PPF: పీపీఎఫ్‌ ఖాతా అర్హత, ఉపసంహరణ, పన్ను ప్రయోజనాలు

పీపీఎఫ్‌ దీర్ఘకాలిక పధకం..ప్రభుత్వ హామి, ఖాతాపై వడ్డీ, ఆదాయపన్ను ప్రయోజనాలు ఆకర్షణీయం. ఈ ఖాతా అర్హత, ఉపసంహరణ లాంటి విషయాలు తెలుసుకుందాం.

Updated : 09 Nov 2022 15:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో ప్రభుత్వ పొదుపు పథకాల్లో పీపీఎఫ్‌ అనేది దీర్ఘకాలిక, సురక్షితమైన పెట్టుబడి ఎంపిక. ఆకర్షణీయమైన పన్ను ప్రయోజనాలు, రాబడి కోరుకునే వ్యక్తులకు ఈ పథకం సరిగ్గా సరిపోతుంది. పోస్టాఫీసు, ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రముఖ ప్రైవేట్‌రంగ బ్యాంకు శాఖల్లో ఈ పీపీఎఫ్‌ ఖాతాను తెరవొచ్చు.

ఖాతాకు అర్హత

18 సంవత్సరాలు నిండిన భార‌తీయ పౌరులు ఎవ‌రైనా పీపీఎఫ్‌లో ఖాతాను తెరిచి పెట్టుబ‌డి పెట్టొచ్చు. ఖాతా తెర‌వ‌డానికి గ‌రిష్ఠ వ‌యో ప‌రిమితి లేదు. ఒక వ్యక్తి ఒక ఖాతానే తెర‌వాలి. ఉమ్మడి ఖాతా సౌక‌ర్యం లేదు. NRIలు, HUFలు పీపీఎఫ్ ఖాతాను తెర‌వ‌డానికి అర్హులు కారు. అయితే, వారి పేరు మీద ఇప్పటికే ఖాతా ఉంటే కాలవ్యవధి (15 ఏళ్ల) పూర్తయ్యే వ‌ర‌కు అది అమ‌ల్లో ఉంటుంది. త‌ర్వాత ఖాతా పొడిగింపునకు వారికి అర్హత ఉండ‌దు. ఖాతాదారుల‌కు నామినీ సౌక‌ర్యం ఉంటుంది. ఫారమ్‌ Eలో నామినీ పేర్కొనాలి.

ఖాతాకు కావాల్సిన పత్రాలు

పీపీఎఫ్‌ ఖాతాను తెరిచేటప్పుడు ఖాతాదారుని పాన్‌, ఆధార్‌, ఓటర్‌ ఐడీ, లేటెస్ట్‌ పాస్‌పోర్ట్‌ సైజు ఫోటో, పూర్తి చేసిన దరఖాస్తు ఫారం అవసరం ఉంటుంది. మైనర్‌ దరఖాస్తు అయితే పై పత్రాలే కాకుండా, జనన ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల కేవైసీ వివరాలు మొదలైనవి కావాలి.

మెచ్యూరిటీ

పీపీఎఫ్‌ మెచ్యూరిటీ కాలవ్యవధి 15 ఏళ్లు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు 2022 జులై 15న పీపీఎఫ్ ఖాతాను తెరిస్తే.. మెచ్యూర్‌ స‌రిగ్గా 15 సంవత్సరాల త‌ర్వాత అంటే 2037 జులై 15న మెచ్యూర్‌ అవుతుందని అనుకుంటారు. కానీ పీపీఎఫ్‌ నియమనిబంధనలను బట్టి 2038 ఏప్రిల్ 1వ తేదీన అవుతుంది. ఈ ఖాతా మెచ్యూరిటీ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే. మెచ్యూరిటీ తర్వాత డిపాజిట్‌ను వడ్డీ సహా తీసుకుని ఖాతా నుంచి నిష్క్రమించొచ్చు. ఖాతాలో కొనసాగాలనుకుంటే, మీరు కోరుకున్నంత కాలం 5 సంవత్సరాలకొకసారి పొడిగించుకోవచ్చు.

పెట్టుబడి

పీపీఎఫ్‌ ఖాతాను రూ.100తో తెరవొచ్చు. కానీ, ఖాతా యాక్టివ్‌గా ఉండడానికి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస డిపాజిట్‌ రూ. 500 చేయాలి. గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్‌ చేయొచ్చు. డిపాజిట్‌ రూ.1.50 లక్షలు దాటి చేస్తే.. అదనపు సొమ్ము ఖాతాలో ఉంటుంది. కానీ దానికి వడ్డీ రాదు.

మైనర్‌ ఖాతా

మైన‌ర్ పిల్లలు ఉంటే.. తల్లిదండ్రులు వారి పేరు మీద ఖాతా తెరవొచ్చు. అయితే, మైనారిటీ తీరిన తర్వాత వారే ఖాతాను నిర్వహించుకోవాలి. మైనర్‌ ఖాతాకు నామినీ సౌకర్యం ఉండదు. ఒక ఆర్థిక సంవత్సరంలో మైనర్‌, తల్లిదండ్రులు కలిపి వారి ఇద్దరి పీపీఎఫ్‌ ఖాతాల్లో రూ.1.50 లక్షల పెట్టుబడి పరిమితిని మించకూడదు.

ఉపసంహరణ

పీపీఎఫ్‌ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి నియమాలు, నిబంధనలు ఉన్నాయి. పీపీఎఫ్ ఖాతాదారుడు మెచ్యూరిటీ త‌ర్వాత, అంటే 15 సంవత్సరాలు పూర్తయిన త‌ర్వాత మాత్రమే ఖాతా బ్యాలెన్స్‌ను పూర్తిగా ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 15 ఏళ్ల మధ్య కాలవ్యవధిలో కూడా పీపీఎఫ్‌ నిల్వలో పాక్షిక మొత్తాన్ని ఉపసంహరించొచ్చు. ఖాతా 5 ఏళ్లు పూర్తయిన తర్వాత.. విద్య, అత్యవసర వైద్య ఖర్చులకు ఖాతా నిల్వలో 50% ఉపసంహరించుకోవచ్చు. ఖాతా 6 ఏళ్లు పూర్తయిన తర్వాత.. ఏడో సంవత్సరం చి కూడా నిల్వ మొత్తంలో పాక్షికంగా తీసుకోవచ్చు. మీ పీపీఎఫ్ ఖాతాలో 4వ సంవత్సరం చివ‌రి న‌గ‌దు నిల్వలో 50% లేదా అంత‌కు ముందు సంవత్సరం చివ‌రిలో 50%.. న‌గ‌దు నిల్వలో ఏది త‌క్కువైతే అది మాత్రమే ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. సంవత్సరానికొకసారి మాత్రమే ఉప‌సంహ‌ర‌ణ‌కు వీలుంటుంది.

పన్ను ప్రయోజనం

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్షన్‌ 80సీ ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వ‌ర‌కు చేసిన పీపీఎఫ్ డిపాజిట్‌పై ఆదాయ‌పు ప‌న్ను మినహాయింపు క్లెయిమ్ చేయ‌వ‌చ్చు. మీ ఉద్యోగ సంస్థకు ఈ వివరాలను అందించి, లేదా ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్(ఐటీఆర్‌) ఫైల్ చేసేట‌ప్పుడు సెక్షన్‌ 80సీ కింద ఈ ప‌న్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయ‌వ‌చ్చు. ఉప‌సంహ‌ర‌ణ స‌మ‌యంలో పీపీఎఫ్ మెచ్యూరిటీ మొత్తం రాబడిపై 100% ఆదాయప‌న్ను మిన‌హాయింపు ఉంది.

చివరిగా: భద్రత, పన్ను ప్రయోజనం, స్థిరమైన రాబడుల పరంగా పీపీఎఫ్‌ ఒక ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనం. ఇది హామీతో కూడిన రాబడి ఇస్తుంది. ఇందులో పెట్టుబడి పెట్టడానికి యోచన చేస్తున్నప్పుడు దీర్ఘకాలిక నిబద్ధత చాలా అవసరం. ఇది పదవీ విరమణ నిధిగా కూడా పనిచేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని