బ్యాంక్ లాక‌ర్ల‌కు... ప్ర‌త్యేక‌ బీమా

లాకర్‌లో ఉంచిన వస్తువులు పోతే బ్యాంకులు బాధ్యత వ‌హించ‌వు. అందువ‌ల్ల‌ వాటి విలువకు సమానంగా బీమా రక్షణతో పాలసీ తీసుకోవడం అవసరం

Published : 22 Dec 2020 20:21 IST

బంగారు ఆభ‌ర‌ణాలు, ముఖ్య‌మైన ప‌త్రాలు, ఇత‌ర విలువైన వ‌స్తువుల‌ను చాలా మంది బ్యాంకు లాక‌ర్ల‌లో భ‌ద్ర‌ప‌రిచేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. కారణం…బ్యాంకు లాక‌ర్ల‌లో ఉంచితే వ‌స్తువులు సుర‌క్షితంగా ఉంటాయ‌న్న న‌మ్మ‌కం. అయితే లాక‌ర్‌లో ఉంచిన వ‌స్తువులు, పోయినా…డ్యామేజ్‌ అయినా… బ్యాంకులు ఎటువంటి భాద్య‌త వ‌హించ‌వ‌ని మీకు తెలుసా? అవును ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం, లాక‌ర్ల‌లో పెట్టిన వ‌స్తువుల‌కు బ్యాంకులు భాద్య‌త వ‌హించ‌వు. మ‌రి మ‌న విలువైన వ‌స్తువుల ర‌క్ష‌ణ ఎలా? గృహ బీమా పాల‌సీని కొనుగోలు చేయ‌డం దీనికి ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఏకైక‌ ప‌రిష్కార మార్గంగా చెప్ప‌వ‌చ్చు. అయితే ఇఫ్కో-టోక్యో జ‌న‌ర‌ల్ ఇన్సురెన్స్ కంపెనీ, ఇటీవ‌ల బ్యాంక్ లాక‌ర్ ప్రొట‌క్ష‌న్ పాల‌సీని, ప్ర‌త్యేకించి బ్యాంకు లాక‌ర్ల కోస‌మే ప్ర‌వేశ‌పెట్టింది. ఈ పాలసీలోని ముఖ్య మైన అంశాల‌ను ప‌రిశీలిద్దాం.

ఏవిధంగా ప‌నిచేస్తుంది?

సాంప్ర‌దాయ గృహ బీమా పాల‌సీలలో కొన్ని పాల‌సీలు ఇంటిలో ఉంచిన‌ ఆభ‌ర‌ణాలు, ఇత‌ర విలువైన వ‌స్త‌వుల‌ను క‌వ‌ర్ చేస్తే, మ‌రికొన్ని గృహ బీమా పాల‌సీలు బ్యాంకు లాక‌ర్ల‌ను సైతం క‌వ‌ర్ చేస్తాయి. అయితే ఈ పాల‌సీల‌కు కొన్ని ప‌రిమితులు ఉంటాయి. ఇటువంటి పాల‌సీలు లాక‌ర్ క‌వ‌ర్ కింద‌, మొత్తం గృహ బీమాలో 20 శాతం హామీ మొత్తాన్ని మాత్ర‌మే అందిస్తాయ‌ని ప్రోబస్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ రాకేష్ గోయల్ తెలిపారు. ఇఫ్కో టోక్యో పాల‌సీ, అగ్ని ప్ర‌మాదం, భూకంపాలు, దోపిడీలు, బ్యాంకు ఉద్యోగులు మోసం చేసిన‌ప్పుడు, తీవ్ర‌వాదుల చ‌ర్య‌లు మొద‌లైన కార‌ణాల వ‌ల్ల సంభ‌వించే లాక‌ర్ ప్ర‌మాదాల‌ను, న‌ష్టాల‌ను క‌వ‌ర్ చేస్తుంది.

ఇఫ్కో టోక్యో జ‌న‌ర‌ల్ ఇన్సురెన్స్ ఎక్సిక్యూటీవ్ వైస్‌-ప్రెసిడెంట్, సుబ్ర‌త మండ‌ల్‌ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం బ్యాంకు లాక‌ర్ల‌లో ఉంచిన ఆభ‌ర‌ణాలు, పురాత‌న గ‌డియారాలు, ఎల‌క్ట్రిక్ వ‌స్తువులు ఈ పాల‌సీ కింద క‌వ‌రుతాయి. అయితే లాక‌ర్ల ఉంచిన వస్తువుల వివ‌రాలు బీమా కంపెనీకి డిక్ల‌రేష‌న ఫార‌మ్ ద్వారా తెలియ‌జేయాల్సి ఉంటుంది. లాక‌ర్లో ఉంచిన న‌గ‌దును పాల‌సీ క‌వ‌ర్ చేయ‌దు. త‌క్కువ విలువ క‌లిగిన వ‌స్తువుల‌కు కూడా డిక్ల‌రేష‌న్ ఇవ్వాలి. ఏదైనా ఒక వ‌స్తువు విలువ రూ.10 ల‌క్ష‌ల‌కు మించిన లేదా లాక‌ర్ల‌లో ఉంచిన మొత్తం వ‌స్తువుల విలువ రూ.40 ల‌క్ష‌ల మించిన వాల్యుయేష‌న్ స‌ర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుందని మోడ‌ల్ పేర్కొన్నారు. వ‌స్తువుల విలువ‌లో సుమారు 1 శాతం ఉండే వాల్యుయేష‌న్ ఖ‌ర్చును వినియోగదారుడు భ‌రించాలి.
ఆభ‌ర‌ణాలు, వ‌స్తువుల‌తో పాటుగా, విలువైన ద‌స్త్రాల‌కు కూడా యాడ్‌-ఆన్ క‌వ‌ర్ ద్వారా బీమా చేయించ‌వ‌చ్చు.

ఎంత ప్రీమియంకు…ఎంత హామీ?

రూ. 300 ప్రీమియంతో రూ.3 ల‌క్ష‌ల హామీ ల‌భిస్తుంది. మీరు చెల్లించే ప్రీమియం ఆధారంగా హామీ మొత్తం పెరుగుతుంటుంది. గ‌రిష్టంగా రూ.2500 ప్రీమియం చెల్లించ‌డం ద్వారా రూ.40 ల‌క్ష‌ల హామీ మొత్తం ల‌భిస్తుంది. ఆపైన హామీ మొత్తం పెరిగే కొద్ది ప్ర‌తీ వెయ్యి రూపాయిల‌కు 0.06 శాతం ప్రీమియం అద‌నంగా చెల్లించాలి. అంటే అద‌న‌పు హామీ మొత్తం రూ.10 ల‌క్ష‌లు అయితే అద‌నంగా రూ. 600 ప్రీమియం చెల్లించాలి.

కావ‌ల‌సిన ప‌త్రాలు:

ప‌్ర‌స్తుతం ఈ పాల‌సీ ఆఫ్‌లైన్‌లో (కంపెనీ డిస్ట్రిబ్యూష‌న్ ఛాన‌ళ్లు, బ్యాంక్ పార్ట‌న‌ర్స్) వ‌ద్ద మాత్ర‌మే అందుబాటులో ఉంది. బీమా ప్ర‌పోజ‌ల్ ఫార‌మ్‌తో పాటుగా బ్యాంకు లాక‌ర్ వివ‌రాలు, అందులో ఉంచిన వ‌స్తువుల డిక్ల‌రేష‌న్‌, వాల్యుయేష‌న్ స‌ర్టిఫికేట్‌ల‌ను ఇవ్వాల్సి ఉంటుంది.

క్లెయిమ్ చేసేందుకు:

పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలో డిక్ల‌రేష‌ర్ ఇస్తే స‌రిపోతుంది. అయితే క్లెయిమ్ చేసేప్పుడు, నిర్ధిష్ట బ్యాంకులో మీరు లాక‌ర్ క‌లిగి ఉన్నార‌ని నిరూపించే ప‌త్రాల‌ను ఇవ్వాల్సి ఉంటుంది.
రాబ‌రీ లేదా న‌ష్టం జ‌రిగిన‌ట్లు బ్యాంకు వారు, పోలీస్ స్టేష‌న్‌లో ఎఫ్ఐర్ఆర్‌ను ఫైల్ చేస్తేనే, మీరు చేసిన క్లెయిమ్‌ను కంపెనీ అంగీక‌రిస్తుంది. జ‌రిగిన న‌ష్టం గురించి బ్యాంకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయ‌కుండా వ్య‌క్తిగ‌తంగా మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే, క్లెయిమ్‌ను నిరాక‌రిస్తారు. బ్యాంకు వారు ఫైల్ చేసే ఎఫ్ఐఆర్ త‌ప్ప మిగిలిన వ‌న్ని గృహ బీమా మాదిరిగానే క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

చివ‌రిగా:

చాలా మంది వారి విలువైన వ‌స్తువుల‌ను ఇంటిలో ఉండే లాక‌ర్ కంటే బ్యాంకు లాక‌ర్ల‌లో ఉంచేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. బ్యాంకు లాక‌ర్ ఉన్న‌వారు ఈ పాల‌సీని ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోవచ్చు. ఇందులో ప్రీమియం కూడా చాలా త‌క్కువ‌. అంతేకాకుండా కొద్ది మంది మాత్ర‌మే గృహ బీమా క‌లిగి ఉంటారు. అంతేకాకుండా గృహ బీమాలో క్లెయిమ్ ప్రాసెస్ సుల‌భంగా కాద‌ని గోయ‌ల్ అభిప్రాయ‌ప‌డ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని