Ratan Tata: ఆ పిల్లలను చూసే.. నానో కారు తీసుకొచ్చాం

నానో (Nano) కారు.. 14 ఏళ్ల క్రితం ఆటోమొబైల్‌ రంగంలో అదో పెను సంచలనం. సామాన్యుల కోసం టాటా (Tata Nano) కంపెనీ అతి తక్కువ ధర అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కారు ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా

Published : 13 May 2022 02:34 IST

ఆసక్తికర విషయాన్ని పంచుకున్న రతన్‌ టాటా

ఇంటర్నెట్‌డెస్క్‌: నానో (Nano) కారు.. 14 ఏళ్ల క్రితం ఆటోమొబైల్‌ రంగంలో అదో పెను సంచలనం. సామాన్యుల కోసం టాటా (Tata Nano) కంపెనీ అతి తక్కువ ధర అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కారు ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారుగా గుర్తింపు పొందింది. అయితే క్రమక్రమంగా తన ఉనికిని కోల్పోయి పూర్తిగా కనుమరుగైంది. అయినప్పటికీ టాటా గ్రూప్ ఛైర్మన్‌ రతన్‌ టాటా (Ratan Tata)కు ఈ కారు అంటే ఎంతో ప్రత్యేకం. తాజాగా ‘నానో’ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న రతన్‌ టాటా.. అసలు ఆ కారును రూపొందించడం వెనుక ప్రేరణ ఏంటో చెప్పుకొచ్చారు.

రతన్‌ టాటా నేడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ ఫొటో షేర్‌ చేశారు. 2008లో ఆటో ఎక్స్‌పోలో ‘నానో’ కారును ఆవిష్కరిస్తున్న ఫొటో అది. ఈ సందర్భంగా ‘నానో’ ఆవిష్కరణ వెనుక సంగతులను పంచుకున్నారు. ‘‘నానో లాంటి వాహనాలను తయారు చేయాలన్న నాకు కోరిక వెనక ప్రేరణ ఏంటంటే.. చాలా కుటుంబాలు తరచూ తమ పిల్లలతో కలిసి స్కూటర్లపై వెళ్లడాన్ని నేను చూస్తుండేవాడిని. తల్లీతండ్రి మధ్యలో కూర్చున్న పిల్లలు నలిగిపోతున్నారేమో అని నాకు అనిపించింది. గుంతలుగా ఉండే రోడ్లపైనా వారు అలాగే ప్రయాణించడం చూసి నాకో ఆలోచన తట్టింది. ముందు మేం ద్విచక్రవాహనాలను ఎలా భద్రంగా మార్చాలనే దానిపై దృష్టిపెట్టాం. ఆ తర్వాత నాలుగు చక్రాలు ఉండి.. కిటికీలు, డోర్లు లేకుండా కేవలం బగ్గీల్లాంటి వాహనాలను రూపొందించాలనుకున్నాం. కానీ చివరకు కారునే తయారుచేయాలని నేను నిర్ణయించుకున్నా. ‘నానో’ ఎప్పటికీ మన ప్రజల కోసమే’’  అని రతన్‌ టాటా రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ కొద్ది గంటల్లోనే సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ‘‘మీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం’ అంటూ పలువురు ఆయనను కొనియాడారు.

2008 జనవరి 10న టాటా మోటార్స్‌ ‘నానో’ కారును విడుదల చేసింది. ఆ సందర్భంగా రతన్‌ టాటా వేదికపైకి వచ్చి.. ‘‘ఈ కారును ఎంతోమంది లక్ష రూపాయల కారు అని చెబుతున్నారు. ఏ ప్రామిస్‌ ఈజ్‌ ఏ ప్రామిస్‌. నానో కారు రూ.లక్ష(ఎక్స్‌షోరూం ధర)కే అందుబాటులో ఉంటుంది’’ అని చెప్పారు. అన్నట్లుగా ఈ కారును రిజిస్ట్రేషన్‌, ట్యాక్సులు, ఇతర ఛార్జీలు కలుపుకుని ఆన్‌ రోడ్‌లో రూ.1.20లక్షలకే లభించింది. తొలినాళ్లలో విపరీతంగా అమ్ముడైన ఈ కార్లు.. ఆ తర్వాత క్రమక్రమంగా ఆదరణ కోల్పోతూ వచ్చాయి. అమ్మకాలు తగ్గడంతో నానో కార్ల తయారీని నిలిపివేస్తున్నట్లు టాటా గ్రూప్‌ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని