Raghuram Rajan: వడ్డీరేట్లను పెంచడం దేశద్రోహమేమీ కాదు: రఘురాం రాజన్‌

ఏదో ఒక దశలో కీలక వడ్డీరేట్లను కచ్చితంగా పెంచాల్సిందేనని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ అభిప్రాయపడ్డారు.....

Published : 25 Apr 2022 20:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదో ఒక దశలో కీలక వడ్డీరేట్లను కచ్చితంగా పెంచాల్సిందేనని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ అభిప్రాయపడ్డారు. దేశంలో ద్రవ్యోల్బణం ఎగబాకుతున్న నేపథ్యంలో ఈ చర్య అనివార్యమని తెలిపారు. వడ్డీరేట్లు పెంచడం దేశద్రోహమేమీ కాదన్న విషయాన్ని రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇది విదేశీయులకు లాభం చేకూర్చే చర్యగా భావించొద్దని హితవు పలికారు. రేట్ల పెంపు ఆర్థిక స్థిరత్వం కోసం పెట్టే పెట్టుబడిలాంటిదని వివరించారు.

మార్చిలో దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణ ఆర్‌బీఐ లక్షిత పరిధిని దాటి 6.95 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన ద్రవ్యపరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. దీంతో రెపోరేటు 4 శాతం వద్ద, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతం వద్ద కొనసాగుతోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణ అంచనాలను ఆర్‌బీఐ 4.5 శాతం నుంచి 5.7 శాతానికి పెంచింది.

తాను గవర్నర్‌గా ఉన్న సమయంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకుల్లోకి వెళ్లిందని కొందరు విమర్శిస్తుంటారని రఘురాం రాజన్‌ తెలిపారు. అలాంటి వారంతా వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. వాస్తవాలే భవిష్యత్తు విధానాలను బాటలు వేస్తాయని తెలిపారు. ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థకు ఏది మంచిదైతే ఆర్‌బీఐ అదే చేసిందని వ్యాఖ్యానించారు.

సెప్టెంబరు 2013లో తాను గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో దేశంలో ద్రవ్యోల్బణం 9.5 శాతంగా ఉందని రాజన్‌ గుర్తుచేసుకున్నారు. రూపాయి సైతం పతనం అంచుల్లో ఉందన్నారు. ఫలితంగా ఆర్‌బీఐ రెపోరేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచిందన్నారు. ద్రవ్యోల్బణం దిగిరాగానే రెపోరేటును 150 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించి 6.5 శాతానికి తీసుకొచ్చామన్నారు. ఈ చర్యలు రూపాయిని బలోపేతం చేయడంతో పాటు వృద్ధికి ఊతమిచ్చాయన్నారు. ఆగస్టు 2013-ఆగస్టు 2016 మధ్య ద్రవ్యోల్బణం 9.5 శాతం నుంచి 5.3 శాతానికి దిగొచ్చిందన్నారు. ఇదే సమయంలో వృద్ధిరేటు 5.91 శాతం నుంచి 9.31 శాతానికి ఎగబాకిందని గుర్తుచేశారు. విదేశీ మారక నిల్వలు 275 బిలియన్‌ డాలర్ల నుంచి 371 బిలియన్‌ డాలర్లకు పెరిగాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని