PPF- ELSS.. ప‌న్ను ఆదాకు ఏది ఉత్త‌మం?

ప్ర‌జా భ‌విష్య నిధి— ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాలు వీటిలో దేని ఎంపిక ఉత్త‌మం? దీనికి స‌మాధానం చెప్పడం చాలా క‌ష్టం. ఎందుకంటే ఈ ప్ర‌శ్నే త‌ప్పు. స‌రైన స‌మాధానం కోసం స‌రైన ప్ర‌శ్న‌ను అడ‌గాలి......

Published : 16 Dec 2020 13:50 IST

ప్ర‌జా భ‌విష్య నిధి(పీపీఎఫ్‌)కి.. ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కానికి(ఈఎల్ఎస్ఎస్‌) మ‌ధ్య గ‌ల తేడాల‌ను తెలుసుకుందాం.

ప్ర‌జా భ‌విష్య నిధి— ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాలు వీటిలో దేని ఎంపిక ఉత్త‌మం? దీనికి స‌మాధానం చెప్పడం చాలా క‌ష్టం. ఎందుకంటే ఈ ప్ర‌శ్నే త‌ప్పు. స‌రైన స‌మాధానం కోసం స‌రైన ప్ర‌శ్న‌ను అడ‌గాలి. మ‌దుప‌రులు త‌మ ఆర్థిక ఆరోగ్యాన్ని ప‌దిల‌ప‌ర్చుకునే దిశ‌లో ఎన్నో సందేహాలు ఎదుర‌వుతుంటాయి. వాటికి స‌రైన స‌మాధానాలు తెలుసుకొని అందుకు త‌గ్గ‌ట్టు పెట్టుబ‌డులు పెడితే విజ‌యం సొంత‌మ‌వుతుంది. ఆర్థిక సంవత్స‌రం చివ‌ర‌లో ఈ ప్ర‌శ్న అడిగితే… ఆర్థిక స‌ల‌హాదారులెవ‌రైనా సాధార‌ణంగా ముందుగా ల‌క్ష్యం నిర్దేశించుకోండి, ఆ త‌ర్వాత పెట్టుబ‌డి కేటాయింపులు చేసుకోండి, అందుకు త‌గిన‌ట్టు ప‌న్ను ఆదా చేసే ప్ర‌ణాళిక‌లు వేసుకోండి అని చెబుతుంటారు. ఈ స‌మాధానాలు విన్న ఎవ‌రికైనా తాము వేసిన ప్ర‌శ్న అర్థం కాన‌ట్టుంది, అన‌వ‌స‌రంగా ఈ స‌ల‌హాదారు వ‌ద్ద‌కు వ‌చ్చామ‌ని అనుకుంటారు. చాలా మంది మ‌దుపు చేయాల‌నే ఉద్దేశంతో ఎన్నో ర‌కాల ఆర్థిక క‌థ‌నాలు చ‌దువుతారు, బ్లాగుల‌ను శోధిస్తారు, ప్ర‌తి ఫోర‌మ్‌లో చ‌ర్చ‌లు పెడ‌తారు. అంతే కానీ, నిపుణుల స‌ల‌హాలు మాత్రం త‌క్కువ‌గా పాటిస్తారు.

పీపీఎఫ్‌- ఈఎల్ఎస్ఎస్ ఈ రెండింటినీ పోల్చి చెప్ప‌డం అంటే… యాపిల్‌కు, నారింజ‌కు పోలిక‌పెట్టడం. 15ఏళ్ల సుదీర్ఘ కాలంపాటు ఉండే పీపీఎఫ్ ఉద్దేశం వేరు, మూడేళ్ల లాకిన్ గ‌డువు ఉండే ఈఎల్ఎస్ఎస్ వేరు. లాకిన్ గ‌డువుతో పోలిస్తే ఈఎల్ఎస్ఎస్ మెరుగైన ప‌థ‌కంగా చెప్పొచ్చు. ఐతే కేవ‌లం ప‌న్ను ఆదా కోసం చూసుకుంటే త‌ప్ప‌నిస‌రిగా చేసుకునే ప‌థ‌కాల్లో భాగంగా ఉండే ఈపీఎస్‌, ఎన్‌పీఎస్‌లు ఉండ‌నే ఉన్నాయి. వీటితోనే సెక్ష‌న్ 80సీకున్న రూ.1.5ల‌క్షల ప‌న్ను మిన‌హాయింపు పరిధి నిండిపోతుంది. ఈఎల్ఎస్ఎస్‌లో అంటే ఈక్విటీల్లో పెట్టుబ‌డి పెట్ట‌డం. స్టాక్‌మార్కెట్‌లో 3 ఏళ్ల నుంచి 30ఏళ్ల దాకా కొన‌సాగ‌వ‌చ్చు. దీంట్లో హెచ్చుత‌గ్గుల‌కు అడ్డు అదుపు లేదు. మ‌దుప‌రులు దీనికి అల‌వాటు ప‌డ‌డమే మేలు. ఒక్కోసారి పెట్టిన పెట్టుబ‌డి మొత్తం పోవ‌చ్చు. మ‌రో సారి గ‌ణ‌నీయ‌మైన రాబ‌డులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈఎల్ఎస్ఎస్ లో 3ఏళ్ల పాటు పెట్టుబ‌డి పెట్టవ‌చ్చు. ఐతే స్టాక్‌మార్కెట్ ప‌రిస్థితిని మూడేళ్ల పాటు అంచ‌నా వేయ‌లేం. మూడేళ్ల త‌ర్వాత అధిక న‌ష్టాలు వ‌స్తే సామాన్య మ‌దుప‌రి భ‌రించ‌డం క‌ష్టం. ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాల్లో మ‌దుపు చేసేవారు మూడేళ్ల లాకిన్ గ‌డువు అయ్యాక అందులోంచి పెట్టుబ‌డులు తీసేయ‌కుండా దీర్ఘ‌కాలంపాటు కొన‌సాగించి ప‌న్ను ఆదా చేసుకునే య‌త్నాల‌ను చేయ‌వ‌చ్చు. ఆ త‌ర్వాత నిదానంగా సుర‌క్షిత‌మైన ప‌థ‌కాల‌కు ఇందులోని సొమ్మును త‌ర‌లించ‌వ‌చ్చు. ఏదైనా ప‌న్ను ఆదా ప‌థ‌కాన్ని ఎంచుకునే ముందు అందులోని మంచి చెడుల‌ను విశ్లేషించాలి. మార్కెట్‌లో హెచ్చుత‌గ్గుల ద్వారా లాభాలు పొందాలంటే మాత్రం ఈఎల్ఎస్ఎస్ అనుకూలం అని చెప్పొచ్చు. దీనికి స‌రైన ప‌రిష్కారం ఏది? మ‌న‌లో చాలా మంది ప‌న్ను ఆదా ప‌థ‌కాల‌ను క‌డ దాకా కొన‌సాగించాల‌ని కోరుకుంటారు. జీవిత చ‌ర‌మాంకానికి ప‌ద‌వీ విర‌మ‌ణ ల‌క్ష్యం అన్నింటికంటే ప్ర‌ధాన‌మైంది. మ‌న‌పై ఆధార‌ప‌డి మ‌న జీవిత‌భాగ‌స్వామి ఉండొచ్చు. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని త‌ల‌ద‌న్నే పెట్టుబ‌డుల‌తో పాటు ప‌న్ను ఆదా గురించి ఆలోచించాలంటే స‌రైన ప‌థ‌కాన్ని ఎంచుకోవ‌డం ముఖ్యం. ఈక్విటీల‌లో ఎక్కువ‌గా పెట్టడం ద్వారా ఇది సాధ్య‌మ‌వుతుంది. సుమారు 60 నుంచి 70శాతం ఈక్విటీల్లో పెడితే మంచి రాబ‌డులు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. కాబ‌ట్టి ప‌రోక్షంగా ఈక్విటీ ఆధారిత ప‌న్ను ఆదా ప‌థ‌కాలు తెర మీద‌కు వ‌చ్చిన‌ట్టే.!

పీపీఎఫ్ లేదా డెట్ ఫండ్ + ఈఎల్ఎస్ఎస్‌ - ప‌ద‌వీ విర‌మ‌ణ సొమ్ము ఒక్క‌సారిగా ఖ‌ర్చు కాదు, కాకూడ‌దు. ఈ మొత్తాన్ని డెట్ ఫండ్ల‌లో పెట్టి కొన్నేళ్ల పాటు క్ర‌మానుగ‌తంగా వాడుకోవచ్చు. డెట్ ఫండ్ పై వ‌చ్చే లాభాల‌ను విత్‌డ్రా చేసుకుంటే ప‌న్ను వ‌ర్తిస్తుంది. ఐతే పీపీఎఫ్ మాదిరిగా 15ఏళ్ల పాటు డెట్ ఫండ్లు రాబ‌డుల‌ను అందించ‌వ‌చ్చు, అందించ‌లేక‌పోవ‌చ్చు! డెట్ ఫండ్లో ఉన్న సౌల‌భ్య‌త ఫ్లెక్సిబిలిటీ, ఎప్పుడైనా డ‌బ్బు తీసుకునే అవ‌కాశం. పీపీఎఫ్ మంచి ఎంపికే. ఐతే కేవ‌లం ప‌న్ను ఆదా కోస‌మైతే ఈ ప‌థ‌క‌మే ఎంచుకోవాల‌ని లేదు. భ‌విష్య‌త్‌లో వ‌డ్డీ రేట్ల త‌గ్గింపుతో వాస్త‌వ రాబ‌డి ఆశించినంత మేర ఉండ‌క‌పోవ‌చ్చు. ముఖ్యంగా మొత్తం డ‌బ్బంతా పీపీఎఫ్ లో పెట్టాల‌నుకునేవారికి ఇదో హెచ్చ‌రిక‌! కొంత ఈఎల్ఎస్ఎస్‌లో మ‌దుపు చేశాక మిగ‌తాది డెట్ ఫండ్ల‌లో పెట్టొచ్చు. 70శాతం ఈక్విటీల్లో, 30శాతం డెట్‌లో ఉండేలా జాగ్ర‌త్త తీసుకోవ‌చ్చు. ఇదే స‌రైన నిష్ప‌త్తి అని చెప్ప‌లేం. ఆర్థిక ప్ర‌ణాళిక‌లో అనేక విధాలుగా ప్ర‌యోగాలు చేసే అవ‌కాశం ఉంది. ల‌క్ష్యంపై స్ప‌ష్ట‌త వ‌స్తే అందుకు త‌గిన పథ‌కాల ఎంపిక చాలా సులువు. ఉత్త‌మ‌మైన ప‌థ‌క‌మంటూ ఏదీ ఉండ‌దు. అయినా మ‌న అవ‌స‌రాల‌కు, అప్ప‌టి అవ‌కాశాల‌కు త‌గిన‌ట్టు ఏదైనా మంచి ప‌థ‌కాన్ని ఎంచుకోవ‌డం అస‌లైన నేర్ప‌రిత‌నం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని