ఆరోగ్య‌బీమా పాల‌సీదార్ల‌కు ఎదుర‌య్యే స‌వాళ్లు

ఆరోగ్య బీమా తీసుకున్న వారికి త‌ర‌చుగా ఎదుర‌య్యే కొన్ని ర‌కాలైన స‌మ‌స్య‌ల‌ను గురించి తెలుసుకుందాం.

Published : 19 Dec 2020 17:25 IST

భ‌విష్య‌త్తులో త‌లెత్తే ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు అయ్యే ఖ‌ర్చును భ‌రించేందుకు ఆరోగ్య బీమాని కొనుగోలు చేస్తే చాలా? అనే ప్ర‌శ్న‌కు చాలు అనే స‌మాధానం చెప్ప‌వ‌చ్చు.కానీ కొన్ని స‌మ‌స్య‌లు ఎదుర‌య్యే అవ‌కాశం ఉండొచ్చు.కొంత మంది బీమా నిపుణుల‌తో చ‌ర్చించి వినియోగ‌దారులకు ఎదుర‌య్యే కొన్ని స‌మ‌స్య‌ల గురించి అర్థం చేసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…

ప్రీమియం లో పెరుగుద‌ల‌

చాలా మంది పాల‌సీదార్లు కంగారు ప‌డే అంశం ప్రీమియంలో పెరుగుద‌ల‌, వైద్య‌రంగంలో వ‌స్తున్న సాంకేతిక‌త మొద‌లైన వాటి వ‌ల్ల వైద్య ఖ‌ర్చులు అధిక‌మ‌వుతున్నాయ‌ని అందువ‌ల్ల ప్రీమియం పెరుగుతుంద‌ని చెబుతారు. అయితే కొన్నిసార్లు ఇది పాల‌సీని పునరుద్ధ‌రీంచేందుకు వీలులేని స్థాయికి చేరుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు 54 ఏళ్ల వ్య‌క్తికి త‌న రూ.6 ల‌క్ష‌ల పాల‌సీపై ప్రీమియం రూ.19,212 నుంచి రూ. 26,524 కు పెరిగింది. ఆ వ‌య‌సు వ్య‌క్తుల‌కు పాల‌సీ పున‌రుద్ధ‌రించుకోవ‌డం త‌ప్ప మ‌రో మార్గం ఉండ‌దు.

బీమా నియంత్ర‌ణ సంస్థ ఐఆర్‌డీఏ కూడా ప్రీమియంలలో పెంపులను ఆమోదించింది. కార‌ణం బీమా సంస్థ‌ల ఆదాయం అంత ఆశాజ‌న‌కంగా లేక‌పోవ‌డ‌మే. అండ‌ర్ రైటింగ్ లోపం కార‌ణంగా ఈ స‌మ‌స్య ఏర్ప‌డింద‌ని చెప్ప‌వ‌చ్చు. ( వివిధ కారణాలపై ఆధారపడి ఎంత ప్రీమియం వసూలు చేయాలో తెలుసుకోవ‌డాన్ని అండ‌ర్ రైటింగ్ అంటారు.) ప్రీమియం పెంచ‌డం ద్వారా న‌ష్ట‌పోయిన‌ వ్య‌యాన్ని భ‌ర్తీ చేస్తారని ఇన్సూరెన్స్ బ్రోకర్ మహావీర్ చోప్రా అన్నారు. పునరుద్ధరణ ప్రీమియంలు ఎంత మేర పెంచవ‌చ్చ‌న్న‌ దానిపై పరిమితి ఉండాలి అని ఆయన అన్నారు.

పునరుద్ధరణ రిమైండర్లు

బీమా సంస్థ‌లు త‌ప్ప‌నిసరిగా పాల‌సీదార్ల‌కు పునరుద్ధరణ తేదీలను జ్ఞ‌ప్తికి తేవాల‌ని నిబంధనలులేవు , కానీ సాంకేతికత విస్తృతంగా వ్యాపించిన త‌రుణంలో ఉత్త‌మ‌ సేవ‌లు అందించేందుకు బీమా సంస్థ‌లు రిమైండర్లను పంపిస్తుంటాయి… పాలసీని కొనుగోలు చేసేటప్పుడు ఇచ్చిన చిరునామా ప్ర‌కారం బీమా సంస్థ ఈ మెయిల్ లేదా ఫోన్ ద్వారా రిమైండర్లను పంపిస్తుంది. కొన్నిసార్లు పంప‌క‌పోవ‌చ్చు.

పునరుద్ధరణ తేదీలను గుర్తుంచుకోవ‌డం వ‌ల్ల‌ వినియోగ‌దారులకు రెండు ప్ర‌యోజ‌నాలున్నాయి. మొదటిది, ఆరోగ్యబీమా దీర్ఘకాలికమైన‌ది. ప్రతి ఏడాది పునరుద్ధరించాలి. రెండవది, పాల‌సీని పున‌రుద్ద‌రించ‌ని వారికి కొనసాగింపు ప్రయోజనాలను మీరు కోల్పోతారు. వేరొక పాల‌సీని తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అప్ప‌టి ఆరోగ్య‌ ప‌రిస్థితి పై బీమా సంస్థ పాల‌సీ ప్రీమియంను నిర్ణ‌యిస్తుంది. కొన్ని సంద‌ర్భాల్లో పాలసీని తిరస్కరించవచ్చు. ప్రీమియంను ఎక్కువ‌గా చెల్లించ‌డ‌మో లేదా ముందుగా ఉన్న అనారోగ్యాలపై వెయిటింగ్ పిరియ‌డ్ నిబంధ‌న‌లు పాటించాలి. దాదాపు 20-30% పునరుద్ధరణ రిమైండ‌ర్లు పాల‌సీదార్ల‌కు చేర‌డంలేదు. బీమా సంస్థ‌ల డేటాబేస్ స‌క్ర‌మంగా లేన‌పుడు ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయ‌ని నిపుణులు అన్నారు.

అన్ని వేళ‌లా క్యాష్ లెస్ కాదు…

ఆరోగ్య బీమా చేయించుకున్న ప్ర‌తీ ఒక్క‌రికీ క్యాష్ లెస్ క్ల‌యిమ్ ల‌భిస్తుంద‌ని క‌చ్చితంగా చెప్ప‌లేం. కొన్ని సార్లు సొంతంగా డ‌బ్బు ఖ‌ర్చుచేసి అనంత‌రం బీమా సంస్థ‌నుంచి పొందే విధంగా కూడా ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీమా సంస్థ‌లు దాదాపుగా 90 శాతం వ‌ర‌కూ ఖ‌ర్చుల‌కు నిధులు అందిస్తుంది. కొన్ని ఆసుప‌త్రులు 45 రోజుల కాల‌ప‌రిమితిని ఇస్తుంటాయి. ఎక్కువ ఆల‌స్యం అవుతుంద‌ని అనుకుంటే ఆసుప‌త్రులు పేషేంట్ల‌ నుంచి డ‌బ్బు తీసుకుంటారు. ప్ర‌ధాన కార‌ణం బీమా సంస్థ‌లు బీమా పాల‌సీల‌కు సంబంధించిన స‌మాచారం నిక్షిప్తం చేయ‌డంలో పొర‌పాట్లు ఉండ‌ట‌ని ఒక నిపుణుడు తెలిపారు.

దీని మూలంగా బీమా చేయించుకున్న వారు ఆసుప‌త్రిలో వైద్యం ప్రారంభించేందుకు ముందు బీమా సంస్థ‌ నుంచి అనుమ‌తి తీసుకుంటారు. స‌మాచారం అందుబాటులో లేక‌పోవ‌టం మూలంగా ఈ ప్ర‌క్రియ‌ ఆల‌స్యం అవుతుంది. అత్య‌వ‌స‌రంగా ఆసుప‌త్రిలో చేరాలంటే ఏం చేయ‌లేం కానీ, ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం వైద్యం చేయించుకునేందుకు సిద్ధ‌మ‌య్యేట‌పుడు ముందుగా బీమా సంస్థ‌ను సంప్ర‌దించాలి.

స‌మాచార లోపం

బీమా పాల‌సీ తీసుకునే ముందు పాల‌సీదార్లకు కొన్ని ఆరోగ్య నిబంధ‌న‌లు ఉంటాయి. కొల‌స్ట్రాల్, సుగ‌ర్ సంబంధిత అనారోగ్యాల‌కు బీమా సంస్థ‌లు కొంత కాలం వేచి చూసి నిర్ణ‌యం తీసుకుంటాయి. ఆ స‌మ‌యంలో పాల‌సీదార్ల‌కు స‌మాచారం అంద‌క విసిగివేసారి పోయి అస‌హ‌నం చెందొచ్చు. రీంబ‌ర్స్మెంట్ విధానంలో అయితే పాల‌సీదారుడు ఆసుప‌త్రికి చెల్లించిన వైద్య ఖ‌ర్చుల‌ను తిరిగి పొందేందుకు కొంత కాలం వేచి చూడాలి. ముంద‌స్తు వ్యాధుల‌ను గురించి క‌చ్చితంగా తెలియ‌క‌పోవ‌డం మూలంగా కూడా పాల‌సీదారులు కొన్ని అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.

బీమా సంస్థ‌లు పాల‌సీల‌కు మార్కెట్లో జ‌రిగే ప‌రిణామాల‌కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుంటారు. అయితే పాల‌సీదారులు తొల‌గించే వాటి గురించి కూడా కొంచెం ఆలోచించాలి. బీమా సంస్థ‌లు పాల‌సీల్లో మార్పులు చేసేట‌పుడు వారి ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. కొన్ని పాల‌సీల్లో కిమోథెర‌పీ లాంటి ఖ‌రీదైన ట్రీట్‌మెంట్ల‌కు మిన‌హాయింపు ఇస్తుంటాయి. పాల‌సీదారులు ముందుగా ఇలాంటి విష‌యాల‌ను తెలుసుకోవ‌డం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని