Updated : 01 Jul 2022 17:12 IST

Health Insurance: ఆరోగ్య బీమా ఎంపిక‌లో కొన్ని జాగ్ర‌త్త‌లు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్య బీమా అనేది దీర్ఘ‌కాలిక సంబంధ‌మైన‌ది. మీ ఉపాధి ప్ర‌యాణాన్ని ప్రారంభించిన‌ప్పుడు ఆరోగ్య బీమా పాల‌సీని చిన్న వ‌య‌స్సులోనే కొనుగోలు చేయాల‌ని నిపుణులు స‌ల‌హా ఇస్తున్నారు. పాల‌సీ ఎంత ముందుగా తీసుకుంటే అంత ఎక్కువ ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. కొత్త పాల‌సీలు ప్రాథమిక క‌వ‌రేజీని అందిస్తాయి. ఆరోగ్య బీమా పాల‌సీలో 2-5 సంవ‌త్స‌రాల త‌ర్వాత మాత్ర‌మే క్లిష్ట‌మైన అనారోగ్యాలు క‌వ‌ర్ అవుతాయి. అధిక ప్రీమియం, వైద్య ప‌రిస్థితుల కార‌ణంగా వృద్ధాప్యంలో ఆరోగ్య బీమాను కొనుగోలు చేయ‌డం క‌ష్టం అవుతుంది. మీరు ఆరోగ్య బీమా క‌వ‌ర్‌ని కొనుగోలు చేయ‌డాన్ని వాయిదా వేస్తూ ఉంటే, ఆర్థిక న‌ష్టాలు కూడా అధికంగానే ఉంటాయి. బీమా అనేది ఆర్థిక న‌ష్టాల నుంచి మిమ్మ‌ల్ని ర‌క్షించే రిస్క్ మేనేజ్‌మెంట్ సాధ‌నం.

భార‌త్‌లో ఆరోగ్య ఖ‌ర్చుల నిమిత్తం మొత్తం వైద్య ఖ‌ర్చుల‌లో 62.6% సొంత జేబు నుంచే ఖ‌ర్చు పెడుతున్నారు. 37.4% మాత్ర‌మే ప్ర‌భుత్వం, ఇత‌ర సంస్థ‌లు, ఆరోగ్య బీమా ద్వారా క‌వ‌ర్ అవుతాయి. డ‌జ‌న్ల కొద్దీ ఆరోగ్య బీమా కంపెనీలు ఈ బీమా వ్యాపారంలో ఉన్న‌ప్ప‌టికీ, చాలామంది వ్య‌క్తులు వారి అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా స‌రైన ఆరోగ్య ప్ర‌ణాళిక‌ను ఎంచుకోవ‌డంలో విజ‌య‌వంతం కాలేక‌పోతున్నారు. ఆరోగ్య బీమా సంస్థ‌ల అధ్యయ‌నం ప్ర‌కారం భార‌త్‌లో వైద్య ద్ర‌వ్యోల్బ‌ణం వేగంగా పెరుగుతోంది. ప్రైవేట్ ఆసుప‌త్రిలో చేరే వారి ఖ‌ర్చులూ చాలా పెరిగాయి.

ఆరోగ్య బీమాను కొనుగోలు చేసేట‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా ప‌రిగ‌ణించ‌వ‌ల‌సిన కొన్ని ముఖ్య‌మైన అంశాలు ఉన్నాయి. భార‌త్‌లో అధిక జ‌నాభా, ప్ర‌జ‌ల జీవ‌నశైలి కార‌ణంగా అధిక సంఖ్య‌లో అంటువ్యాధులు, దీర్ఘ‌కాలిక‌ వ్యాధులు పెరుగుతూ వచ్చాయి. అయితే దేశీయంగా వైద్య రంగం ఎంతో పురోగ‌తి సాధించింది. చాలా ఆధునిక చికిత్స‌లు నేడు దేశంలో అందుబాటులో ఉన్నాయి. ఇత‌ర వెన‌క‌బ‌డిన దేశాల ప్ర‌జ‌లు కూడా వైద్య అవ‌స‌రాల‌కు భార‌త్‌నే ఆశ్ర‌యిస్తున్నారు. భార‌తీయ వైద్యులు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు పొందుతున్నారు. అత్యంత అధునాత‌న రోగ నిర్ధారణ చికిత్స సాంకేతిక‌త ఇక్క‌డ అందుబాటులో ఉంది.

ఎక్కువ సాంకేతిక, ఆరోగ్య నిపుణులు అందుబాటులోకి వ‌చ్చే కొల‌ది చికిత్స ఖ‌ర్చులు పెరుగుతూ ఉంటాయి. దీనికి స‌రిస‌మానంగా ఆరోగ్య బీమా మొత్తాన్ని కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. నేటి కాలంలో ఆరోగ్య చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చును భ‌రించేందుకు అధిక మొత్తం ఆరోగ్య బీమాను క‌లిగి ఉండ‌టం ఒక సంపూర్ణ అవ‌స‌రంగా మార్చుకోవాలి.

కొవిడ్ కార‌ణంగా ఆరోగ్య బీమాపై అవ‌గాహ‌న గ‌ణ‌నీయంగా పెరిగిన‌ప్ప‌టికీ, చాలా మందికి స‌రైన ఆరోగ్య బీమాను ఎలా, ఎంత‌కి ఎంచుకోవాలో తెలియ‌క‌పోవ‌చ్చు. కొవిడ్ 2వ వేవ్‌లో ఒక్క రోజుకు 1 ల‌క్ష రూపాయ‌ల ఫీజుల‌ను అనేక కొర్పొరేట్ ఆసుప‌త్రుల‌లో వ‌సూలు చేశాయి. దీంతో త‌క్కువ ఆరోగ్య బీమా క‌లిగిన వారంద‌రూ అనేక ఆర్థిక ఇబ్బందులకు గుర‌య్యారు. చాలా మంది అప్పులు పాలవ్వడమే కాకుండా ఆస్తుల‌ను అమ్ముకోవాల్సి వ‌చ్చింది. కాబ‌ట్టి స‌రైన మొత్తానికి బీమా ఉండ‌టం ఇక్క‌డ చాలా ముఖ్యం.

ఆరోగ్య బీమాలో అప్ప‌టికే ఉన్న వ్యాధుల చికిత్స‌కు వెయిటింగ్ పీరియ‌డ్‌ల కార‌ణంగా బీమా ఉన్న‌ప్ప‌టికీ.. తాత్కాలికంగా కొన్ని నెల‌ల పాటు ఉప‌యోగం ఉండ‌దు. ఇటువంటి విష‌యాల‌లో ముందు జాగ్ర‌త్త‌లు, ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న‌వారికి చాలా అవ‌స‌రం. యువ‌కులుగా ఉన్న కుటుంబ‌మైతే క‌నీసం రూ. 5 ల‌క్ష‌లు, పెద్ద వ‌య‌స్సు ఉన్న‌వారి కుటుంబ‌మైతే రూ. 10 ల‌క్ష‌లు అంత‌క‌న్నా ఎక్కువుగా ఆరోగ్య బీమా క‌లిగి ఉండ‌టం ఈ కాలంలో అత్యవ‌స‌రం.

నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రులు: ఆరోగ్య బీమా చేయించుకున్న‌వారి ప్రాంతంలో లేక ద‌గ్గ‌ర‌గా ఉన్న న‌గ‌రంలో ఎన్ని ఆసుప‌త్రులు ఆరోగ్య బీమా సంస్థ‌తో భాగ‌స్వామ్య ఒప్పందాలు (టై-అప్‌) క‌లిగి ఉన్నాయో చూసుకోవాలి. అలాగే ప్ర‌సిద్ధ మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రులు నెట్‌వ‌ర్క్‌లో ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఎప్పుడైనా తీవ్ర అనారోగ్య ప‌రిస్థితులలో చికిత్స‌ అవ‌స‌రం ఏర్ప‌డితే ఈ ఆసుప‌త్రుల ఉప‌యోగం చాలా ఉంటుంది. అంతేకాకుండా అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో సొంతంగా న‌గ‌దుని ఖ‌ర్చుపెట్ట‌కుండా ఉండ‌టానికి ఈ నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రుల ఉప‌యోగం చాలా ఉంటుంది. మీ అవసరాలను గుర్తించి, త‌క్కువ వెయిటింగ్ పీరియ‌డ్ అందించే, త‌క్కువ మిన‌హాయింపులు ఉన్న ఆరోగ్య బీమా పాల‌సీల‌ను ఎంచుకోవ‌డం చాలా ముఖ్యం.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని