ప్ర‌మాదాల నుంచి మీ ఇంటిని కాపాడుకోండి

ప్ర‌కృతి వైప‌రిత్యాల వ‌ల‌న క‌లిగే భారీ న‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే గృహ బీమా త‌ప్ప‌నిస‌రి

Published : 22 Dec 2020 15:25 IST

కేర‌ళ రాష్ర్టంలో ఇటీవ‌ల వ‌చ్చిన వ‌ర‌ద‌లు బీభ‌త్సాన్ని సృష్టించాయి. ఇలాంటి ప్ర‌కృతి వైప‌రిత్యాలు సంభ‌వించిన‌ప్పుడు గృహ బీమా ఉంటే న‌ష్టాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. దేశంలో సాధార‌ణ బీమాపై చూపినంత ఆస‌క్తి గృహ బీమా పాల‌సీ తీసుకునేందుకు క‌న‌బ‌ర‌చరు. ఇల్లు అనేది ఒక విలువైన ఆస్తి . దానిని కాపాడుకోవ‌డం మ‌న క‌ర్త‌వ్యం. అనుకోకుండా ఎదుర‌య్యే ప్ర‌మాదాల‌ను దృష్టిలో పెట్టుకొని బీమా పాల‌సీని కొనుగోలు చేయ‌డం చాలా ముఖ్యం. ప్రాథ‌మిక గృహ బీమా మీ ఇంటిని అగ్ని ప్ర‌మాదం, వ‌ర‌దలు, వంటి వైప‌రిత్యాల వ‌ల‌న ఎదురైన న‌ష్టానికి క‌వ‌రేజ్ అందిస్తుంది. కొన్ని బీమా సంస్థ‌లు భూకంపాలు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టం వంటి వాటికి ప్ర‌త్యేక ఛార్జీల‌ను తీసుకుంటాయి. గృహ బీమా కవరేజీని లెక్కించేటప్పుడు బీమా సంస్థలు గృహ సముదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాయి. ఏదైనా ప్రమాదం వల్ల కలిగిన నష్టాన్ని పూరించేందుకో, ఇంటిని పునర్నినిర్మించేందుకు అయ్యే ఖర్చును బీమా కంపెనీలు చెల్లిస్తాయి. నివాసం ఏర్పర్చుకున్న స్థలం విలువను లెక్కలోకి తీసుకోరు. బీమా చేయించుకునేటప్పుడు పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చును లెక్కించి అంత మేరకు గృహ బీమా చేయించుకోవాలి.

చదరపు అడుగు ప్రామాణికంతో గృహాన్ని లెక్కిస్తారు కాబట్టి ఒక్క చదరపు అడుగుకు ఇంత బీమా చెల్లిస్తామని బీమా కంపెనీలు ముందే ఒప్పందం కుదుర్చుకుంటాయి. పునాది నిర్మించేందుకు అయ్యే ఖర్చును కూడా లెక్కిస్తారు. గృహంతోపాటు ప్రహరీ పరిధి కూడా బీమాలోకే వస్తుంది.

భూకంపాలు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు భవనాలు కుప్పకూలిపోతాయి. ఇంటిని తిరిగి నిర్మించేందుకు పరిహారం ఇస్తారు సరే మరి అంతకుముందు శిథిలాల తొలగింపు మాటేంటి? అందుకోసం కూడా కొన్ని కంపెనీలు బీమా కల్పిస్తాయి. శిథిలాల తొలగింపునకు వాడే జేసీబీ వాహనాలకు, కూలీల ఖర్చులను బీమా కంపెనీలు చెల్లిస్తాయి.

అపార్టుమెంటు యాజమాని లేదా సొసైటీ నిర్వాహకుడు గృహాల సముదాయానికి మొత్తం కలిపి బీమాచేయించుకుంటే అది మన సొంత ఇంటికి కొంత మేరకు మాత్రమే బీమా కల్పించగలుగుతుంది. సమగ్ర బీమా కవరేజీ కోసం మనదైన గృహ బీమా తీసుకోవడం మంచిది. వీటన్నింటిని ప్రత్యేకంగా పరిగణించి మన అభ్యర్థన మేరకు మాత్రమే బీమా వర్తింపజేస్తారు. ఒక్కో వస్తువు మార్కెట్‌ విలువను లెక్కకట్టి అందుకు తగ్గ బీమాను నిర్ధారిస్తారు. క్లెయిం చేసుకునే సమయంలో వాటికి సమానమైన పరిహారం లేదా అందులో కొంత శాతాన్ని అందిస్తారు.

ఏదైనా ప్రమాదం జరిగి నష్టం వాటిల్లితే దానికి సరిపడా బీమా లభించే విధంగా సరైన విలువకు బీమా కలిగి ఉండాలి. ప్రీమియం భారంగా భావించి తక్కువ మొత్తానికి బీమా తీసుకుంటే నష్టం జరిగినప్పుడు ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఇంటిని అద్దెకు తీసుకన్నవారు తమ ఇంట్లో ఉండే వస్తువులకు బీమా చేయించుకోవచ్చు. ఇంట్లోని ముఖ్యమైన సామాన్లు, ఫర్నీచర్‌, టీవీ, కంప్యూటర్‌, ఫ్రిడ్జ్‌, వాషింగ్‌ మెషీన్‌, విలువైన బంగారు, వెండి ఆభరణాలు, బట్టలు, సోఫా లాంటివాటికి బీమా చేయించుకునే వీలుంది. నష్టం జరిగిన వస్తువును మరమ్మతు చేయించేందుకు అయ్యే ఖర్చును లేదా పూర్తిగా కొత్త వస్తువు కొనేందుకు అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని బీమా కంపెనీలు చెల్లిస్తాయి. అయితే వీటి విలువను చెల్లించేటప్పుడు తరుగుదలను లెక్కిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని