Indian Railways: రైలు ప్రయాణికులకు ఇక ఆ టెన్షన్‌ అక్కర్లేదు.. ఈ ఫీచర్‌ మీకోసమే!

రైలులో దూర ప్రయాణం చేసేటప్పుడు ఒక్కోసారి ఉదయాన్నే దిగాల్సి వస్తుంది. మనం దిగే స్టేషనే చివరి స్టేషన్‌ అయితే పర్వాలేదు. మధ్యలో

Published : 25 Jun 2022 19:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రైలులో దూర ప్రయాణం చేసేటప్పుడు ఒక్కోసారి ఉదయాన్నే దిగాల్సి వస్తుంది. మనం దిగే స్టేషనే చివరి స్టేషన్‌ అయితే పర్వాలేదు. మధ్యలో ఏ రెండు, మూడు నిమిషాలో ఆగే స్టేషనో అయితే? రెప్ప వేస్తే ఎక్కడ నిద్రలోకి జారుకుంటామోనన్న భయంతో స్టేషన్‌ వచ్చే వరకు పడిగాపులు కాస్తుంటారు కొందరు. అలాంటి వారి కోసమే భారతీయ రైల్వే ఓ సదుపాయాన్ని తీసుకొచ్చేంది. అదే డెస్టినేషన్‌ అలర్ట్‌ వేకప్‌ (wakeup alert) అలారం. దాని వివరాలు తెలుసుకుందాం రండి..

దిగాల్సిన స్టేషన్‌ను దాటి పోయి అవస్థలు పడే ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసీ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ప్రయాణికులు 139కు ఫోన్‌ చేసి కస్టమర్‌ కేర్‌ సర్వీస్‌ ద్వారా ఈ అలర్ట్‌ సదుపాయం పొందొచ్చు. మీరు దిగాల్సిన స్టేషన్‌ రావడానికి 20 నిమిషాల ముందే మిమ్మల్ని కాల్‌ రూపంలో అలర్ట్‌ చేస్తుంది. డెస్టినేషన్‌ అలర్ట్‌ వేకప్‌ అలారం ఫీచర్‌ పొందేందుకు ప్రయాణికులు తొలుత తమ ఫోన్‌ నుంచి ఐఆర్‌సీటీసీ నంబర్‌ 139కు కాల్‌ చేయాలి. ఆ తర్వాత లాంగ్వేజ్‌ సెలక్ట్‌ అడుగుతుంది. అది పూర్తి చేశాక డెస్టినేషన్‌ అలర్ట్‌ కోసం తొలుత 7 అంకెను ప్రెస్‌ చేయాలి. ఆ తర్వాత మీ 10 అంకెల PNR నంబర్‌ అడుగుతుంది. PNR ధ్రువీకరించుకొనేందుకు 1 డయల్‌ చేయాలి.

 ప్రక్రియ పూర్తయ్యాక PNR నంబర్‌ వెరిఫై చేసి డెస్టినేషన్‌ అలర్ట్‌ను నిర్ధారణ చేస్తూ ఓ మెసేజ్‌ వస్తుంది. ఆ తర్వాత మీరు దిగాల్సిన స్టేషన్‌ రావడానికి 20 నిమిషాల ముందు మీ ఫోన్‌కు కాల్‌ రూపంలో అలర్ట్‌ వచ్చి మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. అయితే, ప్రస్తుతానికి ఐఆర్‌సీటీసీ ఈ సదపాయాన్ని రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7గంటల వరకు అందుబాటులో ఉంచింది. ALERT అని స్పేస్‌ ఇచ్చి PNR నంబర్‌ టైప్‌ చేసి 139కి మెసేజ్‌ చేయడం ద్వారా కూడా అలెర్ట్‌ సదుపాయం పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని