ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజనలో ఎలా చేరాలి?

ప్రమాదంలో మరణం సంభవించినా లేదా వైకల్యం సంభవించినా ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన పధకం ద్వారా కవరేజ్ లభిస్తుంది

Published : 20 Jan 2021 15:10 IST

మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు సామాజిక భద్రతా ప‌థ‌కాలలో ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన (పీఎమ్ఏస్‌బీవై) ఒకటి. మిగిలిన రెండు పధకాలు ప్రధాన్ మంత్రి జీవన జ్యోతి బీమా యోజన (పీఎమ్జేజేబీవై), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై).

ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన అంటే ఏమిటి?
ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన అనేది ప్రమాద బీమా పధకం. ఏదైనా ప్రమాదంలో మరణం సంభవించినా లేదా వైకల్యం సంభవించినా ఈ పథ‌కం అండ‌గా ఉంటుంది. దీని కాలపరిమితి ఒక సంవత్సరం. ప్రతి ఏటా దీనిని పునరుద్ధరించుకోవచ్చు.

ఈ పథ‌కంలో ఏం కవర్ అవుతాయి? అలాగే ఎంత మొత్తం క్లెయిమ్ చేసుకోవచ్చు?
ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద చందాదారుడు ప్రమాదానికి గురై మరణించినా లేదా శాశ్వతంగా వైకల్యానికి గురైనా రూ. 2 లక్షలు, పాక్షిక వైకల్యానికి గురైతే రూ.1 లక్ష పరిహారం లభిస్తుంది. ప్రమాదంలో రెండు కళ్ళు పూర్తిగా కోల్పోయినా, రెండు చేతులు, కాళ్ళు కోల్పోయినా దానిని శాశ్వత వైకల్యంగా గుర్తిస్తారు. అదే ఒక కాలు లేదా ఒక చెయ్యి కోల్పోయి, కంటి చూపు కోల్పోయినా దానిని పాక్షిక వైకల్యంగా గుర్తిస్తారు. దీనిని మీరు అదనంగా ఏదైనా ఇతర బీమా పథకంతో కలిపి కవర్ చేసుకోవచ్చు. ఈ పథ‌కం ద్వారా మీకు ఎలాంటి ఆసుపత్రి ఖర్చులు తిరిగిరావు. కేవలం ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు మాత్రమే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన చేర్పులు , మినహాయింపులు:
సహజ విపత్తుల కారణంగా జరిగిన ప్రమాదాలు, మరణం లేదా వైకల్యం మాత్రమే ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన పథకం కింద కవర్ అవుతుంది. ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో ఈ పథ‌కం వర్తించదు. ఇలాంటి సందర్భాల్లో వారి కుటుంబానికి కూడా ఎలాంటి బీమా ప్రయోజనం కలుగదు. ఒకవేళ చందాదారుడు హత్యకు గురైతే మాత్రం బీమా కవరేజ్ లభిస్తుంది.

అర్హత:
వయస్సు 18 - 70 సంవత్సరాల మధ్య ఉండి, ఏదైనా బ్యాంకులో ఖాతా కలిగిన వారు ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన పథకంలో చేరడానికి అర్హులు. ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటే, అప్పుడు మీరు ఏదైనా ఒక బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకంలో చేరే అవకాశం ఉంటుంది. ఇక ఉమ్మడి ఖాతా విషయానికి వస్తే, ఖాతాలో పేర్లు ఉన్నవారందరూ ఈ పథ‌కంలో చేరవచ్చు. ఎన్ఆర్ఐలు కూడా ఈ పధకంలో చేరడానికి అర్హులు. కానీ క్లెయిమ్ చేయాల్సి వచ్చిన సమయంలో లబ్ధిదారుడికి / నామినీకి భారత కరెన్సీలో చెల్లింపు చేస్తారు.

ప్రీమియం ఎంత, ఎలా చెల్లించాలి?
ఈ పథ‌కంలో చేరేవారు సంవత్సరానికి రూ. 12 ల ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. ఈ మొత్తం ప్రతీ సంవత్సరం జూన్ 1 లోగా మీ బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్ పద్దతిలో కట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ జూన్ 1 తరువాత ఆటో డెబిట్ పద్ధ‌తి ద్వారా మీ ఖాతా నుంచి డబ్బు కట్ అయినట్లయితే ఆ తేదీ నుంచి బీమా ప‌థ‌కం అమ‌లు అవుతుంది.

ప్రతి సంవత్సరం జూన్ 1 లోగా పాలసీని పునరుద్ధరించుకోవలసి ఉంటుంది. ఎవరైనా చందాదారుడు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల ద్వారా ఈ పధకంలో చేరినట్లైతే, క్లెయిమ్ సమయంలో కేవలం ఒక బ్యాంకు ఖాతాకు మాత్రమే చెల్లిస్తారు. ఇతర బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లించిన ప్రీమియంను కోల్పోవలసి ఉంటుంది. ప్రీమియం అనేది క్లెయిమ్ చేసిన దాని ఆధారంగా మారుతూ ఉంటుంది. అయితే, ఊహించని ప్రతికూల ఫలితాలను మినహాయిస్తే మొదటి మూడేళ్ళలో ప్రీమియంలో ఎటువంటి మార్పులు ఉండవు. అలాగే చందాదారులకు బ్యాంకులు పాలసీకి సంబంధించిన ఎలాంటి పాలసీ సర్టిఫికెట్ ను జారీచేయవు.

పథ‌కం లో ఎలా చేరాలి?
ఈ పథ‌కాన్ని ప్ర‌భుత్వ రంగ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, అలాగే బ్యాంకుల సహకారంతో ఇతర సాధారణ బీమా సంస్థల నుంచి పొంద‌వ‌చ్చు. బ్యాంకులు వారి చందాదారుల కోసం ఉచితంగా ఈ పథ‌కాన్ని అమలు చేసేందుకు సాధారణ బీమా సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి.

ఈ పథ‌కంలో చేరడానికి, మీరు http://www.jansuraksha.gov.in/Forms-PMSBY.aspx ద్వారా అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని, దానిని పూర్తి చేసి మీ బ్యాంకులో అందించాలి. కొన్ని బ్యాంకులు ఎస్ఎంఎస్ ఆధారిత నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ పధకంలో చేరవచ్చు.

ఎప్పటి వరకు ఈ పథ‌కం వ‌ర్తిస్తుంది?
కింది తెలిపిన వాటిలో ఏదైనా జరిగితే చందాదారుడి ప్రమాద కవరేజ్ ముగుస్తుంది.

70 ఏళ్ళ వయస్సు దాటడం

బ్యాంకు ఖాతాను మూసివేయడం లేదా బీమాను కొన‌సాగించేందుకు సరిపడా మొత్తం మీ ఖాతాలో లేకపోవడం.

ఒకవేళ చందాదారుడు ఒకటి కంటే ఎక్కువ ఖాతాల ద్వారా పథ‌కంలో చేరి ప్రీమియం చెల్లిస్తున్నట్లైతే, బీమా కవర్ కేవలం ఒక ఖాతాకు మాత్రమే పరిమితం అయి మిగిలిన ఖాతాల ద్వారా చేసిన బీమా పాల‌సీలు ర‌ద్ద‌వుతాయి.

క్లెయిమ్ కోసం ఏం చేయాలి?
ప్రమాదవశాత్తు చందాదారుడు మరణిస్తే, దాన్ని ధ్రువీకరించడానికి సరైన పత్రాలను సాక్ష్యంగా చూపించినట్లైతే పీఏంఏస్బీవై పధకం కింద క్లెయిమ్ మంజూరు అవుతుంది. ఒకవేళ రోడ్డు, రైలు, ఏదైనా వాహన ప్రమాదం, నీటిలో మునిగిపోవడం, హత్యకు గురికావ‌డం వంటి మరణాలు సంభవించినట్లైతే వాటిని పోలీసులకు ధ్రువీకరించాలి. అలాగే పాము కాటు, చెట్టు పై నుంచి కింద పడి చనిపోయినట్లైతే ఆ మరణాలను ఆసుపత్రి వారు ధ్రువీక‌రించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ పథ‌కం ద్వారా క్లెయిమ్ లభిస్తుంది.

చందాదారుడు మరణించిన సందర్భంలో, అభ్యర్థన నమోదు పత్రం ప్రకారం నామినీ క్లెయిమ్ కోసం దాఖలు చేయవచ్చు. ఒకవేళ నామినీ పేరును అభ్యర్థన నమోదు పత్రంలో తెలుపకపోతే అప్పుడు తన చట్టపరమైన వారసుడు క్లెయిమ్ కోసం దాఖలు చేసుకోవచ్చు. మరణం తాలూకా క్లెయిమ్ లు నామినీ / చట్టపరమైన వారసుల బ్యాంకు ఖాతాలో జమవుతాయి. అదే వైకల్యం తాలూకా క్లెయిమ్ లు మాత్రం చందాదారుడి బ్యాంకు ఖాతాలో జమవుతాయి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని