Home Loans: స్థిర వడ్డీ రేటుతో ప్రయోజనమేనా?

ఇంటి రుణం తీసుకునేటప్పుడు..స్థిర వడ్డీ రేటు ఆప్షన్‌ ఎంచుకోవడం వల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోండి.

Published : 14 Jun 2024 16:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇల్లు కొనడం అనేది చాలా మంది జీవితంలో కీలకమైంది. ఇల్లు కొనుగోలు చేయాలని నిర్ణయించిన తర్వాత బ్యాంకుల వద్ద రుణం తీసుకోవడానికే చాలా మంది మొగ్గు చూపుతారు. రుణం తీసుకునే సమయంలో బ్యాంకులు రెండు రకాల రేటు ఆప్షన్స్ అందిస్తాయి - స్థిర, ఫ్లోటింగ్‌. ఈ కథనంలో స్థిర వడ్డీ రేటు గురించి తెలుసుకుందాం. 

స్థిర రేటు రుణం

ఫిక్స్‌డ్‌ రేట్‌ ఇంటి రుణం పేరులో సూచించినట్లుగా రుణ కాలవ్యవధిలో స్థిర వడ్డీ రేటును కలిగి ఉంటుంది. ద్రవ్యోల్బణం ఫలితంగా, ఆర్‌బీఐ గతేడాది రెపోరేటును 6.25% నుంచి 6.50%కు పెంచింది. రెపోరేటును బేస్‌ చేసుకునే బ్యాంకులు వడ్డీ రేట్లను విధిస్తాయి. రెపోరేటును పెంచడం నియంత్రణకు కొలమానం. ద్రవ్యోల్బణం మరింత పెరిగితే రాబోయే నెలల్లో వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయని కొందరు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. స్థిర రేటు రుణంలో రుణ ఈఎంఐ ఒకే విధంగా ఉంటుంది. అయితే, ఫిక్స్‌డ్‌ రుణాల వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా ఉంటాయి. 

స్థిర వడ్డీ రేటు లాభాలు

స్థిర వడ్డీ రుణంలో వడ్డీ రేటు స్థిరంగా ఉండడం వల్ల, రుణ కాలవ్యవధిలో ఈఎంఐ మారకుండా ఒకే విధంగా ఉంటుంది. మీ ఇంటి రుణంపై స్థిరమైన వడ్డీ రేటు మీకు తెలిసినప్పుడు, భవిష్యత్‌ ఈఎంఐలను సులభంగా ప్లాన్‌ చేసుకోవచ్చు. విలువ స్థిరంగా ఉన్నందున, నెలవారీ బడ్జెట్‌ను నిర్వహించడం సులభం. ద్రవ్యోల్బణం వంటి మారుతున్న మార్కెట్‌ శక్తులతో సంబంధం లేకుండా మీ ఇంటి రుణ వడ్డీ అలాగే ఉంటుంది కాబట్టి, రేటును తరచూ పర్యవేక్షించకుండానే చెల్లింపులను ఆటోమేట్‌ చేయొచ్చు. 

తక్కువ వడ్డీకి రుణం

రుణ దరఖాస్తుదారుడు అధిక క్రెడిట్‌ స్కోరును, స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉండి, గతంలో చెల్లింపులు సక్రమంగా చేసినప్పుడు.. బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకు రుణాన్ని అందించే అవకాశం ఉంటుంది. ఇలాంటి అనుకూలమైన పరిస్థితులను బ్యాంకు వద్ద మెరుగ్గా చూపించగలిగితే తక్కువ (స్థిర) వడ్డీ రేటుతోనే రుణ ఒప్పందాన్ని పూర్తి చేసుకోవచ్చు. వడ్డీ రేటు మొత్తం కాలానికి తక్కువగా ఉంటుంది కాబట్టి, దీర్ఘకాలంలో ఆర్థికంగా ప్రయోజనం పొందొచ్చు.

నష్టాలు

కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఉంటుంది. స్థిర వడ్డీ రేటు ఎంచుకున్న వారు ఇలాంటి సందర్భంలో మార్కెట్ కంటే అధిక వడ్డీ చెల్లిస్తూ ఉంటారు. ఇది కొంత వరకు ప్రతికూల విషయమే. స్థిర రేటుకు సంబంధించిన మరొక ప్రతికూలత ఏంటంటే ఒక పరిమితి మేరకు మాత్రమే స్థిరంగా ఉంటుంది. కాబట్టి, రుణం తీసుకునేటప్పుడే నియమ నిబంధనలను జాగ్రత్తగా చదివి  అర్థం చేసుకోవాలి. మీరు ఇంటి రుణం కోసం స్థిర వడ్డీ రేటును ఎంచుకున్నప్పుడు..ఆ రుణాన్ని గడువుకు ముందే మూసివేయాలని నిర్ణయించుకుంటే ముందస్తు చెల్లింపు/ఫోర్‌క్లోజర్‌ ఛార్జీలుంటాయి.

చివరిగా: స్థిర వడ్డీ రేట్లు.. వాటి లాభాలు, నష్టాలను కలిగి ఉంటాయి. అయితే, ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న వడ్డీ రేట్లకు అనుగుణంగా స్థిర వడ్డీ రేటును సూచించేవారు అధిక సంఖ్యలోనే ఉన్నారు. మీ వ్యక్తిగత స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవడం మేలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని