Updated : 16 Jul 2022 17:39 IST

Second Hand Cars: సెకెండ్ హ్యాండ్ కారు రుణమా? ప్రత్యామ్నాయాలివిగో..

ఇంటర్నెట్‌ డెస్క్‌: భార‌త్‌లో పాత కార్ల‌కు డిమాండ్ పెరుగుతోంది. త‌క్కువ ధ‌ర‌కే విలాస‌వంత‌మైన కార్ల‌ను కొనే అవ‌కాశం ఉండడమే డిమాండ్ పెరగ‌డానికి ముఖ్య కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. వ్యాపార కార్య‌క‌లాపాల‌ కోసం 5, 6 ఏళ్లు కారు వినియోగించే వారు కూడా పాత కార్ల కొనుగోలుకు ఎక్కువ‌గా మొగ్గుచూపుతుంటారు. ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు కారు విక్ర‌య సంస్థ‌లు.. సొంతంగా వినియోగించిన కార్ల డివిజ‌న్ల‌ను నిర్వ‌హిస్తున్నాయి. అలాగే చాలా వ‌ర‌కు బ్యాంకులు, బ్యాంకింగేత‌ర సంస్థ‌లు (ఎన్‌బీఎఫ్‌సీలు), ఫిన్‌టెక్ సంస్థ‌లు సెకెండ్ హ్యాండ్ కార్ల‌కు రుణాల‌ను అందిస్తున్నాయి.

సాధార‌ణంగా కొత్త కార్ల‌తో పోలిస్తే, పాత కార్ల రుణాల వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌గా ఉంటాయి. కొత్త కార్లకు త‌యారీ సంస్థ గ్యారెంటీ ఉంటుంది. అందువ‌ల్ల ఇందులో న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉంటుంది. పాత కార్ల‌కు ఇది ఉండ‌దు కాబ‌ట్టి రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల వ‌డ్డీ రేటు కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. అలాగే రుణ కాల‌ప‌రిమితి కూడా త‌క్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి రుణాల కోసం వెళ్లేముందు వ‌డ్డీ రేట్లు, చెల్లింపుల‌కు ఇచ్చే కాల‌ప‌రిమితి వంటివి ప‌రిశీలించ‌డం మంచిది. అంతేకాకుండా బ్యాంకులు ఫిక్స్‌డ్ లేదా వేరిబుల్.. ఏ వ‌డ్డీ రేటు వ‌ర్తింప చేస్తున్నాయో తెలుసుకోవాలి.

కొత్త కారు కొనుగోలుదారులకు 7 నుంచి 13 శాతం వ‌డ్డీ రేటుతో రుణాలు అందుబాటులో ఉండ‌గా.. సెకెండ్ హ్యాండ్ కారుకు వ‌ర్తించే రుణాల వ‌డ్డీ రేట్లు 9 నుంచి 16 శాతం మ‌ధ్య‌లో ఉంటున్నాయి. కారు ఎంత పాత‌ది, రుణ గ్ర‌హీత క్రెడిట్ స్కోరు వంటి ప‌లు అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని వ‌డ్డీ రేట్లు నిర్ణయిస్తారు. కాబ‌ట్టి అందరికీ ఒకేర‌క‌మైన వ‌డ్డీ రేటుతో రుణం ల‌భించ‌దు. రుణం తీసుకునే వారు ప్రాసెసింగ్ ఫీజు, ఇత‌ర ష‌ర‌తుల‌ను తెలుసుకోవాలి. ఒక‌వేళ బ్యాంకు సెకెండ్ హ్యాండ్ రుణాల‌ను అందించే ష‌ర‌తులు మీకు అనుకూలంగా లేవు అనుకుంటే రుణానికి ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ప‌రిశీలించ‌వ‌చ్చు. 
వ్య‌క్తిగ‌త రుణం: వ్య‌క్తిగ‌త రుణాన్ని.. వ్య‌క్తులు వారి అవ‌స‌రాల కోసం తీసుకోవ‌చ్చు. ఎందుకోసం తీసుకుంటున్నారో రుణ సంస్థ‌కు తెలియజేయ‌న‌వ‌స‌రం లేదు. కాబ‌ట్టి సెకెండ్ హ్యాండ్ కారు కొనుగోలు కోసం వ్య‌క్తిగ‌త రుణాన్ని ప‌రిశీలించ‌వ‌చ్చు. అలాగే పాత కార్లు వ‌డ్డీ రేటు, వ్య‌క్తిగ‌త రుణ వ‌డ్డీ రేట్లు దాదాపు ఒకేలా ఉంటాయి. వ్య‌క్తిగ‌త రుణాన్ని కొంచెం త‌క్కువ రేటుతో కూడా అందించే అవ‌కాశం ఉంటుంది. ఇందుకోసం ముందుగా మీ క్రెడిట్ ప్రొఫైల్‌ని చెక్ చేసుకోవాలి. మంచి క్రెడిట్ స్కోరు నిర్వ‌హించేవారికి త‌క్కువ వ‌డ్డీ రేటుకే రుణం ల‌భిస్తుంది.

టాప్-అప్ రుణం: ఇప్ప‌టికే గృహ రుణం తీసుకున్న వారికి ఈ ఆప్ష‌న్ అందుబాటులో ఉంటుంది. ద‌ర‌ఖాస్తుదారుని రుణ అర్హ‌త, ప్ర‌స్తుతం ఉన్న గృహ‌ రుణం, గృహ రుణానికి ఉన్న కాల‌పరిమితి ఆధారంగా టాప్‌-అప్‌లోన్‌ ఇస్తారు. ఇది అన్నింటికంటే చౌకైన మార్గంగా చెప్పుకోవ‌చ్చు.

ఏ రుణం తీసుకోవాలి?: ముందుగా మీరు కొనుగోలు చేసే కారు ఎంత పాత‌ది? రుణం కోసం బ్యాంకుకి వెళితే ఎంత రుణం ల‌భిస్తుంది? డౌన్‌పేమెంట్ ఎంత చేయాలి?వ‌డ్డీ రేటు ఎంత‌? ఈఎంఐ, ప్రాసెసింగ్ ఫీజు, ఇత‌ర ఛార్జీలు ఏమైనా వ‌ర్తిస్తాయా తెలుసుకోవాలి. మీరు మంచి క్రెడిట్ స్కోరు నిర్వ‌హిస్తుంటే వ‌డ్డీ రేటు కొంచెం త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. అలాగే, స‌ర్టిఫైడ్ సంస్థ ద్వారా కారు కొనుగోలు చేస్తే రుణం తొంద‌రగా ల‌భించే అవ‌కాశం ఉంటుంది. ఒక‌వేళ వ‌డ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయ‌ని అనిపించినా, బ్యాంకు రుణం ఇచ్చేందుకు ఆమోదించ‌క‌పోయినా వ్య‌క్తిగ‌త రుణం, హోమ్ లోన్ టాప్ అప్ (ఇప్ప‌టి గృహ రుణం ఉన్న‌వారు మాత్ర‌మే) కోసం ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని