NPAs: 5.5శాతానికి తగ్గిన ప్రభుత్వ బ్యాంకుల మొండి బకాయిలు: కేంద్రం

PSU banks gross NPA: దాదాపు అన్ని ప్రభుత్వ బ్యాంకులు లాభాల్లో ఉన్నాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ తెలిపారు.

Published : 21 Mar 2023 00:17 IST

దిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరును మెరుగుపర్చేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. దీంతో ‘స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి (NPA ratio) గణనీయంగా తగ్గినట్లు పేర్కొంది. మార్చి 2018లో 14.6 శాతంగా ఉన్న ఎన్‌పీఏల నిష్పత్తి 2022 డిసెంబరు నాటికి 5.53 శాతానికి తగ్గినట్లు సోమవారం పార్లమెంటుకు తెలిపింది.

దాదాపు అన్ని ప్రభుత్వ బ్యాంకులు లాభాల్లో ఉన్నాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ తెలిపారు. 2021- 22లో బ్యాంకుల సంయుక్త లాభాలు రూ.66,543 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల వ్యవధిలో ఆ లాభాలు రూ.70,167 కోట్లకు పెరిగినట్లు పేర్కొన్నారు. మరోవైపు బ్యాంకుల క్యాపిటల్‌ అడిక్వసీ రేషియో 2015లో 11.5 శాతం నుంచి 2022 డిసెంబరు నాటికి 14.5 శాతానికి మెరుగైనట్లు వివరించారు. ఐడీబీఐ (2019 జనవరిలో ప్రైవేట్‌ బ్యాంకుగా వర్గీకరించారు) సహా అన్ని ప్రభుత్వ బ్యాంకుల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ జనవరి 2019లో రూ.4.52 లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. అది 2022 డిసెంబరు నాటికి రూ.10.63 లక్షల కోట్లకు పెరిగినట్లు వెల్లడించారు.

ఎన్‌పీఏల సమస్యను సమర్థంగా పరిష్కరించడానికి ప్రభుత్వం ‘4R’ (Recognising, Resolution, Recovery, Recapitalising) వ్యూహాన్ని అమలు చేసినట్లు కరాడ్ తెలిపారు. దీంతో పాటు పాలనాపరమైన వ్యవహారాల్లోని లోపాలను సైతం నివారించినట్లు పేర్కొన్నారు. బ్యాంకుల విలీనం, బాధ్యతాయుతమైన రుణాల జారీ వంటి చర్యలు సైతం ఉపయోగపడ్డట్లు వివరించారు. మరో ప్రశ్నకు బదులిస్తూ.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో 30.48 కోట్ల వాహనాలు (మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, లక్షద్వీప్‌ మినహాయించి) ఉన్నట్లు కరాడ్‌ వెల్లడించారు. వీటిలో 16.54 కోట్ల వాహనాలకు ఇన్సూరెన్స్‌ లేదని తెలిపారు.

మరోవైపు 2016 నుంచి ఇప్పటి వరకు 36 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు కరాడ్‌ తెలిపారు. వీటిలో 33 ‘పెట్టుబడుల ఉపసంహరణ ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్‌)’ చూస్తోందని.. మిగిలిన మూడింటిని సంబంధింత శాఖలు, విభాగాలు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని