Insurance: బీమా విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి

బీమా చేయ‌ని ప‌రిస్థితుల్లో దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఏదైనా సంఘ‌ట‌న సంభ‌వించిన‌ప్పుడు అయ్యే ఖ‌ర్చులు అనూహ్యంగా ఉంటాయి.

Updated : 08 Aug 2022 17:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక ప్ర‌ణాళిక చేప‌ట్టేట‌ప్పుడు మొద‌ట తీసుకోవాల్సింది బీమా రక్షణ. స‌రైన పునాది లేకుండా నిర్మించిన భ‌వ‌నం కూలిపోయినట్లు.. త‌గిన బీమా క‌వ‌రేజీ లేకపోతే మీ పెట్టుబ‌డుల‌న్నీ నిర్వీర్యం అవ్వొచ్చు. బీమా చేయ‌ని ప‌రిస్థితుల్లో దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఏదైనా సంఘ‌ట‌న సంభ‌వించిన‌ప్పుడు అయ్యే ఖ‌ర్చులు అనూహ్యంగా ఉంటాయి. బీమా క‌వ‌ర్ తీసుకోవ‌డానికి చెల్లించే ప్రీమియం స్వ‌ల్పంగా ఉంటుంది.

సంప్రదాయ బీమా పాల‌సీలు మంచివేనా?
చాలా మంది సౌకర్యంగా ఉంటుందని బీమా, పెట్టుబడి కలిపి ఉండే ఎండోమెంట్, మనీ బ్యాక్ లాంటి పాలసీలను ఎంచుకుంటారు. ఇలాంటి పాల‌సీలు బీమా కాల వ్య‌వ‌ధిలో పాల‌సీదారుడు అకాల మ‌ర‌ణానికి గురైతే నామినీ(ల‌)కి హామీ మొత్తాన్ని చెల్లించే ప్ర‌ధాన ఉద్దేశంతో పాటు మెచ్యూరిటీపై రాబ‌డిని అందిస్తాయి. కానీ బీమా, పెట్టుబ‌డిని క‌ల‌ప‌క‌పోవ‌డ‌మే మంచిది. ఎందుకంటే ఎండోమెంట్ పాల‌సీల‌లో ట‌ర్మ్ బీమా పాల‌సీల కంటే ప్రీమియం మొత్తం ఎక్కువ‌గా ఉంటుంది. రాబ‌డి చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అనుకోని సంఘ‌ట‌న‌ల‌కు ఇచ్చే బీమా మొత్తం కూడా త‌క్కువే ఉంటుంది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో మెచ్యూరిటీకి ముందే మీ పాల‌సీని స‌రెండ‌ర్ చేయాల‌నుకుంటే మీరు న‌ష్ట‌పోయే అవ‌కాశాలే ఎక్కువ‌. అంతేకాకుండా అదే పాల‌సీలో బీమా మొత్తాన్ని పెంచాలంటే కుద‌ర‌దు. మళ్లీ ఇంకో కొత్త పాల‌సీ తీసుకోవాల్సిందే. వ‌య‌స్సును బ‌ట్టీ పాల‌సీ ప్రీమియం రేటు పెర‌గొచ్చు. అందుచేత బీమాను, పెట్టుబ‌డిని క‌ల‌ప‌ని ట‌ర్మ్ జీవిత బీమా పాల‌సీ తీసుకోవ‌డం మంచిది. మిగిలిన‌ డ‌బ్బుని ఇత‌ర పొదుపు ప‌థ‌కాల్లో  గానీ లేక మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల్లో సిప్ (SIP)ను కొన‌సాగించ‌డం మంచిది.

ప్రీమియం వెనక్కి అందించే టర్మ్ ప్లాన్: సాధార‌ణంగా ట‌ర్మ్ బీమాలో మెచ్యూరిటీ స‌మ‌యంలో మ‌నం క‌ట్టిన ప్రీమియం తిరిగిరాదు. అలాగని వ‌చ్చే ట‌ర్మ్ బీమా ప‌థ‌కాలు కూడా ఉన్నాయి. కానీ వీటికి ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఉదా: 30 ఏళ్ల వ‌య‌స్సుకి సాధార‌ణ ట‌ర్మ్ బీమాకు రూ.1 కోటి బీమాకు, ప్రీమియం రూ.13,500 అయితే, `రిట‌ర్న్ ఆఫ్ ప్రీమియం` పాల‌సీ ప్రీమియం సంవ‌త్స‌రానికి రూ.28,000-29000 అవుతుంది. పాల‌సీ వ్య‌వ‌ధి ముగింపులో రిట‌ర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్‌లో రూ.7.43 ల‌క్ష‌లు తిరిగి వ‌స్తుంది. కానీ అద‌నంగా క‌ట్టిన ప్రీమియాన్ని మ్యూచువల్ ఫండ్‌లో మ‌దుపు చేసిన‌ట్ల‌యితే 8% వార్షిక రాబ‌డితో 60 ఏళ్లు వ‌య‌స్సు వ‌చ్చేస‌రికి రూ. 13.15 ల‌క్ష‌లు పొందొచ్చు.

ఒకే సారి ప్రీమియం మొత్తం: ఒకేసారి ఎక్కువ ప్రీమియం చెల్లిస్తే మొత్తం ప్రీమియంలో త‌గ్గింపు ఉంటుంద‌ని ఏజంట్లు చెప్పినా కూడా.. ఒకేసారి ప్రీమియం చెల్లించే పద్ధతి మంచిది కాదు. ఉదాహరణకు 15 ఏళ్ల పాటు  వార్షికంగా రూ.10 వేలు ప్రీమియం చెల్లించే పాలసీ ఎంచుకున్నారనుకుందాం. ఇదే పాలసీలో ఒకేసారి ప్రీమియం చెల్లిస్తే రూ.30 వేలు డిస్కౌంట్ ఇస్తామని కంపెనీ మీకు తెలపొచ్చు. అయితే, ద్రవ్యోల్బణం దృష్టిలో ఉంచుకుని చూస్తే.. ఇప్పటి రూ.1,20,000 15 ఏళ్ళకి సుమారుగా రూ. 2.85 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి సింగిల్ ప్రీమియం పాలసీలు కంపెనీకే లాభదాయకం. అలాగే, సింగిల్ ప్రీమియం పాలసీలలో పాలసీ దారుడు మొదటి ఏడాది, రెండో ఏడాది ఇలా ఎప్పుడు మరణించినా కంపెనీకి పూర్తి ప్రీమియం ముందే చేరుతుంది. సాధారణ పాలసీలో పాలసీదారుడు మరణించిన తరువాత కుటుంబ సభ్యులు మిగిలిన ప్రీమియం చెల్లించే అవసరం ఉండదు.

స‌మాచారాన్ని దాయ‌కూడ‌దు: చిన్న వ‌య‌స్సులోనే ఆరోగ్యంగా ఉన్న‌ప్పుడే బీమా పాల‌సీని తీసుకోవ‌డం స‌రైన‌ది. ప్రీమియం త‌క్కువ‌గా ఉంటుంది. పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ వేగంగా జ‌రుగుతుంది. నో క్లెయిమ్ బోన‌స్‌కు అర్హుల‌వుతారు. ముందుగా ఉన్న ఏదైనా వైద్య ప‌రిస్థితి, కుటుంబ వైద్య చ‌రిత్ర‌, ధూమ‌పానం, ప్ర‌మాద‌క‌ర వృత్తుల‌లో పాల్గొన‌డం లాంటి వివ‌రాలు పాల‌సీ కొనుగోలు స‌మ‌యాల‌లో దాయ‌కూడ‌దు. కొనుగోలు స‌మ‌యంలో అటువంటి స‌మాచారాన్ని దాయ‌డం వ‌ల్ల లేక మోస‌పూరిత ప‌త్రాల‌ను అందించ‌డం వల్ల బీమా కంపెనీ క్లెయిమ్ తిర‌స్క‌రిస్తుంది.

థ‌ర్డ్ పార్టీ బీమా: థ‌ర్ట్ పార్టీ బీమా చ‌ట్ట‌ప్ర‌కారం త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. మీరు న‌డిపే మోటారు సైకిల్‌, కారు మొద‌లైన వాటి వ‌ల్ల ప్ర‌మాదంలో ఎవ‌రైనా వ్య‌క్తి గాయ‌ప‌డ‌టం లేదా మ‌ర‌ణించిన సంద‌ర్భంలో న‌ష్ట‌ప‌రిహారం మొత్తం బాధితుడి ఆర్థిక స్థితిని బ‌ట్టి ల‌క్ష‌లు లేక కోట్ల‌లో ఉండొచ్చు. ఇటువంటి ప‌రిహారాల‌ను థ‌ర్డ్ పార్టీ బీమా చెల్లిస్తుంది. అయితే, చాలా మంది ట్రాఫిక్ పోలీస్ వేసే ఫైన్ నుంచి తప్పించుకోవడానికి ఇది మాత్రమే తీసుకుంటారు. ఇందులో మీ వాహనానికి జరిగే నష్టం ఏ మాత్రం కవర్ అవ్వదు. కాబట్టి, కొంత ప్రీమియం అధికంగా చెల్లించి మీ వాహనానికి కూడా సరిపడా ఓన్ డ్యామేజీ కవర్ తీసుకోవడం మేలు.

చివ‌రిగా: మీరు ఎంచుకున్న పాలసీ గురించి కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌చెప్పాలి. ఆయా ప‌త్రాలు ఎక్క‌డ ఉన్నాయో వారికి ముందుగానే చెప్పాలి. క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో వాటిని వెతుక్కొనే ప‌రిస్థితి తెచ్చుకోకూడ‌దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని