Post Office: పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌ స్కీమ్‌.. వడ్డీ ఎంత? అర్హతలేంటి?

బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను పోలి ఉండ‌డంతో..వీటిని పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా కూడా పిలుస్తారు.

Published : 12 Sep 2022 18:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పోస్టాఫీసు అందిస్తున్న‌ ప్ర‌ముఖ పెట్టుబ‌డి ప‌థ‌కాల్లో ‘టైమ్ డిపాజిట్’ కూడా ఒక‌టి. బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను పోలి ఉండ‌డంతో వీటిని పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్లు అని కూడా పిలుస్తారు. నిర్ణీత కాలానికి డిపాజిట్ చేసిన మొత్తానికి హామీతో కూడిన రాబ‌డిని అందిస్తుంది. కాబ‌ట్టి, న‌ష్ట‌భ‌యం లేని పెట్టుబ‌డుల‌ను కోరుకునే వారు పోస్టాఫీసు అందించే టైమ్ డిపాజిట్ల‌లో పొదుపు చేయొచ్చు.

అర్హ‌త, క‌నీస డిపాజిట్..

భార‌తదేశ నివాసితులైన వ్య‌క్తులు పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ ఖాతాను తెర‌వొచ్చు. భార‌తీయ నివాసుతులు కాని వారు ఖాతాను తెరిచే వీలులేదు. ఈ ఖాతాను న‌గ‌దు లేదా చెక్‌తో ఓపెన్ చేయొచ్చు. చెక్ ద్వారా ఖాతా తెరుస్తుంటే చెక్ చెల్లుబాటు అయిన తేదీని ఖాతా తెరిచిన తేదీగా ప‌రిగ‌ణిస్తారు.

ఖాతాను క‌నీసం రూ.1000తో తెర‌వాల్సి ఉంటుంది. గరిష్ఠ డిపాజిట్‌పై ఎలాంటి ప‌రిమితులూ లేవు. ఉమ్మ‌డిగా కూడా ఈ ఖాతాను తెర‌వొచ్చు. అయితే, గ‌రిష్ఠంగా ముగ్గురు వ్య‌క్తులు మాత్ర‌మే జాయింటుగా ఖాతాను తెరిచే వీలుంది. ఒక వ్య‌క్తి ఒక‌టి కంటే ఎక్కువ ఖాతాల‌ను కూడా తెర‌వొచ్చు. దీనిపై ఎలాంటి పరిమితులూ లేవు. మైన‌ర్ల త‌ర‌ఫున త‌ల్లిదండ్రులు లేదా గార్డియ‌న్ ఖాతాను తెర‌వొచ్చు. నిర్ధిష్ట వ‌య‌సు వ‌చ్చిన త‌ర్వాత మైన‌ర్లు స్వ‌యంగా త‌మ ఖాతాను నిర్వ‌హించుకోవ‌చ్చు. అంతేకాకుండా, ఒక వ్య‌క్తి త‌న ఖాతాను ఒక పోస్టాఫీసు బ్రాంచి నుంచి మ‌రొక బ్రాంచికి సుల‌భంగా బ‌దిలీ చేసుకోవచ్చు.

లాక్‌-ఇన్ పీరియ‌డ్‌..

టైమ్ డిపాజిట్ ఖాతాలో వివిధ కాల‌ప‌రిమితుల‌తో లాక్‌-ఇన్ పిరియ‌డ్ ఉంటుంది. ఒక‌టి, రెండు, మూడు, ఐదు సంవ‌త్స‌రాల కాల‌పరిమితుల‌తో డిపాజిట్ చేయ‌వ‌చ్చు. కాల‌వ్య‌వ‌ధిని పొడిగించుకునే అవ‌కాశం కూడా ఉంటుంది. పోస్టాఫీసుకు అధికారికంగా ద‌ర‌ఖాస్తు పంప‌డం ద్వారా పొడిగించుకోవ‌చ్చు. 

వ‌డ్డీ రేటు..

పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ ఖాతా వ‌డ్డీ రేట్ల‌ను త్రైమాసిక ప్రాతిప‌దిక‌న లెక్కిస్తారు. కానీ, వార్షిక ప్రాతిప‌దిక‌న చెల్లిస్తారు. త్రైమాసికానికి ఒక సారి వ‌డ్డీరేట్ల‌ను స‌వ‌రిస్తారు. ప్ర‌స్తుత త్రైమాసికానికి 1,2,3 సంవ‌త్స‌రాల‌ కాల‌వ్య‌వ‌ధి గ‌ల డిపాజిట్ల‌పై 5.50%, ఐదేళ్ల కాల‌వ్య‌వ‌ధి గ‌ల డిపాజిట్ల‌పై 6.70% వ‌డ్డీ ల‌భిస్తోంది. 

ప‌న్ను మిన‌హాయింపు..

డిపాజిట్‌దారులు ఆదాయ‌పు ప‌న్నుచ‌ట్టం, 1961 సెక్ష‌న్ 80సి కింద రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే, ఇది ఐదేళ్ల లాక్‌-ఇన్ పిరియ‌డ్‌ ఉన్న డిపాజిట్ల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.

ముందుస్తు విత్‌డ్రాలు..

పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ల‌ను మెచ్యూరిటీ కంటే ముందే విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. అయితే  ఖాతా తెరిచిన రోజు నుంచి క‌నీసం 6 నెల‌ల పాటు డిపాజిట్ల‌ను కొన‌సాగించాలి. ఆ త‌ర్వాత మాత్ర‌మే ముందుస్తు విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు. ఖాతా తెరిచిన ఆరు నెల‌ల నుంచి ఏడాది లోపు డ‌బ్బు విత్‌డ్రా చేసుకుంటే.. డిపాజిట్ల‌పై పోస్టాఫీసు పొదుపు ఖాతాపై ల‌భించే వ‌డ్డీ మాత్ర‌మే ల‌భిస్తుంది. ఒక సంవ‌త్స‌రం త‌ర్వాత  విత్‌డ్రా చేసుకుంటే డిపాజిట్ల‌పై సాధారణంగా ల‌భించే వ‌డ్డీ రేటు కంటే 1 శాతం త‌క్కువ వ‌డ్డీ ల‌భిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని