Home Loan EMI: మరోసారి రుణరేట్లు పెరిగినా.. ఈఎంఐ భారం కాకూడదంటే..?

వడ్డీ రేట్లు పెరిగినప్పుడు..ఇబ్బంది పడకుండా ఉండేందుకు చెల్లింపులను పెంచుకునే ప్రయత్నం చేయవచ్చు.

Published : 23 Feb 2023 23:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇల్లు కొనాలంటే లక్షల్లో డబ్బు కావాలి. ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బు సర్దుబాటు చేయాలంటే చాలా మందికి సాధ్యం కాదు. ఇలాంటి వారికి గృహ రుణాలు (Home loans) ఎంతగానో సహాయపడుతున్నాయి. ఒకేసారి కాకుండా నెమ్మదిగా నెలవారీ చెల్లింపులు చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. గృహ రుణం తీసుకున్నప్పుడు వడ్డీ రేటు రెండు రకాలుగా ఉంటుంది - 1.స్థిర వడ్డీ రేటు. 2. ఫ్లోటింగ్‌ వడ్డీ రేటు. ఫ్లోటింగ్‌ వడ్డీ రేటుతో రుణం తీసుకుంటే ఆర్‌బీఐ రెపో రేటు పెంచిన ప్రతిసారీ వడ్డీ రేటు పెరుగుతుంది.

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్‌బీఐ గత కొంత కాలంగా రెపోరేట్లను పెంచుతూ వస్తోంది. దీంతో ఫ్లోటింగ్‌ వడ్డీ రేటుతో రుణాన్ని తీసుకున్న వారి ఈఎంఐల చెల్లింపు కాలం పెరుగుతుంది. అంటే 15 ఏళ్లలో తీరిపోతుందనుకున్న రుణం తీరేందుకు మరో ఐదేళ్లు పట్టొచ్చు. కానీ, ముందుగా నిర్ణయించకున్న సమయంలోనే రుణం తీర్చేయాలి అనుకుంటే మాత్రం కాలపరిమితిని పెంచకుండా ఈఎంఐ సర్దుబాటును ఎంచుకోవాలి. దీంతో వడ్డీ రేటు పెరిగితే, ఈఎంఐ కూడా పెరుగుతుంది. మరి పెరిగిన రుణ భారాన్ని ఏ విధంగా నిర్వహించాలో కూడా ప్లాన్‌ చేసుకోవడం మంచిది.

అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి..

ఒకవైపు ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మరోవైపు ఈఎంఐ కూడా పెరుగుతోంది. దీంతో ఖర్చులు, ఈఎంఐ రెండింటినీ సమతుల్యం చేయడం కష్టమే. అయితే, సరైన ప్రణాళికతో ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తే.. ఈఎంఐ పెరిగినా సులభంగా చెల్లించగలుగుతారు.

ఖరీదైన వస్తువుల కొనుగోళ్లు వాయిదా వేసుకోండి..

ఏదైనా ఇతర మార్గాల నుంచి ఆదాయం వచ్చినప్పుడు గానీ, బోనస్‌లు వంటివి వచ్చినప్పుడు ఖరీదైన వస్తువుల కొనుగోలుకు ఉపయోగిస్తుంటాం. ఆ వస్తువు తప్పనిసరి కాదు అనుకున్నప్పుడు కొనుగోళ్లు వాయిదా వేసి.. బదులుగా ఈ మొత్తాన్ని ముందస్తు రుణం చెల్లింపుల కోసం వినియోగించుకోవచ్చు.

ఆర్థిక ప్రణాళిక సమీక్షించండి..

ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి వచ్చినప్పుడు, ఆర్థిక ప్రణాళికను సమీక్షించడం మంచిది. నిధుల కేటాయింపులో అవసరమైన సర్దుబాట్లు చేయవచ్చు. కీలకమైన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తూనే, తక్కువ ప్రాధాన్యం ఉన్న లక్ష్యాలకు నిధుల కేటాయింపును తగ్గించుకోవచ్చు. భవిష్యత్‌లో ఆదాయం పెరిగినా, వడ్డీ రేటు తగ్గినా.. అసలు ఆర్థిక ప్రణాళికను తిరిగి పునరుద్ధరించుకోవచ్చు.

తక్కువ ఆదాయం వచ్చే పెట్టుబడులను రద్దు చేసుకోవచ్చు..

మీ ఆర్థిక ప్రణాళికలో తక్కువ పనితీరు కనబరుస్తున్న పెట్టుబడులు ఏమైనా ఉంటే వాటిని రద్దు చేసి కొంత రుణాన్ని ప్రీపేమెంట్‌ చేయవచ్చు. దీంతో ఈఎంఐ, కాలపరిమితి రెండూ పెరగకుండా చేసుకోవచ్చు.

ఆదాయం పెరిగినప్పుడే ఈఎంఐ పెంచుకోండి..

వడ్డీ రేట్లు పెరిగినప్పుడు.. ఇబ్బంది పడకుండా ఉండేందుకు (వార్షిక ఆదాయం పెరిగినప్పుడు), చెల్లింపులను పెంచుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల రుణం తొందరగా చెల్లించగలుగుతారు. అలాగే, పెరిగిన ఆదాయాన్ని సరైన విధంగా వినియోగించుకోగలుగుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని