సీనియర్‌ సిటిజన్లూ!.. ఎఫ్‌డీలు చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..

చిన్న బ్యాంకుల్లో ఎఫ్‌డీలు వేసేట‌పుడు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల‌ను విభ‌జించండి.

Updated : 15 Apr 2022 15:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధార‌ణంగా సీనియ‌ర్ సిటిజ‌న్లు గ్యారెంటీ హామీనిచ్చే బ్యాంకు డిపాజిట్ల‌లో పొదుపు చేయ‌డం మ‌న దేశంలో ఎప్ప‌టి నుంచో ఉంది. కానీ కొవిడ్ ప‌రిస్థితుల్లో ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగిపోయి బ్యాంకుల్లో ఇచ్చే వ‌డ్డీ రేట్ల‌కు బ‌య‌ట మార్కెట్లో ల‌భించే వ‌స్తువుల రేట్ల‌కు ఎక్క‌డా పొంత‌న లేదు. పోనీ ఈక్విటీ మార్కెట్‌ల‌లో పెట్టుబ‌డులు పెడ‌దామంటే రిస్క్ ఎక్కువుంటుంద‌ని, ఈక్విటీ పెట్టుబ‌డులు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు స‌రికావ‌ని మార్కెట్ నిపుణుల అభిప్రాయం. అందువ‌ల్ల సీనియ‌ర్ సిటిజ‌న్లు బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు ఎక్కువ ప్రాధాన్య‌ం ఇస్తారు. ఎఫ్‌డీల‌కు ఎప్పుడైనా లిక్విడేష‌న్‌, గ్యారెంటీ రాబ‌డి వంటి అనేక ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. అంతేకాకుండా రుణాలు అవ‌స‌ర‌మ‌య్యే చోట తాక‌ట్టుగా కూడా ప‌నికొస్తాయి. అయితే బ్యాంకుల్లో వ‌డ్డీ రేట్లు భ‌విష్య‌త్తులో పెర‌గ‌వ‌చ్చ‌ని ఆర్థిక నిపుణుల అభిప్రాయపడుతున్నారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డి పెట్టేట‌పుడు దీర్ఘకాలిక ఎఫ్‌డీల కంటే స్వ‌ల్ప‌, మ‌ధ్య కాల ఎఫ్‌డీ వ‌డ్డీ రేట్లు మార్పుకు వేగంగా స్పందిస్తాయి. మ‌ధ్య‌కాలిక డిపాజిట్ల‌కు, దీర్ఘ‌కాలిక డిపాజిట్ల‌కు వ‌డ్డీ రేట్ల‌లో పెద్ద తేడాలు ఉండ‌టం లేదు. కాబ‌ట్టి దీర్ఘ‌కాలిక ఎఫ్‌డీల‌కు సిద్ధం కాకూడ‌దు. స్వ‌ల్ప‌, మ‌ధ్య‌కాలిక మెచ్యూరిటీ ఉన్న ఎఫ్‌డీల‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం వల్ల మెచ్యూరిటీ కాల వ్య‌వ‌ధి వేగంగా అయిపోతుంది. దీనివల్ల వ‌చ్చిన న‌గ‌దుతో త‌దుప‌రి ఆర్థిక ల‌క్ష్యం వైపు అడుగులు వేయొచ్చు. ఉదా: మీరు 10 ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటే దాన్ని 1 సంవ‌త్స‌రం నుంచి 5 సంవ‌త్స‌రాల వ‌ర‌కు 5 ఎఫ్‌డీలుగా విభ‌జించ‌వ‌చ్చు. మెచ్యూరిటీ స‌మ‌యంలో మీకు అవ‌స‌రం ఉన్న‌ట్ల‌యితే మీరు ఆ మొత్తాన్ని ఉప‌యోగించ‌వ‌చ్చు. లేదా ఏదైనా గ్యారెంటీ ప‌థ‌కంలో పొదుపు చేయ‌వ‌చ్చు.

పెద్ద బ్యాంకుల్లో అయితే ఎఫ్‌డీలు ఎక్కువ మొత్తంలో పెట్ట‌వ‌చ్చు గానీ, చిన్న బ్యాంకుల్లో, కో-ఆప‌రేటివ్ బ్యాంకుల్లో రూ.5 ల‌క్ష‌ల క‌న్నా ఎక్కువ డిపాజిట్ వేయ‌క పోవ‌డ‌మే మంచిది. చిన్న బ్యాంకుల్లో ఎఫ్‌డీలు వేసేట‌పుడు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల‌ను విభ‌జించండి. ఒక్కో బ్యాంకులో వేర్వేరు వ‌డ్డీ రేట్లు ఉన్న‌ప్పుడు ఆ అధిక వ‌డ్డీ రాబ‌డుల‌ను పొందే అవ‌కాశం కూడా ఉంటుంది. ప్ర‌తి బ్యాంకులో రూ.5 ల‌క్ష‌ల మొత్తం వ‌ర‌కు బీమా ప్ర‌యోజ‌నం కూడా ఉంది. ఎఫ్‌డీలు వేసేట‌పుడు నిధులు అవ‌స‌రం రీత్యా అకాల ఉప‌సంహ‌ర‌ణ‌కు పాల్ప‌డిన‌పుడు వ‌డ్డీ పెనాల్టీ త‌క్కువుండే బ్యాంకుల‌ను ఎంచుకుంటే మంచిది.

గత 3 ఏళ్ల‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్లు గ‌ణ‌నీయంగా త‌గ్గాయి. ప్ర‌స్తుతం రెపో రేటు 4% వ‌ద్ద ఉంది. ఇది మే 2020 నుంచి మార‌లేదు. ఈ ధోర‌ణి పెట్టుబ‌డిదారుల‌ను మెరుగైన వ‌డ్డీ ఆదాయాన్ని సంపాదించ‌డానికి ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను వెత‌క‌డానికి దారితీసింది. అయితే ఈ మ‌ధ్య‌న జాతీయ బ్యాంకుల‌తో స‌హా కొన్ని ఆర్థిక సంస్థ‌ల ఎఫ్‌డీ రేట్లు ఇటీవ‌ల స్వ‌ల్పంగా పెరిగాయి. పెట్టుబ‌డిదారులు దీని నుంచి ఎక్కువ ప్ర‌యోజ‌నం పొందేందుకు త‌మ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి.

కొన్ని బ్యాంకులు త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు ఫ్లోటింగ్ రేట్ ఎఫ్‌డీల‌ను అందిస్తున్నాయి. ఫ్లోటింగ్ రేట్ ఎఫ్‌డీల‌పై వ‌డ్డీ రేటు ప్ర‌స్తుత స్థిర రేటు ఎఫ్‌డీల‌తో పోలిస్తే ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌క‌పోవ‌చ్చు. అయితే పాత స్వ‌ల్ప‌కాలిక ఎఫ్‌డీల‌ను అధిక రేటు ఎఫ్‌డీల‌కు నిరంత‌రంగా మార్చే ఇబ్బందులు ప‌డ‌కూడ‌దు అనుకుంటే ఫ్లోటింగ్ రేట్ ఎఫ్‌డీలు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటాయి. సీనియ‌ర్ సిటిజ‌న్ పెట్టుబ‌డిదారుల‌కు ఎఫ్‌డీల నుంచి వ‌చ్చే వ‌డ్డీ ఆదాయానికి ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.50 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపును క్లెయిమ్ చేయ‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని