Banks helpline: ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటికీ ఒకటే హెల్ప్‌లైన్‌!

వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటికీ ఒకే హెల్ప్‌లైన్‌ త్వరలో అందుబాటులోకి రాబోతోంది.

Published : 21 Oct 2022 14:11 IST

దిల్లీ: వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటికీ ఒకే హెల్ప్‌లైన్‌ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. జాతీయ స్థాయిలో ఒకటే హెల్ప్‌లైన్‌ ఉండాలని ఈ మేరకు ప్రభుత్వం ఆయా బ్యాంకులకు సూచించిందని తెలిసింది. మూడు లేదా నాలుగు నంబర్లు కలిగిన హెల్ప్‌లైన్‌ నంబర్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని సూచించింది. ఎవరైనా వినియోగదారుడు ఆ నంబర్‌కు కాల్‌ చేయడం ద్వారా సదరు బ్యాంకు లేదా సదరు బ్యాంకు శాఖ లేదా సంబంధిత విభాగానికి ఆ కాల్‌ బదిలీ అయ్యేలా ఏర్పాటు ఉండాలని ప్రభుత్వం పేర్కొందని సమాచారం.

ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే.. ఫిర్యాదు చేయడానికి ఇచ్చే నంబర్లే సరిగా పనిచేయడం లేదనేది వినియోగదారుల నుంచి వస్తున్న ప్రధాన ఫిర్యాదు. దీంతో వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ఒక నంబర్‌ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక పనులు పూర్తయ్యాయని ప్రభుత్వ అధికారి ఒకరు ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు. సెప్టెంబర్‌లో దీనిపై చర్చలు జరిగాయని పేర్కొన్నారు. ఒకే నంబర్‌ వల్ల వినియోగదారులకు మేలు చేకూరడంతో పాటు.. అన్ని బ్యాంకుల ఫిర్యాదుల వ్యవస్థలోనూ ఏకరూపత ఉండబోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని