Published : 16 Jul 2022 15:50 IST

Real Estate: స్థిరాస్తి కొనుగోళ్ల‌కు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

అధికంగా పెట్టుబ‌డులు పెట్టే స్థోమ‌త ఉన్న‌వారు పెట్టుబ‌డుల‌కు షేర్స్, మ్యూచువ‌ల్ ఫండ్స్‌, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారం క‌న్నా కూడా స్థిరాస్తి మీదే ఎక్కువ‌ ఆస‌క్తి చూపుతున్నారు. త‌క్కువ వ‌డ్డీ రేట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఆస‌క్తి త‌గ్గ‌డానికి కార‌ణ‌మైంది. 2020 మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో లాక్‌డౌన్‌కి ముందు మదుపర్ల నుండి మంచి ఆద‌ర‌ణ పొందిన స్థిరాస్తి రంగం కొన్ని నెల‌ల‌ పాటు నిరాశ క‌లిగించినా..ఇపుడు మ‌ళ్లీ పెట్టుబ‌డిదారులు మెచ్చే పూర్వ స్థాయికి చేరుకుంది.

ప్ర‌స్తుతం ఇంకా త‌క్కువనే కొన‌సాగుతున్న‌ గృహ రుణ వ‌డ్డీ రేట్లతో ఇల్లు కొన‌డానికి లేదా త‌గిన‌న్ని నిధులుంటే స్థ‌లం కొన‌డానికి అనువైన స‌మ‌యం ఇదేన‌ని కొనుగోలుదారులు భావిస్తున్నారు. ఇంత‌కు ముందు రియ‌ల్ ఎస్టేట్‌కు దూరంగా ఉండే యువత కూడా వారి ఉపాధి ఆదాయాలు పెర‌గ‌డంతో ఈ ఆస్తుల‌కు ప్రాధాన్య‌తిస్తున్నారు.

నాణ్య‌త‌పైనే ఆస‌క్తి:
ఆస్తిని కొనాల‌ని చూస్తున్న ఎక్కువ‌ మంది పెట్టుబ‌డిదారులు ఇంటిని స్వ‌యం వినియోగం కోస‌మే తీసుకుంటున్నారు. స్థ‌లాలు కొనేవారు మాత్రం పెట్టుబ‌డి కోణంలో ఆలోచిస్తున్నారు. పెట్టుబ‌డికి ఇబ్బంది లేనివారు, కాస్త విలాస‌వంత‌మైన జీవ‌నాన్ని కోరుకునేవారు బ్రాండెడ్ డెవ‌ల‌ప‌ర్‌ల ద‌గ్గ‌ర కొనుగోలు సుర‌క్షిత‌మ‌ని, నాణ్య‌త బావుంటుంద‌ని భావిస్తున్నారు. రూ. 50 ల‌క్ష‌ల నుండి రూ. 1.50 కోట్ల గృహ‌ల వ‌ర‌కు వినియోగదారులు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. విలాసవంతమైన ఆస్తుల కొనుగోళ్ల‌ డిమాండ్ జాబితాలో ముంబాయి, బెంగ‌ళూరు న‌గ‌రాల త‌ర్వాత హైద‌రాబాద్ కూడా చేరింది.

వివిధ అనుమతులు:
ఈ రంగంలో ఆస్తి కొనుగోలు అన్న‌ది అధిక పెట్టుబ‌డుల‌తో కూడుకున్న‌ది. అటువంటి ప‌రిస్థితుల్లో జాగ్ర‌త్త‌లు కూడా ఎక్కువే తీసుకోవాలి. మీరు ఆస్తిని కొనుగోలు చేయాల‌నుకుంటున్న న‌గ‌ర స‌మ‌గ్ర స్థిరాస్తి మార్కెట్‌ని ప‌రిశోధ‌న చేయాలి. ఆ ప్రాంత అభివృద్ధి, ర‌హ‌దారులు, హైవే, ఎక్స్‌ప్రెస్ వే, క‌నెక్టివిటీ, ఆస్తి వ్యూహాత్మ‌క స్థానం వంటి ప్ర‌తిదీ తెలుసుకోవాలి. నిర్మించ‌బ‌డిన ఇంటిని కొనుగోలు చేసేట‌ప్పుడు యాజ‌మాన్య ధృవీక‌ర‌ణ ప‌త్రం, బిల్డింగ్ లే అవుట్ ఆమోదం, ఆక్యుపెన్సీ స‌ర్టిఫికేట్‌, వ్య‌వ‌సాయేత‌ర అనుమ‌తి, నీరు, అగ్నిమాప‌క విభాగం ఆమోదం వంటి అన్ని సంబంధిత ఆమోదాలు ఉన్నాయో లేదో త‌నిఖీ చేసుకోవాలి. నివాసం మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించ‌డానికి `రియ‌ల్ ఎస్టేట్ రెగ్యులేట‌రీ అథారిటీ (RERA)` రిజిస్ట్రేష‌న్ కూడా త‌నిఖీ చేయాలి.

మౌలిక స‌దుపాయాలు:
స‌మీపంలోని ప్ర‌ధాన ర‌హ‌దారులు, మెట్రో స్టేష‌న్‌లు, బ‌స్సులు, ఆటోలు వంటి ప్ర‌జా ర‌వాణాతో స్థిర‌మైన సంబంధాలు ఉన్న ప్ర‌దేశాల‌లో ఆస్తుల‌ను కొనుగోలు చేస్తే భ‌విష్య‌త్తులో మంచిది. నివాస యోగ్య‌త‌కు సుర‌క్షిత‌మైన‌, సుల‌భ‌మైన ప్ర‌యాణ సాధ‌నాలు ద‌గ్గ‌ర్లో క‌లిగి ఉండాలి. అంతేకాకుండా స్థిరాస్తికి స‌మీపంలో పాఠ‌శాల‌లు, వాణిజ్య భ‌వ‌నాలు, ఆసుప‌త్రులు ఉన్నాయో లేదో కూడా నిర్ధారించుకోవాలి. ఈ సౌక‌ర్యాల‌న్ని మ‌న ప్రాథ‌మిక అవ‌స‌రాలు తీర్చ‌డమే కాకుండా ఆస్తి విలువ పెంచడం లో ముఖ్య‌పాత్ర పోషిస్తాయి.

ప‌రిశీల‌న అవ‌స‌రం:
స్థిరాస్తి అభివృద్ధి చేసే నిర్మాణ‌దారుడు ఏదైనా ప్రాజెక్ట్‌కి వెన్నెముక‌. కాబ‌ట్టి, పెట్టుబ‌డి పెట్ట‌డానికి ముందు, బిల్డ‌ర్ గ‌త రికార్డు, అత‌ను ఎన్ని ప్రాజెక్ట్‌ల‌ను పూర్తి చేశాడు, స‌గ‌టున గృహాన్ని అప్ప‌గించే స‌మ‌యం, నిర్మాణ నాణ్య‌త‌ను ప‌రిశీలించాలి. ఇది నిర్మాణ‌దారుని బ‌లాలు, బ‌ల‌హీన‌త‌ల‌ను అంచ‌నా క‌ట్ట‌డానికి మీకు ఉప‌యోగ‌ప‌డుతుంది. నిర్మాణ‌దారుని ఆర్ధిక ప‌రిస్థితి, స్థ‌లాల ఎంపిక‌లో అత‌ను తీసుకునే జాగ్ర‌త్త‌లు ప‌రిశీలించాలి.

చివరిగా:

ఆస్తిని కొనుగోలు చేయాలంటే పెట్టుబ‌డులు కూడా అధిక‌ స్థాయిలోనే ఉండాలి. వినియోగ‌దారుల‌ అజాగ్ర‌త్త‌ను మోసంగా మార్చివేసే అవకాశం కూడా లేకపోలేదు. కాబ‌ట్టి స్థిరాస్తి రంగంలో పెట్టుబ‌డి పెట్టేవారు, ఆస్తుల‌ను కొనుగోలు చేసేవారు ముందు త‌గిన గ్రౌండ్ వ‌ర్క్ చేయ‌డం చాలా అవ‌స‌రం. న‌గ‌ర స్థిరాస్తుల‌లో పెట్టుబ‌డులు పెట్టేవారు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని