NPAs: ప్రభుత్వ బ్యాంకుల లాభాల్లో 50% వృద్ధి.. ఫలిస్తున్న సర్కార్‌ చర్యలు: సీతారామన్‌

NPAs: మొండి బకాయిలను తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల బ్యాంకుల లాభాలు గణనీయంగా పెరిగాయిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 

Published : 07 Nov 2022 18:58 IST

దిల్లీ: బ్యాంకుల నిరర్థక ఆస్తుల (NPAs)ను తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. సెప్టెంబరు త్రైమాసికంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల సంయుక్త లాభాలు 50 శాతం పెరిగి రూ.25,685 కోట్లుగా నమోదు కావడమే అందుకు నిదర్శనమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో బ్యాంకుల నికర లాభాలు 32 శాతం పెరిగి రూ.40,991 కోట్లకు చేరినట్లు పేర్కొన్నారు.

సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో ఎస్‌బీఐ లాభాలు వార్షిక ప్రాతిపదికన 74 శాతం పెరిగి రూ.13,265 కోట్లుగా నమోదైన విషయాన్ని సీతారామన్‌ గుర్తుచేశారు. అలాగే కెనరా బ్యాంకు లాభాలు సైతం 89 శాతం పెరిగి రూ.2,525 కోట్లకు చేరినట్లు తెలిపారు. అదే సమయంలో కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న యూకో బ్యాంక్‌ లాభం ఏకంగా 145 శాతం పెరిగి రూ.504 కోట్లకు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాభం 58.70 శాతం పెరిగి రూ.3,312 కోట్లకు ఎగబాకినట్లు పేర్కొన్నారు.

12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్‌ ఇండియా మాత్రమే తమ లాభాల్లో క్షీణతను నమోదు చేశాయని సీతారామన్‌ గుర్తుచేశారు. అధిక నిరర్థక ఆస్తుల ప్రొవిజన్ల కారణంగానే ఇలా జరిగిందని తెలిపారు. ఈ రెండు మినహా మిగిలిన 10 బ్యాంకులు తమ లాభాల్లో 13 నుంచి 145 శాతం వరకు వృద్ధిని నమోదు చేశాయి. అత్యధికంగా యూకో బ్యాంక్‌ 145 శాతం, బ్యాంక్ ఆఫ్‌ మహారాష్ట్ర 103 శాతం లాభాల వృద్ధిని నివేదించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని