Personal Loan: వ్యక్తిగత రుణాన్ని ఎప్పుడు క్లోజ్‌ చేస్తే ప్రయోజనం..?

Personal loan preclosure: వ్యక్తిగత రుణం ముందస్తు చెల్లింపులు బ్యాంకులు అనుమతిస్తాయి. అయితే కొంత పెనాల్టీ వసూలు చేయవచ్చు. మరి దీనివల్ల ప్రయోజనమెంత?

Published : 10 Dec 2022 17:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక అత్యవసరాల కోసం వ్యక్తిగత రుణం (Personal Loan) ఎంతగానో సహాయపడుతుంది. ఎటువంటి హామీ లేకుండా రుణం (Loan) పొందే వీలున్నందున వ్యక్తులు సులభంగా ఈ రుణం తీసుకోవచ్చు. అలాగే ఏ కారణంగా రుణం తీసుకుంటున్నారో కూడా బ్యాంకులు (Banks) అడగవు. మంచి క్రెడిట్‌ స్కోరు (Credit score) నిర్వహిస్తున్న వారు సులభంగానే వ్యక్తిగత రుణం పొందే వీలుంది. అయితే అసురక్షిత రుణం అయినందున బ్యాంకులకు నష్టభయం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇతర సురక్షిత రుణాలతో పోలిస్తే వడ్డీ రేటు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల రుణం తీసుకున్న వారు డబ్బు చేతికందినప్పుడు భారం తగ్గించుకునేందుకు ఈ రుణాన్ని క్లియర్‌ చేసేందుకు చూస్తుంటారు. మరి వ్యక్తిగత రుణ ముందస్తు చెల్లింపులు లేదా రుణాన్ని క్లోజ్ చేయడం (preclosure of personal loan) ప్రయోజనకరమేనా?

బ్యాంకులు ప్రీపేమెంట్‌కు అనుమతిస్తాయా?

వ్యక్తిగత రుణం (Personal Loan) ముందస్తు చెల్లింపులను బ్యాంకులు అనుమతిస్తాయి. అయితే కొంత పెనాల్టీ వసూలు చేయవచ్చు. కొన్ని బ్యాంకులు లోన్‌ తీసుకున్న కొంత కాలం వరకు ఎటువంటి (పూర్తి/పాక్షిక) ముందస్తు చెల్లింపులు అనుమతించవు. ఎంత కాలం అనేది మీరు రుణం తీసుకున్న బ్యాంకుపై ఆధారపడి ఉంటుంది. ఈ లాక్‌-ఇన్‌ పీరియడ్‌ 6 నెలల నుంచి 12 నెలల వరకు ఉండొచ్చు.

ప్రీపేమెంట్‌ పెనాల్టీ లేకపోతే..

వ్యక్తిగత రుణాల ముందస్తు చెల్లింపులతో రుణం భారం తగ్గించుకోవచ్చు. అలాగే, వడ్డీ ఆదా చేసుకోవచ్చు. అయితే చాలా వరకు బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై ముందస్తు చెల్లింపులకు పెనాల్టీ విధిస్తున్నాయి. అందువల్ల ముందస్తు చెల్లింపుల విషయంలో పెనాల్టీ వర్తిస్తుందా లేదా అని మీ బ్యాంకుని అడిగి తెలుసుకోండి. ఒకవేళ ఎలాంటి ఛార్జీలు విధించకపోతే ముందస్తు చెల్లింపులు మంచి ఎంపికే.

క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం..

వ్యక్తిగత రుణ ముందస్తు చెల్లింపులు మీ క్రెడిట్‌ స్కోరును ప్రభావితం చేయవు. మీరు భవిష్యత్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే సకాలంలో రుణం తిరిగి చెల్లించే విషయంలో రుణదాతలు మిమ్మల్ని విశ్వసిస్తారు.

పెనాల్టీ వర్తిస్తే?

ఒకవేళ మీ బ్యాంకు ముందస్తు చెల్లింపులపై పెనాల్టీ విధిస్తుంటే.. ఎంత ఛార్జ్‌ చేస్తుంది? మీరు చెల్లించే వడ్డీ ఎంత? ఇంకా రుణ చెల్లింపులకు ఎంత కాలం ఉంది?వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ముందుస్తు చెల్లింపుల నిర్ణయం తీసుకోవాలి. కొన్ని బ్యాంకులు పాక్షిక ప్రీపేమెంట్‌పై పెనాల్టీ విధించవు. మరికొన్ని బ్యాంకులు రుణ మొత్తంలో 25% కంటే ఎక్కువ చెల్లింపులు చేస్తేనే పెనాల్టీ విధిస్తాయి.

ఎంత పెనాల్టీ ఛార్జ్‌ చేస్తాయి? 

సాధారణంగా బ్యాంకులు వ్యక్తిగత రుణ ముందస్తు చెల్లింపులపై 2-5% వరకు కూడా పెనాల్టీ విధిస్తున్నాయి. అయితే ఇది అన్ని బ్యాంకులకూ ఒకేలా ఉండదు. అలాగే మీరు ఎప్పుడు ముందస్తు చెల్లింపులు చేస్తున్నారనేదానిపై కూడా పెనాల్టీ ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును తీసుకుంటే.. రుణం తీసుకున్న 12 నెలల తర్వాత మాత్రమే ముందస్తు చెల్లింపులను అనుమతిస్తుంది. రుణం తీసుకున్న 13-24 నెలల మధ్య ముందస్తు చెల్లింపులు చేస్తే.. 4%, 25-36 నెలల మధ్య చేస్తే.. 3%, 36 నెలల తర్వాత చేస్తే 2%.. అవుట్‌ స్టాండింగ్‌ బ్యాలెన్స్‌ (మిగులు రుణ మొత్తం)పై పెనాల్టీ ఛార్జ్‌ చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడు రుణం చెల్లిస్తున్నారనే దానిపై కూడా ఛార్జీలు ఆధారపడి ఉంటాయి.

రుణ చెల్లింపుల చివరి దశలో..

వ్యక్తిగత రుణాలను చివరి దశలో చెల్లించడం అంత తెలివైన పని కాకపోవచ్చు. ఎందుకంటే వడ్డీతో పాటు పెనాల్టీ కూడా భారం అవుతుంది. 

ముందస్తు చెల్లింపులు ఎప్పుడు మంచిది?

  • వ్యక్తి గత రుణం ముందస్తు చెల్లింపులు ఎప్పుడు చేస్తే మంచిదనేది ఓ ఉదాహరణ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్‌ రూ.5 లక్షల వ్యక్తిగత రుణాన్ని 5 సంవత్సరాల కాలపరిమితితో 11% వడ్డీతో తీసుకున్నాడనుకుందాం. ఇందుకుగానూ అతను నెలవారీగా చెల్లిస్తున్న ఈఎంఐ రూ. 10,871. అతడు రుణం తీసుకున్న బ్యాంకు ముందస్తు చెల్లింపులకు 12 నెలల తర్వాత 3% పెనాల్టీతో అనుమితిస్తుంది.
  • రాజేష్‌ కాలపరిమితి వరకు రుణం కొనసాగిస్తే.. రుణం పూర్తయ్యే నాటికి చెల్లించే మొత్తం రూ.6,52,260. అసలు రూ.5,00,000, వడ్డీ రూ.1,52,260.
  • ఒకవేళ రాజేష్‌ 13 నెలల ఈఎంఐలు చెల్లించిన తర్వాత రుణం క్లోజ్‌ చేయాలనుకుంటే..13 నెలల పాటు చెల్లించిన ఈఎంఐ మొత్తం రూ.1,41,323 కాకుండా రుణ ముందస్తు చెల్లింపుల సమయంలో అవుట్‌ స్టాండింగ్‌ బ్యాలెన్స్‌ రూ.4,13,607, పెనాల్టీ రూ.12,408(3%).. మొత్తంగా రుణం కోసం రూ. 5,67,335 చెల్లించాలి. 
  • ఒకవేళ రాజేష్‌ 36 నెలల (3 సంవత్సరాలు) ఈఎంఐలు చెల్లించిన తర్వాత రుణం క్లోజ్‌ చేయాలనుకుంటే.. 36 నెలల పాటు చెల్లించిన ఈఎంఐ మొత్తం రూ.3,91,356 కాకుండా రుణ ముందస్తు చెల్లింపుల సమయంలో అవుట్‌ స్టాండింగ్‌ బ్యాలెన్స్‌ రూ. 2,33,249, పెనాల్టీ రూ.6,997 (3%).. మొత్తంగా రుణం కోసం రూ. 6,31,602 చెల్లించాలి.
  • ఒకవేళ రాజేష్‌ 48 నెలల (4 సంవత్సరాలు) ఈఎంఐలు చెల్లించిన తర్వాత రుణం క్లోజ్‌ చేయాలనుకుంటే.. 48 నెలల పాటు చెల్లించిన ఈఎంఐ మొత్తం రూ.5,21,808 కాకుండా రుణ ముందస్తు చెల్లింపుల సమయంలో అవుట్‌ స్టాండింగ్‌ బ్యాలెన్స్‌ రూ.1,23,003, పెనాల్టీ రూ.3,690.. మొత్తంగా రుణం కోసం రూ. 6,48,501 చెల్లించాలి. 
  • పై ఉదాహరణను చూసుకంటే.. ఈఎంఐలు చివరి వరకు కొనసాగించినప్పుడు చెల్లించే మొత్తం రూ.6,52,260.. నాలుగు సంవత్సరాల తర్వాత ముందస్తు చెల్లింపుల ద్వారా చెల్లించే మొత్తం రూ. 6,48,501. వీటి మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు కాబట్టి చివరి దశలో ముందస్తు చెల్లింపులు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. 

పెనాల్టీ లేకుండా రుణం చెల్లించాలంటే..

మీరు 13 నెలల తర్వాత లోన్‌ ముందస్తు చెల్లింపులు చేసే బదులు 6% రాబడి ఇవ్వగల పెట్టుబడుల్లో పెట్టవచ్చు. లోన్‌ క్లియరెన్స్‌ కోసం రూ.4,14,000 వెచ్చించే అదే మొత్తాన్ని పెట్టుబడి పెడితే.. 6% రాబడి అంచనాతో 4 సంవత్సరాల్లో రూ.1,08,665 వడ్డీ పొందొచ్చు. మెచ్యూరిటీ మొత్తం రూ.5,22,665. నాలుగేళ్లలో చెల్లించవలసిన ఈఎంఐ రూ.5,21,808 కి సమానంగా రాబడి వస్తుంది కాబట్టి ముందస్తు చెల్లింపులపై పెనాల్టీ లేకుండా రుణం చెల్లించవచ్చు.

ప్రస్తుతం బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు 3 నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లపై 6-7% వడ్డీని ఇస్తున్నాయి. కాబట్టి ఈ మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి, యధావిధిగా రుణ ఈఎంఐలు చెల్లించడం ద్వారా ప్రయోజనం పొందొచ్చు.

గమనిక: వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు, ముందస్తు చెల్లింపుల ఛార్జీలు వేరు వేరు బ్యాంకులకు వేరు వేరుగా ఉంటాయి. ప్రీ-పేమెంట్‌ ఛార్జీలను ఇక్కడ పాఠకుల అవగాహన కోసం మాత్రమే ఉదాహరణతో అందించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని