Car Loans: కొత్త కారు కోసం రుణం తీసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..

కారు రుణాల విషయంలో వడ్డీ రేట్లతో పాటు అనేక విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Updated : 01 Nov 2022 16:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కార్ల అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పండగ సీజన్‌లో అమ్మకాలు జోరుగా జరిగాయి. అయితేే మన దేశంలో కార్ల అమ్మకాలు సాధారణంగా బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు ఇచ్చే రుణాలపై ఆధారపడే జరుగుతాయి. ఒకవేళ మీరూ కారు రుణాలు తీసుకోవాలనుకుంటే.. రుణాలు తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

బడ్జెట్‌ పరిమితి

చాలాసార్లు రుణం ద్వారా కారు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు అనుకున్న ధరకంటే ఎక్కువ ధర కలిగి ఉన్న కారును కొనాలనే కోరిక కలగడం సహజం. ముందుగా వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడే మీ రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. రుణ మొత్తం మీ బడ్జెట్‌ కంటే ఎక్కువగా ఉంటే, నెలవారీ ఈఎంఐలు కూడా అధికంగా ఉంటాయని గ్రహించాలి. ఒకవేళ ఈఎంఐ అలాగే ఉంచి, రుణ కాలపరిమితి పెంచుకున్నట్లయితే ఇది అధిక వడ్డీ చెల్లింపునకు దారి తీస్తుంది. అందుచేత మీ బడ్జెట్‌కనుగుణంగానే ఈఎంఐలు ఉండేలా చూసుకోవాలి. పాత కారుతో పోల్చుకుంటే, కొత్త కారుకు రుణ సంస్థలు తక్కువ వడ్డీ రేటునే వసూలు చేస్తాయి.

క్రెడిట్‌ స్కోరు

మెరుగైన క్రెడిట్‌ స్కోరు ఉన్నవారి కోసం ఇప్పుడు కారు రుణాల వడ్డీ రేట్లు 8% నుంచి మొదలవుతున్నాయి. తక్కువ వడ్డీ రేటుకు కారు రుణాన్ని పొందడంలో ఈ క్రెడిట్‌ స్కోరు ఎంతగానో సాయపడుతుంది. ముందుగా మీ క్రెడిట్‌ స్కోరు ఎంతుందో తెలుసుకోవాలి. ఈ స్కోరు 750 దాటి ఉంటే తక్కువ వడ్డీ రేటుకు లేదా ఆకర్షణీయమైన ఆఫర్లతో బ్యాంకు రుణాలను పొందడానికి మీరు అవకాశాన్ని పొందడమే కాకుండా రుణం కోసం మంచి డీల్‌ను పొందే స్థితిలో ఉంటారు. ఈ స్కోరు తక్కువ ఉంటే మెరుగైన స్కోరును చేరుకోవడానికి తగినంత ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, రుణ బకాయిలు ఏవైనా ఉంటే పూర్తిగా తీర్చివేయాలి. కాబట్టి, ఏదైనా రుణం కోసం దరఖాస్తు చేసే ముందు మీరు తప్పనిసరిగా మీ క్రెడిట్‌ స్కోరును చెక్‌ చేసుకోవాలి.

ఈఎంఐల కాల వ్యవధి

ఈ రుణాలు తీర్చడానికి 7 ఏళ్ల గరిష్ఠ కాలవ్యవధిని బ్యాంకులు ఇస్తున్నాయి. రుణం తీర్చడానికి గరిష్ఠ కాలవ్యవధి ఎంచుకుంటే.. ఈఎంఐ తగ్గుతుంది. కానీ, వడ్డీ చెల్లింపు కూడా ఎక్కువే ఉంటుంది. ఉదాహరణకు మీరు 10% వడ్డీ రేటుతో, రూ.5 లక్షల వాహన రుణానికి, 7 ఏళ్ల వ్యవధికి.. మీ నెలవారీ ఈఎంఐ సుమారుగా రూ. 8,300 అవుతుంది. ఆ మొత్తం రుణాన్ని వడ్డీతో కలిపి 7 ఏళ్లకు రూ. 6,97,200 చెల్లిస్తారు. అంటే, అసలు గాక వడ్డీయే రూ.1,97,200 అవుతుంది. ఇప్పుడు అదే వడ్డీ రేటుతో రుణ కాల వ్యవధి 3 ఏళ్లుగా నిర్ణయించుకుంటే ఈఎంఐ రూ.16,133 అవుతుంది. ఈ కాల వ్యవధిలో మీరు మొత్తం రూ. 5,80,788 చెల్లిస్తారు. తద్వారా వడ్డీ చెల్లింపు రూ. 80,788 మాత్రమే అవుతుంది. 3 ఏళ్లు మాత్రమే ఈఎంఐ పెట్టుకుంటే వడ్డీ రూపంలోనే రూ. 1,16,412 ఆదా అవుతుంది.

రుణ సంస్థ ఎంపిక

వాహన రుణ దరఖాస్తుదారు తప్పనిసరిగా వివిధ బ్యాంకుల రుణ ఆఫర్లను సరిపోల్చాలి. ఈ ఆఫర్లు మీ క్రెడిట్‌ స్కోరు, ఇతర ఆర్థిక అర్హతలపై ఆధారపడి ఉంటాయి. సాధ్యమైనంత తక్కువ వడ్డీ రేట్లు, ఇతర ఫీచర్లతో ఉన్న డీల్‌ను ఎంచుకోవాలి. 10-20 బేసిస్‌ పాయింట్లు తక్కువ వడ్డీ రేటుకు రుణం లభించినా 5-7 ఏళ్ల వడ్డీ చెల్లింపులో గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తుంది.

రుణంపై రుసుములు

ప్రముఖ బ్యాంకులు కనీస ప్రాసెసింగ్‌ ఛార్జీలను 0.50% నుంచి వసూలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు కారు రుణంపై త‌క్కువ వడ్డీ వ‌సూలు చేస్తాయి. కానీ, అదే స‌మ‌యంలో వారు అధిక ప్రాసెసింగ్ రుసుములు, కారు రుణంతో అనుసంధానమైన ఇత‌ర రుసుములు వ‌సూలు చేయొచ్చు. ఒక్కోసారి త‌క్కువ వ‌డ్డీ రేటుకు కారు రుణాన్ని ఎంచుకోవ‌డం ద్వారా మీరు ఆదా చేసే దానికంటే ఎక్కువ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. ముందస్తుగా రుణాన్ని తీర్చేయాలంటే 3% దాకా క్లోజర్‌ ఛార్జీలు కూడా ఉంటాయి. వీటిని వినియోగదారులు గమనించాలి.

చివరిగా: వాహన రుణం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వాహనం మోడల్‌, ధర, ఫీచర్లు, రుణ మొత్తం, వడ్డీ రేట్ల గురించి సాధ్యమైనన్ని చోట్ల వాకబు చేయడం మంచిది. మీ బడ్జెట్‌కు మించని, ఇంధనం ఆదా అయ్యే సమర్థమైన వాహనాన్ని ఎంచుకోండి. రుణం తీర్చగలిగే ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి వాహన మోడల్‌ను ఎంపిక చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని