూ.1000
గరిష్ఠ డిపాజిట్‌: రూ.2 లక్షలు (అన్ని ఖాతాలు కలిపి)
డిపాజిట్‌ కాలవ్యవధి: 2 సంవత్సరాలు.

చివరిగా: వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మీ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా పథకాన్ని ఎంచుకోవడం మేలు. మరిన్ని వివరాల కోసం మీ సమీప పొస్టాఫీసును సంప్రదించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని