Health Insurance: సీనియ‌ర్ సిటిజ‌న్లు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

సీనియ‌ర్ సిటిజ‌న్లు వారి వైద్య ఖ‌ర్చుల‌ను సుల‌భంగా తీర్చుకునేందుకు వారికి ఆరోగ్య బీమా క‌వ‌రేజీ అవ‌స‌రం.

Updated : 30 Aug 2022 15:25 IST

ఆరోగ్యం నిజ‌మైన సంప‌ద‌. కానీ వృద్ధులకు ఆరోగ్య‌క‌ర‌మైన జీవితం ఖ‌ర్చుతో కూడుకున్నది. ప్ర‌తి సంవ‌త్స‌రం వైద్య ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుతున్నందున ఆరోగ్య బీమా పాల‌సీ లేని చాలా మంది సీనియ‌ర్ సిటిజ‌న్‌ల‌కు వారి ఉద్యోగ విర‌మ‌ణ కాలంలో వైద్య ఖ‌ర్చుల‌ను భ‌రించ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని. సీనియ‌ర్ సిటిజ‌న్లు వారి వైద్య ఖ‌ర్చుల‌ను సుల‌భంగా తీర్చుకునేందుకు ఆరోగ్య బీమా క‌వ‌రేజీ అవ‌స‌రం. అయితే, కొన్ని సార్లు ఆరోగ్య బీమా పాల‌సీ ఉన్న‌ప్ప‌టికీ, కొంత‌మంది వృద్ధులు ఆర్ధిక స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌చ్చు. దీనికి కార‌ణం స‌రైన ఆరోగ్య పాల‌సీని ఎంచుకోక‌పోవ‌డం, పాల‌సీ ల‌క్ష‌ణాల గురించి స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డం.

ఆరోగ్య బీమా పాల‌సీని కొనుగోలు చేసే ముందు సీనియ‌ర్ సిటిజ‌న్లు తీసుకోవాల్సిన కొన్ని ముఖ్య‌మైన జాగ్ర‌త్త‌లు, విష‌యాలు ఉన్నాయి. 

బీమాలో ప్ర‌వేశంః

60 ఏళ్లు దాటిన త‌ర్వాత కొత్త ఆరోగ్య బీమా క‌వ‌ర్‌ను పొంద‌డం చాలా క‌ష్ట‌త‌రం అవుతుంది. కాబ‌ట్టి ఇప్ప‌టికే ఉన్న బీమాని స‌కాలంలో పునరుద్ధరించడం మంచిది. కొన్ని బీమా కంపెనీలు ఆరోగ్య పాల‌సీలో ప్ర‌వేశం, పునరుద్ధరణ కోసం గ‌రిష్ట వ‌య‌స్సుపై ప‌రిమితిని విధించాయి. అందుచేత జీవిత కాల పున‌రుద్ధ‌ర‌ణ ఎంపిక‌ను అనుమ‌తించే పాల‌సీని తీసుకోండి. అయితే, పాల‌సీ కొనుగోలు ఖ‌ర్చు ఎక్కువే ఉంటుంది.

వెయిటింగ్ పీరియ‌డ్ః

ఆరోగ్య బీమా కంపెనీలు నిర్దిష్ట కాల వ్య‌వ‌ధికి నిర్దిష్ట వ్యాధుల‌కు క‌వ‌ర్‌ని ప‌రిమితం చేస్తాయి. ఇది సాధార‌ణంగా 2 నుండి 4 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఉంటుంది. సీనియ‌ర్ సిటిజ‌న్‌ల కోసం ఆరోగ్య బీమా పాల‌సీని కొనుగోలు చేస్తున్న‌ప్పుడు వెయిటింగ్ పీరియ‌డ్ లిస్ట్‌లో త‌క్కువ సంఖ్య‌లో అనారోగ్యాలు ఉన్న‌, త‌క్కువ వెయిటింగ్ పీరియ‌డ్‌తో వైద్యాన్ని అందించే బీమా పాల‌సీల‌ను కొనుగోలు చేయ‌డానికి ప్ర‌య‌త్నించాలి.

మిన‌హాయింపుల జాబితాః

సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు శాశ్వ‌త మిన‌హాయింపుల జాబితాలో పేర్కొన్న వ్యాధులకు చికిత్స స‌మ‌యంలో చేసే ఖ‌ర్చుల కోసం బీమా కంపెనీలు క్లెయిమ్‌ను అంగీక‌రించ‌క‌పోవ‌చ్చు. ఆరోగ్య బీమా పాల‌సీని కొనుగోలు చేసేట‌పుడు, మీరు త‌ప్ప‌నిస‌రిగా శాశ్వ‌త మిన‌హాయింపుల జాబితాను చెక్ చేసుకోవాలి. అతి త‌క్కువ సంఖ్య‌లో వ్యాధి మిన‌హాయింపులు ఉన్న బీమా పాల‌సీని తీసుకోండి.

స‌హ-చెల్లింపుః

కొన్ని పాలసీలలో చికిత్స ఖ‌ర్చులో కొంత శాతాన్ని బీమా పాల‌సీ తీసుకున్న సీనియ‌ర్ సిటిజ‌న్లు భ‌రించాలి. ఇటువంటి చెల్లింపు బాధ్య‌త‌ను స‌హ‌-చెల్లింపు అంటారు. ఆరోగ్య బీమా పాల‌సీని కొనుగోలు చేసేట‌ప్పుడు, సున్నా లేదా అతితక్కువ స‌హ-చెల్లింపు అవ‌స‌ర‌మున్న పాల‌సీని ఎంచుకోండి.

క్లెయిమ్ ప‌రిమితులుః

ఆరోగ్య బీమా సంస్థ.. పాలసీ దారుడు ఎంచుకున్న ఆసుపత్రి గ‌దికి అద్దెపై ప‌రిమితిని విధించ‌వ‌చ్చు. దీంతో బీమా చేసినవారు త‌ప్ప‌నిస‌రిగా ఆ ప‌రిమితి మేర అద‌న‌పు ఖ‌ర్చును భ‌రించాలి. గది అద్దె పెరిగినప్పుడు దానితో కూడిన మందుల చార్జీలు, నర్స్ చార్జీలు, డాక్టర్ విజిట్ లాంటి అనేక చార్జీలు కూడా పెరుగుతాయి. ఆరోగ్య పాల‌సీని ఎంచుకునేట‌పుడు ఇలాంటి ప‌రిమితులు లేని, లేదా త‌క్కువ సంఖ్య‌లో ప‌రిమితులు ఉండే బీమా పాల‌సీని క‌లిగి ఉండ‌టం మేలు. 

ఆరోగ్య ప‌రీక్ష‌లుః

వృద్ధాప్య రోగుల‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా ఆరోగ్య ప‌రీక్ష‌లు అవ‌స‌రం. కానీ, కొన్ని బీమా కంపెనీలు ఈ ప‌రీక్ష‌ల‌కు సీలింగ్, నిబంధ‌న‌లు విధిస్తాయి. అందుచేత మెడిక‌ల్‌ చెక‌ప్ ఖ‌ర్చుల‌ను పూర్తిగా భ‌రించే ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకోవాలి.

నో క్లెయిమ్ బోన‌స్ః

చాలా ఆరోగ్య బీమా సంస్థ‌లు, పాల‌సీదారుని ప్ర‌తీ క్లెయిమ్‌-ర‌హిత సంవ‌త్స‌రానికి, వారి నిర్ణీత శాతంలో బీమా మొత్తాన్ని పెంచుతారు. ఈ బీమా హామీ పెరుగుద‌ల కంపెనీ నుండి కంపెనీకి మారుతుంది. క్లెయిమ్ లేనప్పుడు బీమా మొత్తాన్ని గ‌రిష్ట మొత్తంలో పెంచే బీమా పాల‌సీని కొనుగోలు చేయ‌డం మంచిది. అయితే, సీనియర్ సిటిజన్స్ విషయం లో క్లెయిమ్ ఉన్నప్పుడు బీమా హామీ తగ్గకుండా ఉంటే మంచిది.

ఇత‌రాలుః

సీనియ‌ర్ సిటిజ‌న్స్‌ ఆరోగ్య బీమా పాల‌సీని ఎంచుకున్న‌ప్పుడు పైన పేర్కొన్న అంశాలే కాకుండా, క్లెయిమ్ త‌ర్వాత క‌వ‌ర్ పునరుద్ధరణ, జీరో డిడక్టిబుల్‌, ఎయిర్ అంబులెన్స్ క‌వ‌ర్‌, క్లిష్ట అనారోగ్యానికి అధిక క‌వ‌ర్‌, చికిత్స ఏర్పాట్ల‌లో సైకియాట్రిక్‌ను చేర్చ‌డం వంటి విష‌యాల‌పై కూడా దృష్టి పెట్టాలి. కొన్ని కంపెనీలు మొద‌ట్లో త‌క్కువ ప్రీమియం వ‌సూలు చేయ‌వ‌చ్చు. కానీ నిర్దిష్ట వ‌య‌స్సు దాటిన త‌ర్వాత వారి ప్రీమియం గ‌ణ‌నీయంగా పెంచేస్తాయి. ఇవ‌న్నీ స‌రిచూసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని