Ratan Tata: ఒంటరితనం ఎలా ఉంటుందంటే.. రతన్‌ టాటా ఆసక్తికర వ్యాఖ్యలు

అంకురాల్లో పెట్టుబడి పెట్టి, కొత్త ఆలోచనలకు అండగా నిలుస్తుంటారు టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్ రతన్‌ టాటా.

Updated : 15 Nov 2022 16:41 IST

‘గుడ్‌ఫెల్లోస్’ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టిన టాటా

ముంబయి: అంకురాల్లో పెట్టుబడి పెట్టి.. కొత్త ఆలోచనలకు అండగా నిలుస్తుంటారు టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్ రతన్‌ టాటా. తాజాగా ఆయన ‘గుడ్‌ఫెల్లోస్’ అనే అంకుర సంస్థలో పెట్టుబడిపెట్టారు. పిల్లలకు దూరంగా ఉన్న వయసు మళ్లిన వృద్ధులకు ఆసరాను అందించే లక్ష్యంతో ఇది ఏర్పాటైంది. దీనిని శంతను నాయుడు ప్రారంభించారు.

న్యూయార్క్‌లోని కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి శంతను గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. 2018 నుంచి రతన్‌ టాటాకు అసిస్టెంట్‌గా ఉంటున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. 80ల్లో ఉన్న టాటాకు.. ఈ యువకుడికి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. వీరిద్దరిని కలిపింది వీధి శునకాలపై ఉన్న ప్రేమే. ఇలా పెద్ద వయసు వ్యక్తులతో స్నేహం వల్ల కలిగే ప్రయోజనాలు, వృద్ధుల పట్ల ఉన్న ఆప్యాయత ఈ ‘గుడ్‌ఫెల్లోస్‌’ను ప్రారంభించడానికి దోహదం చేశాయని ఇదివరకు శంతను వెల్లడించారు.

‘గుడ్‌ ఫెల్లోస్’ లాంచింగ్ కార్యక్రమంలో రతన్‌ టాటా మాట్లాడుతూ.. ‘ఒక తోడుంటే బాగుండు అని కోరుకుంటూ ఒంటరిగా సమయం గడిపేవరకూ.. ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో తెలియదు’ అని వ్యాఖ్యానించారు. అలాగే వాస్తవంగా వయసు మళ్లే వరకు.. వృద్ధాప్యం గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరన్నారు. ప్రస్తుతం సహజ సత్సాంగత్యాన్ని పొందడం అత్యంత సవాలుగా ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా శంతను ఆలోచనావిధానాన్ని మెచ్చుకున్నారు.

ఈ సందర్భంగా శంతను మాట్లాడుతూ.. 50 మిలియన్ల మంది వృద్ధులు స్వతహాగా జీవిస్తున్నారని, వారితో జీవితాన్ని పంచుకునే వ్యక్తులు లేకుండా ఉన్నారని తెలిపారు. ఈ స్టార్టప్‌ కింద.. సానుభూతితో వ్యవహరించేవారిని, ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ కలిగిన వారిని నియమించుకుంటారు. వారు వృద్ధులకు సహచరుల్లా వ్యవహరిస్తూ, ప్రతి పనిలో ఆసరాగా నిలుస్తారు. ప్రస్తుతం ఈ స్టార్టప్ సేవలు ముంబయిలోని 20 మంది వృద్ధులకే అందుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ సంస్థను పుణె, చెన్నై, బెంగళూరుకు విస్తరించాలన్నది ప్రణాళిక.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని