PPF vs NPS : పదవీ విరమణ కోసం ఏది ఎంచుకోవాలి?

ఆర్థిక ఒత్తిడి లేకుండా ప్రశాతంగా పదవీ విరమణ జీవితం సాగాలంటే, ఉద్యోగంలో ఉండగానే పదవీ విరమణకు కావాల్సిన నిధిని ఏర్పాటు చేసుకోవాలి.

Published : 24 Feb 2023 13:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆర్థిక ఒత్తిడి లేకుంటే.. పదవీ విరమణ జీవితం ప్రశాతంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉరుకులు, పరుగులు, పని ఒత్తిడి, బాధ్యతలు అంటూ తీరికే ఉండదు. కొన్నిసార్లు కంటినిండా నిద్రపోలేకపోవచ్చు కూడా. కానీ, పదవీవిరమణ తర్వాత పని ఒత్తిడి ఉండదు. కాబట్టి, మీకు నచ్చినట్లు సమయాన్ని ఆస్వాదించవచ్చు. ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లొచ్చు. ఏదైనా ఇష్టమైన పని చేయొచ్చు. కుటుంబం, స్నేహితులతో విలువైన కాలాన్ని గడపొచ్చు. అయితే, ఇదంతా ఆర్థిక ఒత్తిడి లేనప్పుడు మాత్రమే! కాబట్టి ఉద్యోగంలో ఉండగానే పదవీ విరమణకు కావాల్సిన నిధిని ఏర్పాటు చేసుకోవాలి.

పదవీ విరమణ నిధి కోసం పెట్టుబడులు పెట్టేటప్పుడు మీరు ఆయుర్ధాయం (అంచనాతో), ద్రవ్యోల్బణం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలి.  సొంత ఆదాయం నుంచి పదవీ విరమణ కోసం నిధిని సమకూర్చుకునేలా భారత ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా సామాజిక భద్రత పరిధిలోకి రాని వ్యక్తులకు పన్ను ప్రయోజనాలను చేకూరేలా పబ్లిక్‌ ప్రావిడెంట్ ఫండ్‌ (PPF), జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)లను అందిస్తోంది. అయితే, ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)..

ఈ పథకాన్ని ప్రభుత్వం 1968లో ప్రారంభించింది. ఈపీఎఫ్‌ కిందకి రాని వ్యక్తులు కూడా పదవీవిరమణ నిధిని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో ఏడాదికి కనీసం రూ.500, గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్‌ చేయవచ్చు. 15 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. ప్రస్తుత వడ్డీ రేటు 7.10%, పోస్టాఫీసు, నమోదిత బ్యాంకుల్లోనూ ఈ పథకం అందుబాటులో ఉంటుంది.

జాతీయ పింఛను పథకం(NPS)..

ఇది పదవీ విరమణ కోసం స్వచ్ఛందంగా కాంట్రిబ్యూట్‌ చేసే పథకం. మార్కెట్‌కు అనుసంధానమై ఉంటుంది. 18 నుంచి 70 ఏళ్ల లోపు వయసు గల వారు ఇందులో చేరవచ్చు. ఇది పదవీవిరమణ పథకం కాబట్టి 60 ఏళ్ల వయసు తర్వాత గానీ పూర్తి పెట్టబడులు ఉపసంహరించుకోలేరు. అప్పుడు కూడా 60% మాత్రమే ఏక మొత్తంగా తీసుకోవచ్చు. మిగిలిన 40%తో యాన్యుటీ కొనుగోలు చేయాలి. అయితే, రూ.5 లక్షలలోపు ఎన్‌పీఎస్‌ నిధి ఉన్నవారు నియమ నిబంధనలకు లోబడి పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో పాక్షిక విత్‌డ్రాలను అనుమతిస్తారు. పెట్టుబడులపై గరిష్ఠ పరిమితి లేదు. 

పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌కు ఉన్న పోలికలు..

  • రెండూ పదవీ విరమణ కోసం ఉద్దేశించినవి
  • పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. 
  • దీర్ఘకాల లాక్‌-ఇన్‌ పిరియడ్‌ ఉంటుంది. 
  • రాబడిపై పన్ను వర్తించదు. 

PPF vs NPS

నష్టభయం: పెట్టుబడిదారులు 100% రిస్క్‌ లేని పథకం కోసం చూస్తుంటే పీపీఎఫ్‌ అనుకూలంగా ఉంటుంది. కొంత రిస్క్‌ తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నవారు ఎన్‌పీఎస్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో పెట్టుబడులు ఈక్విటీ, డెట్‌ కలయికతో వస్తాయి.

రాబడి: పీపీఎఫ్‌ ప్రస్తుతం 7.10% వడ్డీని అందిస్తోంది. త్రైమాసిక ప్రాతిపదికన ప్రభుత్వం వడ్డీని సవరిస్తుంటుంది. వార్షిక ప్రాతిపదికన కాంపౌండ్‌ చేస్తారు. ఎన్‌పీఎస్‌ విషయానికి వస్తే.. ఇది మార్కెట్లకు అనుసంధానమై ఉంటుంది. కాబట్టి కచ్చితమైన వడ్డీ వస్తుందని  చెప్పలేం. అలాగే, మదుపర్ల రిస్క్‌ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఈక్విటీ, డెట్‌ నిష్పత్తి ఎంచుకోవచ్చు. అయితే ఈక్విటీల్లో గరిష్ఠగా 75% ఎంచుకునే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలం పాటు మదుపు చేస్తే ఈక్విటీల్లో కనీసం 12%, డెట్‌లో 8% వరకు రాబడిని పొందే అవకాశం ఉటుంది. దీని ప్రకారం.. ఒకవేళ చందాదారుడు ఈక్విటీ, డెట్‌ పెట్టుబడులను 60:40 నిష్పత్తిలో ఎంచుకుంటే 10.40% వరకు (ఈక్విటీలో 7.20% డెట్‌లో 3.20%) వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ చందాదారుడు 50:50 నిష్పత్తిలో నిధుల కేటాయిస్తే, దీర్ఘకాలికంగా 10% వరకు రాబడి పొందే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత పీపీఎఫ్‌ వడ్డీ రేటు (7.10%) కంటే 2.90% ఎక్కువ.

ఉదాహరణతో రాబడి తెలుసుకుందాం..

రామ్‌ పీపీఎఫ్‌లో.. శ్యామ్‌ ఎన్‌పీఎస్‌లో ఏడాదికి రూ.1.50 లక్షల చొప్పున 30 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టారనుకుందాం. మెచ్యూరిటీ నాటికి ఎంత రాబడి వస్తుందో చూద్దాం.  పీపీఎఫ్‌లో.. ప్రస్తుత వడ్డీ రేటు 7.10% చొప్పున లెక్కిస్తే.. రామ్‌ 25 ఏళ్లలో రూ.1.03 కోట్లు కూడబెట్టగలడు. ఇందులో రామ్‌ పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.37,50,000, వడ్డీ రూ.65,50,000. సాధారణం పీపీఎఫ్‌ కాలపరిమితి 15 సంవత్సరాలే అయినా ఐదేళ్ల చొప్పున పదవీకాలం పెంచుకోవచ్చు. ఈ పెంచుకున్న కాలవ్యవధిలోనూ పెట్టుబడులు కొనసాగించవచ్చు.

శ్యామ్‌ ఎన్‌పీఎస్‌లో.. ఈక్విటీ, డెట్‌లో 50:50 నిష్పత్తిలో పెట్టుబడి పెడితే, 10% రాబడి అంచనాతో 25 ఏళ్లలో దాదాపు రూ.1.65 కోట్ల వరకు కూడబెట్టగలడు. ఇందులో శ్యామ్‌ పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.37,50,000, రాబడి రూ.1,28,35,000. అయితే, శ్యామ్‌ మెచ్యూరిటీ సమయంలో నిధులు విత్‌డ్రా చేసుకుంటే దాదాపు రూ.98 లక్షలు (60%) ఏకమొత్తంగా తీసుకునే వీలుంటుంది. మిగిలిన రూ.67 లక్షలు (40%) యాన్యుటీలో పెట్టుబడి పెట్టాలి. తద్వారా పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.

ఆదాయపు పన్ను ప్రయోజనాలు: పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌ రెండూ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సి కింద రూ.1.50 లక్షల వరకు పెట్టుబడిపై ఆదాయపు పన్ను మినహాయింపును అందిస్తాయి. అయితే, ఎన్‌పీఎస్‌లో సెక్షన్‌ 80సిసిడి కింద అదనపు ఆదాయపు పన్ను రాయితీ అందుబాటులో ఉంది. కాబట్టి ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులపై గరిష్ఠంగా రూ.50 వేల వరకు అదనపు మినహాయింపు పొందొచ్చు. ఒకవేళ మీరు కొంత రిస్క్‌ తీసుకోగలిగితే.. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులు పెట్టి, సెక్షన్‌ 80సిలో ఉండే రూ.1.50 లక్షలు కాకుండా మరో రూ.50 వేలు మినహాయింపు పొందొచ్చు.

ఏది మంచిది?

పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌ రెండూ మంచి పథకాలే. అయితే రిస్క్‌ తీసుకోలేని వారికి పీపీఎఫ్‌, కొంత రిస్క్‌ తీసుకోగలిగిన వారికి ఎన్‌పీఎస్‌ అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనా పెట్టుబడిదారులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా, మంచి నిధిని సమకూర్చగల పెట్టుబడులనే పదవీ విరమణ కోసం ఎంపిక చేసుకోవాలి. కాబట్టి మీరు చిన్న వయసులోనే పదవీ విరమణ కోసం మదుపు చేస్తుంటే, వీటితో పాటు మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడం గురించి కూడా ఆలోచించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు