Pakistan: ఆర్థిక సంక్షోభ నివారణకు పాక్‌ ‘లస్సీ’ మంత్రం!

‘టీ’ని తాగడం మానేసి లస్సీ, సత్తు వంటి స్థానిక పానీయాలను సేవించాలని ఓ అత్యున్నత విద్యా సంస్థ సూచించింది...

Published : 25 Jun 2022 18:36 IST

దివాలా నుంచి తప్పించుకునేందుకు వినూత్న ప్రతిపాదనలు

లాహోర్‌: ఆర్థిక సంక్షోభం అంచులకు చేరిన పాకిస్థాన్‌ను గట్టెక్కించేందుకు ఆ దేశ మేధావి వర్గం అన్ని మార్గాలనూ అన్వేషిస్తోంది. ఇప్పటికే దిగుమతుల బిల్లును తగ్గించుకోవాలంటే రోజుకి 1 లేదా 2 కప్పుల టీ మాత్రమే తాగాలని స్వయంగా ఆ దేశ మంత్రే ప్రజలకు సూచించారు. ఫలితంగా ‘టీ’ పొడి దిగుమతి తగ్గి విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. తాజా ‘టీ’ని తాగడం మానేసి లస్సీ, సత్తు వంటి స్థానిక పానీయాలను సేవించాలని ఓ అత్యున్నత విద్యా సంస్థ సూచించింది. 

ఇదే విషయంపై ఉన్నత విద్యా కమిటీ తాత్కాలిక ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ షైష్టా సోహైల్‌ పాక్‌ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు లేఖ రాశారు. వ్యవస్థలో కిందిస్థాయిలో ఉన్న వారిని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసేందుకు ఉన్న వినూత్న మార్గాలను సూచించాలని కోరారు. అందులో భాగంగా స్థానికంగా తేయాకు సాగును ప్రోత్సాహించాలని సూచించారు. అలాగే లస్సీ, సత్తు వంటి సంప్రదాయ పానీయాలను సేవించేలా చూడాలన్నారు. వీటిని అమలు చేయడం కోసం కావాల్సిన వినూత్న పద్ధతులను అన్వేషించాలని కోరారు. ఫలితంగా ఉపాధి పెరగడంతో పాటు ఉద్యోగ కల్పన జరుగుతుందన్నారు. అలాగే ‘టీ’ దిగుమతి బిల్లు తగ్గుతుందన్నారు. 

స్టేట్‌ బ్యాంక్ పాకిస్థాన్‌ లెక్కల ప్రకారం జూన్‌ 17 నాటికి పాకిస్థాన్‌ వద్ద 8.2 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆ దేశం తీవ్ర కరెంటు ఖాతా లోటుతో కొట్టుమిట్టాడుతోంది. ఈ దుస్థితి నేపథ్యంలో దిగుమతుల బిల్లును తగ్గించుకొని డాలర్లను కాపాడుకొనేందుకు ‘టీ’ వినియోగాన్ని తగ్గించాలని అక్కడి మంత్రి కోరారు. 2021-22లో పాక్‌ 400 మిలియన్‌ డాలర్లు విలువ చేసే టీ పొడిని దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది ఆ మొత్తం 460 మిలియన్‌ డాలర్లకు పెరిగినట్లు అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే దిగుమతుల బిల్లును తగ్గించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.  

మరోవైపు భారీ పరిశ్రమలపై ‘సూపర్‌ ట్యాక్స్‌’ విధిస్తూ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ శుక్రవారం ప్రకటన చేశారు. ఈమేరకు సిమెంటు, స్టీల్‌ వంటి పరిశ్రమలపై 10 శాతం ఈ పన్ను విధించారు. ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి, నగదు కొరత నుంచి ఉపశమనానికి ఇది ఉపకరిస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. తమ ప్రధాన లక్ష్యం ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగించడమని, తదుపరి దేశం దివాలా తీయకుండా కాపాడటమని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు