పిల్ల‌ల ఆరోగ్య బీమాకు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

కుటుంబ పెద్ద‌ల‌తో పాటు పిల్ల‌ల‌కు ఆరోగ్య బీమా ఉంటేనే ఆ కుటుంబం ఆర్ధికంగా సుర‌క్షితంగా ఉన్న‌ట్లు ప‌రిగ‌ణించాలి.

Updated : 11 Mar 2022 14:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ రోజుల్లో ఆరోగ్య బీమా పెద్ద‌ల‌తో పాటు పిల్ల‌ల‌కు అవసరమవుతోంది. పిల్ల‌లు త‌ర‌చుగా సాధార‌ణ ఇన్‌ఫెక్ష‌న్‌లు, బ్ల‌డ్ ఇన్‌ఫెక్ష‌న్‌ల‌కు గుర‌వుతుంటారు. ఆడుకునే వ‌య‌స్సులో ప్ర‌మాదాల బారిన కూడా ప‌డుతుంటారు. ఇవే కాకుండా ఈ రోజుల్లో కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. వంశ‌పారంప‌ర్య వ్యాధుల‌తో పెద్ద‌లే కాకుండా పిల్ల‌లు కూడా చాలా మంది ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. అత్య‌వ‌స‌రంగా వ‌చ్చే వ్యాధుల‌కు జేబు నుంచి డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌డం అంటే చాలా ఇబ్బందిక‌ర‌మైన విష‌య‌మే. అందుచేత కుటుంబ పెద్ద‌ల‌తో పాటు పిల్ల‌ల‌కు ఆరోగ్య బీమా ఉంటేనే ఆ కుటుంబం ఆర్థికంగా సురక్షితంగా ఉన్న‌ట్లుగా ప‌రిగ‌ణించాలి.

త‌ల్లిదండ్రులు, త‌మ పిల్ల‌లు స్వ‌తంత్ర నిర్ణ‌యాలు తీసుకునే వ‌ర‌కు వారి శ్రేయ‌స్సు, భ‌ద్ర‌త గురించి ఆందోళ‌న చెందుతారు. పిల్ల‌ల‌కు త‌గిన ఆరోగ్య క‌వ‌రేజీని తీసుకోవ‌డం అంటే పిల్ల‌ల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డానికి స‌హాయ‌ప‌డిన‌ట్టే. ఆర్థిక ప్ర‌ణాళిక‌లో ఇది ఒక ముఖ్య‌మైన భాగం. అయితే, స‌రైన ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకోవ‌డం ముఖ్య‌మైన‌ది. పిల్ల‌ల‌కు చాలా ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ మీ అవ‌స‌రాల‌కు ఏ బీమా ప్లాన్ స‌రిపోతుందో నిర్ణ‌యించుకోవాలి. 

ఆరోగ్య బీమా కొనుగోలు చేసేముందు మొద‌ట‌గా ఎలాంటి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లోనైనా మీ స‌మీపంలో నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రులు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. పిల్ల‌లు పాఠ‌శాల‌ల్లో లేదా ఆట మైదానాల్లో ఆట‌ల స‌మ‌యంలో ప్ర‌మాదాల‌కు గుర‌వుతారు. కాబ‌ట్టి ఆరోగ్య బీమా కంపెనీ వారి నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రులు అందించే న‌గ‌దు ర‌హిత చికిత్స‌కు వెంట‌నే సుల‌భంగా చేరుకునే విధంగా ద‌గ్గ‌ర‌గా ఉండాలి. త‌గినంత క‌వ‌రేజీతో కూడిన పాల‌సీని క‌లిగి ఉండ‌టం చాలా ముఖ్యం.

ఆరోగ్య బీమాలో ఇన్‌పేషంట్‌గానే కాకుండా ఓపీడీ, పిల్ల‌ల టీకా సౌక‌ర్యాలు ఉన్న‌యో లేవో చూడాలి. చిన్న వ‌య‌స్సులో ఉన్న పిల్ల‌లు వాతావ‌ర‌ణ మార్పుల‌కు, కాలానుగుణ ఫ్లూ జ్వ‌రాల‌కు తరచూ గుర‌వుతుంటారు. దీని కార‌ణంగా పిల్ల‌లకు డాక్ట‌ర్ క‌న్స‌ల్టేష‌న్ అవ‌స‌రం ప‌డుతుంది. ఆరోగ్య బీమాలో ఓపీడీ స‌దుపాయం ఉంటే ఆసుప‌త్రి సంద‌ర్శ‌న ఖ‌ర్చులు త‌గ్గుతాయి.

1 నుంచి 12 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న పిల్ల‌ల‌కు బీమా క‌వ‌రేజ్ కావాల‌నుకునే త‌ల్లిదండ్రులు వారి రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి అవ‌స‌ర‌మైన టీకాల గురించి జాగ్ర‌త్త తీసుకునే ఆరోగ్య బీమా ప్లాన్ కోసం ప్ర‌య‌త్నించాలి. ఆరోగ్య బీమా, పిల్ల‌లు పుట్టిన‌ 91వ రోజు నుంచి న‌వ‌జాత శిశువుకు ర‌క్ష‌ణ‌ను అందించాలి. గరిష్ఠ వ‌య‌స్సు వ‌ర‌కు బీమా పున‌రుద్ధ‌ర‌ణ అనుమ‌తి ఉండాలి. ఈ రోజుల్లో పిల్ల‌లు 30 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌ర‌కు వారి త‌ల్లిదండ్రులు లేదా కుటుంబ ఫ్లోట‌ర్ ప్లాన్‌లో భాగంగా ఉండ‌గ‌ల‌రు. అయితే ఇది బీమా ప్లాన్ బ‌ట్టి మారుతుంది.

మీరు పిల్ల‌ల‌ను మీ కుటుంబ ఫ్లోట‌ర్ ప్లాన్‌లో జాయిన్ చేయాల‌నుకుంటే వారి చిన్న వ‌య‌స్సులోనే ప్ర‌వేశించ‌డం మంచిది. బీమా ప్లాన్‌లో వ్యాధుల ప‌రిధిని చెక్ చేయండి. పుట్టిన‌ప్ప‌టి నుంచి శిశువు ఏదైనా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్ల‌యితే ఆరోగ్య బీమా ప‌థ‌కం నిర్ధిష్ట వ్యాధికి క‌వ‌రేజీని అందించాలి. అది కూడా త‌క్కువ వెయిటింగ్ పీరియ‌డ్‌తో ఉండాలి. దానితో పాటు ప్లాన్‌లో విస్తృత‌మైన వ్యాధుల క‌వ‌రేజీ ఉండాలి.

ప్రసూతి కవరేజీ ఉన్న బీమా పాలసీలో సాదరణంగా 2-3 ఏళ్ల కనీస వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కాబట్టి, నూత‌న వ‌ధూవ‌రులు అయితే త‌గినంత ప్ర‌సూతి క‌వ‌రేజీని అందించే ఆరోగ్య బీమా పాల‌సీని ముందే ఎంచుకోవాలి. త‌ల్లికి, అప్పుడే పుట్టిన బిడ్డ‌ను చూసుకునే బీమా ప్ర‌యోజ‌నాలు ఈ పాల‌సీ క‌వ‌రేజీలో ఉండాలి. ప్ర‌స‌వానికి సంబంధించిన ఖ‌ర్చుల‌తో పాటు ఆసుప‌త్రిలో చేర‌డానికి ముందు, త‌ర్వాత మెడిక‌ల్ ఖ‌ర్చులు క‌వ‌ర్‌ అవ్వాలి. 

అన్ని ప్ర‌ధాన ఆర్థిక నిర్ణ‌యాల మాదిరిగానే ఆరోగ్య బీమాను కొనుగోలు చేయాల‌నుకునే వారు బీమా నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి అర్థంచేసుకోవాలి. మీ కుటుంబం మొత్తం దీర్ఘ‌కాలిక వైద్య అవ‌స‌రాల‌కు స‌రిపోయే ఉత్త‌మమైన బీమా పాల‌సీని తీసుకోవ‌డం మంచిది. దీనికోసం మార్కెట్‌లో ఉన్న అన్ని బీమా ప్లాన్‌ల‌ను స‌రిపోల్చుకుని స‌రైన బీమాను ఎంపిక చేసుకోవ‌డం ఉత్త‌మం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని