IPO: కొనసాగనున్న ఐపీఓల ట్రెండ్‌.. వచ్చేవారమూ మరో 4 పబ్లిక్‌ ఇష్యూలు

గతం వారం తరహాలోనే ఈ వారంలో నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. మొత్తం రూ.5,000 కోట్లు సమీకరించనున్నాయి.

Published : 06 Nov 2022 14:24 IST

దిల్లీ: గడిచిన వారం రోజుల్లో నాలుగు కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. రాబోయే ఏడు రోజులు కూడా ఆ ట్రెండ్‌ కొనసాగనుంది. వచ్చే వారంలో మరో 4 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకి రానున్నాయి. దాదాపు రూ.5,000 కోట్లు సమీకరించనున్నాయి. ఆర్కియన్‌ కెమికల్‌ ఇండస్ట్రీస్‌, ఫైవ్‌ స్టార్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌, కేన్స్‌ టెక్నాలజీ, ఐనాక్స్‌ గ్రీన్‌ ఎనర్జీ సర్వీసెస్‌ ఈ జాబితాలో ఉన్నాయి.

ఆర్కియన్‌ కెమికల్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓ నవంబరు 9న ప్రారంభమవనుంది. రూ.1,462 కోట్ల సమీకరణ లక్ష్యంతో వస్తున్న ఈ పబ్లిక్‌ ఇష్యూ నవంబరు 11న ముగుస్తుంది. ధరల శ్రేణిని రూ.386- 407గా నిర్ణయించారు. రూ.805 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 1.61 కోట్ల ఈక్విటీ షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉండనున్నాయి. ఐపీఓలో సమీకరించిన నిధుల్ని గతంలో జారీ చేసిన నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ రిడెమ్షన్‌కు ఉపయోగించనున్నారు.

ఫైవ్‌ స్టార్ బిజినెస్‌ ఫైనాన్స్‌ ధరల శ్రేణిని రూ.450-474గా నిర్ణయించింది. ఈ పబ్లిక్‌ ఇష్యూ నవంబరు 9న ప్రారంభమై 11న ముగియనుంది. గరిష్ఠ ధర వద్ద రూ.1,960 కోట్లు సమీకరించనుంది. ఈ ఐపీఓలో పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద షేర్లు అందుబాటులో ఉన్నాయి.

ఐఓటీ సొల్యూషన్‌ల ఆధారిత ఎలక్ట్రానిక్స్‌ సంస్థ కేన్స్‌ టెక్నాలజీ ఇండియా ఐపీఓ నవంబరు 10న ప్రారంభమై 14వ తేదీన ముగియనుంది. ఇష్యూ పరిమాణాన్ని కంపెనీ ఇటీవల రూ.650 కోట్ల నుంచి రూ.530 కోట్లకు తగ్గించింది. ధరల శ్రేణిని రూ.559- 587గా నిర్ణయించారు. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో కొంత భాగాన్ని రుణ చెల్లింపులకు వినియోగించనున్నారు. మరికొంత మొత్తంతో మైసూర్‌, మానేసర్‌లోని తయారీ కేంద్రాలకు మూలధనాన్ని సమకూర్చనున్నారు. కర్ణాటకలోని చామరాజ్‌నగర్‌లో కేన్స్‌ మరో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకూ ఈ నిధులను వెచ్చించనున్నారు. మిగిలిన మొత్తాన్ని ఇతర కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారు.

☛ ఐనాక్స్‌ విండ్‌ అనుబంధ సంస్థ ఐనాక్స్‌ గ్రీన్‌ ఎనర్జీ ఐపీఓ నవంబరు 11న ప్రారంభమై 15న ముగియనుంది. రూ.740 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీఓలో రూ.340 కోట్ల విలువ చేసే తాజా షేర్లతో పాటు మరో రూ.370 కోట్ల విలువ చేసే షేర్లు ఆఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉండనున్నాయి. ఐపీఓలో సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నారు. విండ్‌ ఫార్మ్‌ ప్రాజెక్టులకు ఐనాక్స్‌ గ్రీన్‌ ‘ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌’ సేవలను అందిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని