Postal: పీపీఎఫ్‌, ఎస్ఎస్‌వై ఖాతాదారులకు పోస్టల్‌ఐవీఆర్‌ సదుపాయం

పోస్టల్ శాఖ అందించే ఐవీఆర్ స‌ర్వీస్ ద్వారా వివిధ సేవ‌ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని మొబైల్ ఫోన్ ద్వారా సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. 

Updated : 27 Jan 2022 14:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పోస్టాఫీస్‌ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారుల కోసం తపాలా శాఖ ఇటీవ‌లే ‘ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్‌)’ సదుపాయాన్ని ఆవిష్కరించింది. పోస్టాఫీస్ పొదుపు ఖాతాదారులతో పాటు పీపీఎఫ్‌, ఎస్ఎస్‌వై వంటి చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడుల చేసిన వారు కూడా ఈ కొత్త ఐవీఆర్‌ సదుపాయాన్ని వినియోగించి ఈ ప‌థకాలకు సంబంధించిన‌ పూర్తి స‌మాచారం తెలుసుకోవ‌చ్చు. మీ మొబైల్ నుంచి ఇండియన్‌ పోస్ట్ టోల్-ఫ్రీ నంబర్‌ 1800-266-6868కు డయల్ చేసి ఐవీఆర్‌ను వినియోగించుకోవ‌చ్చు.

ఐవీఆర్ స‌దుపాయం ఎలా ప‌నిచేస్తుంది?

పొదుపు ఖాతాదారుల‌కు ఐవీఆర్ అనేక ఆప్ష‌న్‌ల‌ను అందిస్తోంది. ఇంగ్లీష్‌, హిందీతో పాటు మరికొన్ని ప్రాంతీయ భాష‌ల్లో ఈ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు.. మీరు హిందీలో వివ‌రాలు తెలుసుకోవాల‌నుకుంటే టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి 1ని క్లిక్‌ చేయాలి. తెలుగులో వివ‌రాలు కావాలంటే 2 ప్రెస్ చేయాలి. భాష‌ను ఎంచుకున్న త‌ర్వాత మీకు కావ‌ల‌సిన సేవ‌ల‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఒక‌వేళ మీరు ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవాల‌నుకుంటే 5 ప్రెస్ చేసి ఖాతా నంబర్‌ను డయల్‌ చేసి ఆ వెంట‌నే '#' ప్రెస్ చేయాలి. ఏటీఎమ్ కార్డ్ బ్లాక్ చేసేందుకు 6 ప్రెస్ చేసి కార్డు నంబ‌ర్‌, ఖాతా నంబర్‌ ఇవ్వాలి. ఇత‌ర సేవ‌ల కోసం 7 నొక్కాలి. పోస్టల్‌ సర్వీసుల డెలివరీ స్థితి, రిజిస్టర్డ్ పోస్ట్ సేవ‌లు, జీవిత బీమా ప్రీమియం గ‌డువు తేదీ, ప్రీమియం మొత్తం, పాల‌సీ స్థితి, పాల‌సీ మెచ్యూరిటీ తేదీ, హామీ మొత్తం, బ్యాంకింగ్‌, ఇన్సురెన్స్ సేవ‌లు అన్నీ ప‌థ‌కాల ఖాతా బ్యాలెన్స్, డెబిట్ కార్డు సేవ‌లు, పోస్టాఫీస్ అందించే చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు తదితర వివరాలు ఐవీఆర్‌ ద్వారా పొందొచ్చు. ఏదైనా ఫిర్యాదులు చేయాల‌కున్నా క‌స్ట‌మ‌ర్ కేర్‌కు క‌నెక్ట్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.

పోస్టాఫీసు అందించే చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల్లో నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికెట్‌ (ఎన్ఎస్‌సీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), సుకన్య సమృద్ధి యోజ‌న‌ (ఎస్ఎస్‌వై) పథకం సహా మొత్తం 12 ప‌థకాలు ఉన్నాయి. ప్రతి త్రైమాసికం ప్రారంభంలో ప్రభుత్వం ఈ ప‌థ‌కాల వడ్డీ రేట్ల‌ను స‌వ‌రిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని