Prudent Corporate IPO: ప్రారంభమైన ప్రుడెంట్‌ కార్పొరేట్‌ ఐపీఓ.. పూర్తి వివరాలు

రిటైల్‌ మదుపర్ల సంపద నిర్వహణ సేవల సంస్థ ‘ప్రుడెంట్‌ కార్పొరేట్‌ అడ్వైజరీ సర్వీసెస్‌’ తొలి పబ్లిక్‌ ఇష్యూ నేడు ప్రారంభమైంది....

Published : 10 May 2022 12:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిటైల్‌ మదుపర్ల సంపద నిర్వహణ సేవల సంస్థ ‘ప్రుడెంట్‌ కార్పొరేట్‌ అడ్వైజరీ సర్వీసెస్‌’ తొలి పబ్లిక్‌ ఇష్యూ (Prudent Corporate IPO) నేడు ప్రారంభమైంది. రెండురోజుల పాటు సాగనున్న ఈ ఐపీఓ (IPO) సబ్‌స్క్రిప్షన్‌ మే 12న ముగియనుంది. నిర్వహణలో అత్యధిక ఆస్తులు కలిగి ఉన్న మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Fund) పంపిణీ సంస్థల్లో ఇదొకటి.

ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీని 2003లో స్థాపించారు. మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Fund) ఉత్పత్తులు, జీవిత, సాధారణ బీమా, స్టాక్‌ బ్రోకింగ్‌ సేవలు వంటి రంగాల్లో ఈ సంస్థ పనిచేస్తోంది. ఫండ్‌బజార్‌, ప్రుడెంట్‌ కనెక్ట్‌, పాలసీవరల్డ్‌, వైజ్‌బాస్కెట్‌, క్రెడిట్‌బాస్కెట్‌ వేదికల ద్వారా ఈ కంపెనీ పూర్తిగా డిజిటల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ పరిష్కారాలను అందజేస్తోంది. డిసెంబరు 31, 2021 నాటికి కంపెనీ రూ.48,411 కోట్లు విలువ చేసే మ్యూచువల్‌ ఫండ్లను నిర్వహిస్తోంది. వీటిలో 92 శాతం ఈక్విటీ ఆధారిత పథకాలకు చెందిన పెట్టుబడులు కావడం గమనార్హం. 

ఐపీఓకి సంబంధించిన కీలక వివరాలు..

* ఈ ఐపీఓలో తాజా షేర్లేమీ లేవు. ఆఫర్‌ సేల్‌ కింద ప్రమోటర్లు, వాటాదారులు 8.55 మిలియన్ల షేర్లను విక్రయిస్తున్నారు. మొత్తం రూ.538.61 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మొత్తం పూర్తిగా షేర్లు విక్రయిస్తున్న ప్రమోటర్లు, వాటాదారులకే చెందనుంది. 

* ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.595-630గా నిర్ణయించారు. మదుపర్లు కనీసం 23 షేర్ల (ఒక లాట్‌)కు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 13 లాట్ల వరకు సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు. అంటే కనీసం రూ.14,490.. గరిష్ఠంగా రూ.1,88,370 మదుపు చేయాల్సి ఉంటుంది. 

* మొత్తం షేర్లలో సగం అర్హతగల వ్యవస్థాగత మదుపర్ల (QIB)కు కేటాయించారు. మిగిలిన దాంట్లో 15 శాతం సంస్థాగతేతర మదుపర్ల (NII)కు, 35 శాతం రిటైల్‌ మదుపర్లకు అలాట్‌ చేశారు. 

* ఈ కంపెనీ స్టాక్స్‌ మే 23న స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని