Property Rates: హైదరాబాద్‌లో 4% పెరిగిన ఇళ్ల ధరలు

ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు 5 శాతం పెరిగినట్లు ‘ప్రాప్‌టైగర్‌’ అనే స్థిరాస్తి కన్సల్టింగ్‌ సేవల సంస్థ వెల్లడించింది.

Published : 22 Nov 2022 09:14 IST

‘ప్రాప్‌టైగర్‌’ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు 5 శాతం పెరిగినట్లు ‘ప్రాప్‌టైగర్‌’ అనే స్థిరాస్తి కన్సల్టింగ్‌ సేవల సంస్థ వెల్లడించింది. చదరపు అడుగు నిర్మాణ స్థలం(ఎస్‌ఎఫ్‌టీ) ధర గత ఏడాది చివరి నాటికి రూ.6,300-6,500 ఉండగా, అది రూ.6,600-6,800కు పెరిగినట్లు పేర్కొంది. బెంగుళూరు, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, ముంబయి, పుణె.. తదితర నగరాల్లో ఇళ్ల ధరల తీరుతెన్నులను ఈ సంస్థ విశ్లేషించింది. హైదరాబాద్‌ నగరంలో ఇళ్ల ధరలు 4 శాతం పెరిగినట్లు స్పష్టం చేసింది. గత ఏడాది చివరి నాటికి హైదరాబాద్‌లో ఎస్‌ఎఫ్‌టీ నిర్మాణ స్థలం ధర రూ.5,900-6,100 ఉండగా.. ప్రస్తుతం రూ.6,100-6,300 ధర పలుకుతున్నట్లు వివరించింది.

నిర్మాణ వ్యయాల భారం: ఇళ్ల ధరలు ఈ ఏడాదిలో స్వల్పంగా పెరిగాయి. నిర్మాణ వ్యయం పెరగటం దీనికి ప్రధాన కారణమని ప్రాప్‌టైగర్‌ గ్రూప్‌ సీఎఫ్‌ఓ వికాస్‌ వాధ్వాన్‌ అన్నారు. ముఖ్యంగా సిమెంటు, స్టీలు ధరలు పెరిగినట్లు, దాని ప్రభావం ఇళ్ల ధరలపై కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని తోడు ఇళ్లకు గిరాకీ తగ్గలేదని తెలిపారు. సమీప భవిష్యత్తులో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు.

అహ్మదాబాద్‌లో ఇళ్ల ధరలు 5 శాతం, బెంగుళూరులో 6 శాతం, కోల్‌కతాలో 3 శాతం, చెన్నైలో 2 శాతం పెరిగాయి. ముంబయిలో 3 శాతం, పుణెలో 7 శాతం ధరలు పెరిగినట్లు ఈ నివేదిక వివరించింది. బెంగుళూరులో ఎస్‌ఎఫ్‌టీ ధర ప్రస్తుతం రూ.5,900-6,100 పలుకుతోంది. అదే సమయంలో ఇళ్ల ధరలు(ఎస్‌ఎఫ్‌టీకి) ముంబయిలో రూ.9,900- 10,100, పుణెలో రూ.5,500-5,700 ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న ఇళ్ల కంటే నిర్మాణం  పూర్తై, వెంటనే చేరిపోవటానికి అనువుగా ఉన్న ఇళ్లను కొనుగోలుదార్లు ఇష్టపడుతున్నట్లు ‘ప్రాప్‌టైగర్‌’  రీసెర్చ్‌ హెడ్‌ అంకిత సూద్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని