Interest rate: బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే ఈ పథకాల్లోనే అధిక వడ్డీ!

పోస్టాఫీసు ప‌థ‌కాలకు ప్ర‌భుత్వ హామీ ఉంటుంది, స్థిర‌మైన రాబ‌డిని కోరుకునే వారికి ఇవి మంచి ఎంపిక‌. 

Updated : 29 Jan 2022 15:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్థిర‌మైన రాబ‌డిని కోరుకునే వారు సాధార‌ణంగా బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (Fixed Deposits)ను ఎంచుకుంటారు. చాలా వ‌ర‌కు బ్యాంకులు ఐదు సంవ‌త్సరాల డిపాజిట్లపై 5.50 శాతం వ‌ర‌కు వ‌డ్డీని (Intrest Rate) ఆఫ‌ర్ చేస్తున్నాయి. అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. 5 ఏళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ పెట్టుబడిని సెక్షన్ 80c (Section 80C)లో పన్ను మినహాయింపు కోసం ఉపయోగించవచ్చు. పోస్టాఫీసు ప‌థ‌కాలు (Postal schemes) బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మెరుగైన వ‌డ్డీ రేటును అందిస్తున్నాయి. దీంతో పాటు ప‌న్ను ప్రయోజనాలను కూడా పొందొచ్చు. పోస్టాఫీసు అందిస్తున్న ఆ పథకాలేమిటో ఇప్పుడు చూద్దాం..

ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌ (PPF): ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ ఖాతా అనేది 15 సంవ‌త్సరాల దీర్ఘకాల పెట్టుబడి పథకం. ఈ ప‌థ‌కంలో మెచ్యూరిటీ కంటే ముందే పెట్టుబ‌డులు పూర్తిగా ఉప‌సంహ‌రించుకోలేరు. అయితే, ఖాతా తెరిచిన ఏడో సంవత్సరం నుంచి పాక్షిక విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు. అదేవిధంగా ఖాతా తెరిచిన మూడో సంవ‌త్సరం నుంచి ఆరో సంవత్సరం వరకు రుణం తీసుకోవచ్చు. ఖాతాలో క‌నీసం రూ.500 నుంచి గ‌రిష్ఠంగా ఏడాదికి రూ.1.50 లక్షల వరకు జమ చేయొచ్చు. మైన‌ర్ల పేరుపైనా ఖాతా తెరవొచ్చు. ఈ ఖాతాలో ప్రస్తుతం వార్షిక వ‌డ్డీ 7.1 శాతంగా ఉంది. వార్షికంగా కాంపౌండ్ చేస్తారు. ఈ ఖాతాలో చేసిన డిపాజిట్లపై సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు ల‌భిస్తుంది. వడ్డీపై, మెచ్యూరిటీ మొత్తంపై కూడా పన్ను వర్తించదు.

నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికెట్‌ (NSC): 5 సంవత్సరాల పాటు స్థిర‌మైన రాబ‌డితో, ప‌న్ను ప్రయోజనాలతో పెట్టుబడులు చేయాలనుకునే వారికి నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ సరైన ఎంపిక. ప్రస్తుతం ఎన్ఎస్‌సీలో ల‌భించే వార్షిక వ‌డ్డీ 6.80 శాతం. ప‌న్ను ప్రయోజనాలతో కూడిన 5 సంవ‌త్సరాల బ్యాంకు ఎఫ్‌డీతో ల‌భించే వ‌డ్డీ వార్షికంగా 5.50-6% వరకు ఉంది. పెట్టుబ‌డుల‌పై ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్షన్‌ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మిన‌హాయింపు పొందొచ్చు. 

సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌ (SSY): సుక‌న్య సమృద్ధి యోజన ప్రత్యేకించి ఆడ‌పిల్లల భ‌విష్యత్‌ కోసం ప్రవేశపెట్టిన పథకం. 10ఏళ్లలోపు ఆడ‌పిల్లల పేరుపై ఈ ఖాతా తెరవొచ్చు. ఈ ప‌థ‌కంలో ప్రస్తుతం వార్షికంగా 7.60 శాతం వడ్డీ లభిస్తోంది. పెట్టుబడుల‌పై సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆడిపిల్లల భ‌విష్యత్‌ కోసం డిపాజిట్ చేసే వారు, ఈ ప‌థ‌కాన్ని ఎంచుకోవ‌డం ద్వారా మంచి ప్రయోజనాలను పొందొచ్చు.

పోస్టాఫీస్ టైమ్‌ డిపాజిట్ ఖాతా (TD): పోస్టాఫీస్ టైమ్‌ డిపాజిట్ ఖాతా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ మాదిరిగానే ఉంటుంది. 1, 2, 3, లేదా 5 ఏళ్ల నిర్ణీత కాలపరిమితితో ఈ ప‌థకం అందుబాటులో ఉంది. పోస్టాఫీస్ 1 నుంచి 3 సంవత్సరాల డిపాజిట్లపై 5.50 శాతం, 5 సంవ‌త్సరాల డిపాజిట్లపై ప్రస్తుతం 6.70 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ఈ వ‌డ్డీ రేటు ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటే.. 10.75 సంవ‌త్సరాల్లో డ‌బ్బు రెట్టింపు అవుతుంది. 5 సంవ‌త్సరాల టైమ్ డిపాజిట్లపై మాత్రమే సెక్షన్‌ 80సీ కింద రూ.1.50 ల‌క్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్‌ (SCSS): సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్‌ (ఎస్‌సీఎస్ఎస్‌) అనేది ప్రభుత్వ హామీతో ప‌ద‌వీ విర‌మ‌ణ ప్రయోజనాలను అందిస్తున్న పథకం. ఈ పథకం ప్రత్యేకంగా పెద్దల (సీనియర్‌ సిటిజన్స్‌) కోసం రూపొందించింది. 60 ఏళ్లు అంత‌కంటే ఎక్కువ వ‌య‌సున్న వారు ఈ ప‌థ‌కంలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో డ‌బ్బు పెట్టుబ‌డి పెట్టొచ్చు. వ్యక్తిగతంగా గానీ, ఉమ్మడిగా గానీ ఖాతాను తెరిచే వీలుంది. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.40 శాతం. అయిదేళ్ల వరకు నిర్ణీత సొమ్ము పెట్టుబడి పెట్టే అవకాశం ఈ పథకం కల్పిస్తోంది. ఆ తర్వాత రాబడిని మూడు నెలలకోసారి వడ్డీతో కలిపి అందిస్తారు.

చివ‌రిగా..: పోస్టాఫీసు ప‌థ‌కాలు హామీతో కూడిన రాబ‌డి కోసం చూస్తున్న వారికి ఇవి మంచి ఎంపిక‌. ఇందులో పెట్టుబ‌డుల‌కు ప్రభుత్వ హామీ ఉంటుంది. త్రైమాసికానికి ఒక‌సారి ప్రభుత్వమే వడ్డీ రేట్లను సవరిస్తుంది. వీటిలో చాలా వ‌ర‌కు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్షన్‌ 80సీ కింద పన్ను ప్రయోజనాలను అందిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని