PSBs Profits: రూ.1 లక్ష కోట్లు దాటిన ప్రభుత్వ బ్యాంకుల లాభాలు

PSBs Profits: ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల వల్ల బ్యాంకులు లాభాల బాట పట్టాయి. ఐదేళ్ల క్రితం రూ.86 వేల కోట్ల నష్టాలను నివేదించిన బ్యాంకులు 2022- 23 నాటికి రూ.1 లక్ష కోట్లకు పైగా లాభాలను నమోదు చేశాయి.

Published : 21 May 2023 19:37 IST

దిల్లీ: మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బ్యాంకుల ఏకీకృత లాభాలు (PSBs profits) రూ.లక్ష కోట్లు దాటాయి. దీంట్లో బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ (SBI)దే సగం వాటా కావడం గమనార్హం. 2017- 18లో పీఎస్‌బీలు రూ.85,390 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేశాయి. 2022- 23లో అవి కాస్తా రూ.1,04,649 కోట్ల నికర లాభాలుగా మారడం విశేషం.

2021- 22తో పోల్చినా.. 2022- 23లో 12 పీఎస్‌బీల లాభాలు (PSBs profits) 57 శాతం పెరిగాయి. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర లాభంలో అత్యధికంగా 126 శాతం వృద్ధి నమోదైంది. తర్వాత యూకో బ్యాంక్‌ లాభం 100 శాతం పెరిగి రూ.1,862 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాభం 94 శాతం ఎగబాకి రూ.14,110 కోట్లకు చేరింది. అదే సమయంలో ఎస్‌బీఐ లాభం 59 శాతం పెరిగి రూ.50,232 కోట్లకు ఎగబాకింది.

ఒక్క ‘పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB)’ మినహాయించి మిగిలిన బ్యాంకుల పన్నేతర లాభాల్లో ఆకర్షణీయ వృద్ధి నమోదైంది. పీఎన్‌బీ లాభాలు మాత్రం 2022- 23లో వార్షిక ప్రాతిపదికన 27 శాతం తగ్గి రూ.2,507 కోట్లకు చేరింది. బ్యాంకింగ్‌ల పనితీరులో గత కొన్నేళ్లలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం చేపట్టిన 4R వ్యూహం అందుకు దోహదం చేసింది. నిరర్థక ఆస్తులను గుర్తించడం, వాటి రికవరీకి చర్యలు చేపట్టడం, పీఎస్‌బీల్లో మూలధనం చొప్పించడం, ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలే 4R వ్యూహంలో భాగం. 

బ్యాంకులకు మూలధనం సమకూర్చడంలో భాగంగా ప్రభుత్వం గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.3,10,997 కోట్లు పీఎస్‌బీల్లోకి చొప్పించింది. దీంతో బ్యాంకులు దివాలా ప్రమాదం నుంచి తప్పించుకొని లాభాల బాటలో పయనించాయి. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన ఇతర సంస్కరణలు బ్యాంకుల్లో ఆర్థిక క్రమశిక్షణతో పాటు బాధ్యతాయుత రుణ మంజూరుకు దోహదం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని