స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ విధానం

సొంత ఇల్లు/ప్లాటు/ఫ్లాటు కొనాలనేది ఎంతో మంది జీవిత ఆశయం. స్థిరాస్తి కొనుగోలు ఒక్క రోజులో జరిగే పని కాదు. ప్రభుత్వ రికార్డుల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు విధివిధానాలున్నాయి. స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ ప్రాముఖ్యత - ఆస్తిని రిజిస్టర్‌ చేయించుకోవడం అంటే ప్రభుత్వ లెక్కల్లో ఆస్తిని కొనుగోలుదారుడి పేరిట అధికారికంగా బదిలీ చేసుకోవడం.....

Updated : 02 Jan 2021 14:40 IST

త ఇల్లు/ప్లాటు/ఫ్లాటు కొనాలనేది ఎంతో మంది జీవిత ఆశయం. స్థిరాస్తి కొనుగోలు ఒక్క రోజులో జరిగే పని కాదు. ప్రభుత్వ రికార్డుల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు విధివిధానాలున్నాయి. స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ ప్రాముఖ్యత - ఆస్తిని రిజిస్టర్‌ చేయించుకోవడం అంటే ప్రభుత్వ లెక్కల్లో ఆస్తిని కొనుగోలుదారుడి పేరిట అధికారికంగా బదిలీ చేసుకోవడం. అంతేకాకుండా సదరు ఆస్తిని సొంతం చేసుకున్నట్టు బహిరంగంగా వ్యక్తపరిచే అధికారం రిజిస్ట్రేషన్‌ ద్వారానే వస్తుంది. ఆస్తి కొనుగోలు వ్యవహారం పెద్ద మొత్తం సొమ్ముతో ముడిపడి ఉంటుంది. పైగా ఎన్నో ఏళ్ల కష్టార్జితం అయి ఉంటుంది. అందుకే భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. కబ్జాదారులు స్థలాన్ని కబ్జా చేయకుండా కాపాడుకునేందుకు రిజిస్ట్రేషన్‌ కీలక పాత్ర పోషిస్తుంది.

అమ్మదలిచే వ్యక్తి పేరిట ఆస్తి:

ఆస్తిని అమ్మదలిచే వ్యక్తి వివరాలు రిజిస్ట్రేషన్‌ పత్రాల్లో సరిగ్గా నమోదయ్యాయో లేదో పరిశీలించాల్సిన బాధ్యత కొనుగోలుదారుదే. అమ్మదలిచే ఆస్తి సరిహద్దులు రిజిస్ట్రేషన్‌ పత్రాల్లో సరిగ్గా ఉన్నదీ లేనిది చూడాలి. ఆస్తి కలిగి ఉన్న కచ్చితమైన ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతాలు పేర్కొని ఉండాలి.

న్యాయవాదులు, నిపుణులను కలవడం:

ఆస్తికి సంబంధించిన కీలక పత్రాల బదిలీ సమయంలో ప్రొఫెషనల్‌ తరహాలో డాక్యుమెంట్లను సిద్ధంచేసుకునేందుకు నిపుణులు, న్యాయవాదుల అవసరం ఏర్పడుతుంది. రిజిస్ట్రేషన్‌ విధానంలో వారు మనకు సహాయపడతారు.

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ధ్రువీకరించుకోవడం:

స్థిరాస్తి కలిగి ఉన్న ప్రాంతానికి సంబంధించిన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆస్తి పత్రాలను ధ్రువీకరించుకోవాలి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఉన్న పత్రాలను, అమ్మకందారు వద్ద ఉన్న పత్రాలను సరిపోల్చి చూసుకోవాలి.

ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌:
రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ నమోదై ఉంటుంది. వాటిని పరిశీలించేందుకు ఎవరైనా కాపీలను అడిగి తీసుకోవచ్చు. ఒక ఆస్తికి సంబంధించి గడిచిన కాలంలో ఎవరెవరి పేరిట రిజస్టర్‌ అయి ఉందో వాటి యాజమానులెవరో, మధ్యలో జరిగిన మార్పులేమిటో రికార్డుల్లో నమోదై ఉంటుంది. ఆస్తి యాజమాని, సరిహద్దులు, సొంతం చేసుకున్న తేదీ తదితర వివరాలన్నీ కాలక్రమ విధానంలో పొందుపరిచి ఉంటుంది. దీన్నే ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ అని అంటారు.

డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌లో పాటించాల్సిన జాగ్రత్తలు:

రిజిస్ట్రేషన్‌ పత్రాల్లో ఎటువంటి ఖాళీలు, కొట్టివేతలు ఉండకుండా విషయం స్పష్టంగా, చదవగలిగేలా ఉండాలి. ఒక వేళ పొరపాటున ఏవైనా కొట్టివేతలు ఉన్నా, మార్పుచేర్పులు చేసినా అక్కడే ఇరుపక్షాలకు చెందిన వ్యక్తులు సంతకంచేయాలి.
ఆస్తి హద్దుల విషయంలో ఇరుగుపొరుగువారు అని క్లుప్తంగా రాసే కంటే ప్రస్తుతం ఆ స్థలానికి యాజమానులెవరో రాస్తే భవిష్యత్తులో గందరగోళం ఉండదు. మనం కొనుగోలు చేసే ఆస్తి అసైన్డ్‌ భూమో, ప్రభుత్వానిదో, వక్ఫ్‌, దేవాదాయ భూములు కాకుండా ఉండేలా జాగ్రత్తపడాలి. ఇలాంటి భూముల కొనుగోలు, అమ్మకాల వ్యవహారం చట్టరీత్యా నేరం, శిక్షార్హమైనది.

ఆస్తి వివరణ, పటం తయారీ:

ఎలాంటి సందిగ్ధతకు తావులేకుండా ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాలను డాక్యుమెంట్లో నమోదు చేయాలి. స్థిరాస్తిగా ఇల్లును కొనుగోలు చేసేట్టయితే ఇంటి నంబరు, ఆస్తి మదింపు సంఖ్య, వీధి పేరు, గ్రామం లేదా పట్టణం పేరు, జిల్లా, రాష్ట్రం స్పష్టంగా పేర్కొనాలి. మారుమూల ప్రాంతాల్లో ప్లాటును కొనుగోలు చేసేట్టయితే మరింత జాగ్రత్త వహించాలి.
ఆస్తి పటం తయారీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. స్థలాన్ని కొలిచి గజాలలో లేదా మీటర్లలో వివరాలను నమోదు చేయాలి. ఆస్తి పటాన్ని చూస్తే ఎవరైనా సులభంగా గుర్తుపట్టేలా సమీపంలోని పోస్టాఫీసు, పోలీస్‌స్టేషన్‌, మసీదు, గుడి లాంటివి పేర్కొనడం మంచిది.

అవసరమయ్యే పత్రాలు:
ఆస్తి కొనుగోలుదారు, అమ్మకందారు ఇరు పక్షాలకు చెందినవారు వారి వారి ప్రస్తుత నివాస చిరునామా ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి. చిరునామా, గుర్తింపు పత్రాలుగా రేషన్‌కార్డు, పాస్‌పోర్టు, ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్కుల్లో ఏదైనా ఒకటి చూపించవచ్చు.
రిజిస్ట్రేషన్‌ ఫారాలపై ఇరు పక్షాలకు చెందిన వ్యక్తుల ఫొటోలు, సంతకాలు, కనీసం ఇద్దరు సాక్షులు సంతకం చేయాల్సి ఉంటుంది.

రిజిస్ట్రార్‌ ముఖ్య ప్రక్రియ, గడువు:

అన్ని పత్రాలు సిద్ధంచేసుకున్నాక రిజిస్ట్రేషన్‌ పత్రంలో సంతకం చేసిన తేదీ నుంచి రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు నాలుగు నెలల గడువుంటుంది. అపరాధ రుసుముతో మరో నాలుగు నెలలకు గడువును పొడిగించుకోవచ్చు. కార్యాలయ పనివేళలు ఉదయం 10.30 నుంచి సాయంత్రం రూ.5 గంటల మధ్య రిజిస్ట్రేషన్‌ ఫారాలను స్వీకరిస్తారు. సెలవు దినాల్లో కాస్త అధిక ఫీజుతో సబ్‌ రిజిస్ట్రార్‌ అందుబాటులో ఉంటే చేయించుకునే అవకాశమూ ఉంది.

రిజిస్ట్రేషన్‌ సమయంలో సంతకాలు చేసేందుకు ఇరుపక్షాలవారు అందుబాటులో ఉండాలి. వీళ్లలో ఎవరో ఒకరు రాలేని పరిస్థితి ఉంటే ముందే నియమించిన పవర్‌ ఆఫ్‌ అటార్నీ లేదా ఏజెంటు సంతకంచేయవచ్చు. ఇరుపక్షాలతో కుటుంబపరంగా సంబంధలేని 18ఏళ్ల వయసు నిండిన వారు ఎవరైనా సాక్షులుగా సంతకం చేయవచ్చు.

రిజిస్ట్రార్‌ ఈ ఫారాలను పరిశీలించి తమ వద్దనున్న నమోదు పుస్తకాలలో పొందుపర్చి ధ్రువీకరణ పత్రం జారీచేస్తారు. మీ సేవ కేంద్రాల్లోనూ ధ్రువీకరించబడిన రిజిస్ట్రేషన్‌ ఫారాలు లభ్యమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని