Updated : 19 May 2022 12:20 IST

Ratan Tata: రతన్‌జీ మీరు లెజెండ్‌.. పొగడ్తలు కురిపిస్తోన్న నెటిజన్లు

ఎందుకంటే..?

దిల్లీ: వ్యాపారరంగంలో అడుగుపెట్టే కొత్తతరానికి స్ఫూర్తిగా ఉంటారు ప్రముఖ వ్యాపారవేత్త రతన్‌ టాటా. ఆయన నిరాడంబరత అందరినీ ఆకర్షిస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇటీవల రతన్ టాటా తనకు ఎంతో ప్రత్యేకమైన నానో కారులో తాజ్ హోటల్‌కు వచ్చారు. ఆ సమయంలో ఈ దిగ్గజ వ్యాపారవేత్త పక్కన బాడీగార్డ్స్‌ కూడా లేరు. సహాయకుడు శంతన్‌ నాయుడు, హోటల్ సిబ్బందే ఆయన వెంట ఉన్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోన్న ఈ దృశ్యాలు నెటిజన్లను మెప్పించాయి. లెజెండ్‌, ఆయన్నుంచి మేం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. సామాన్యుల కోసం 2008లో తీసుకువచ్చిన నానో కారు అంటే రతన్ టాటాకు ఎంతో అభిమానం.  ఆ ఏడాది ఆటో ఎక్స్‌పోలో నానో కారును ఆవిష్కరిస్తోన్న ఫొటోను ఇటీవల షేర్‌ చేసి, ఆనాటి సంగతిని గుర్తుచేసుకొన్నారు. ‘‘నానో లాంటి వాహనాలను తయారు చేయాలన్న నా కోరిక వెనక ప్రేరణ ఏంటంటే.. చాలా కుటుంబాలు తరచూ తమ పిల్లలతో కలిసి స్కూటర్లపై వెళ్లడాన్ని నేను చూస్తుండేవాడిని. తల్లీతండ్రి మధ్యలో కూర్చున్న పిల్లలు నలిగిపోతున్నారేమో అని నాకు అనిపించింది. గుంతలుగా ఉండే రోడ్లపైనా వారు అలా ప్రయాణించడం చూసి నాకో ఆలోచన తట్టింది. ముందు మేం ద్విచక్రవాహనాలను ఎలా భద్రంగా మార్చాలనే దానిపై దృష్టిపెట్టాం. ఆ తర్వాత నాలుగు చక్రాలు ఉండి.. కిటికీలు, డోర్లు లేకుండా కేవలం బగ్గీవంటి వాహనాలను రూపొందించాలనుకున్నాం. కానీ, చివరకు కారునే తయారుచేయాలని నేను నిర్ణయించుకున్నా. ‘నానో’ ఎప్పటికీ మన ప్రజల కోసమే’’ అని కారు తయారీకి ప్రేరణనిచ్చిన అంశాన్ని ప్రస్తావించారు.

కారులో తిరగాలన్న మధ్యతరగతి కలను నిజం చేస్తూ.. లక్ష రూపాయాలకే అందుబాటులోకి వచ్చిన ఈ వాహనం తొలినాళ్లలో విపరీతంగా అమ్ముడైంది. తర్వాత క్రమంగా ఆదరణ కోల్పోవడంతో 2018లో దీని తయారీని నిలిపివేస్తున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. కానీ, రతన్‌ టాటా మాత్రం ఇప్పటికీ ఈ కారునే ఉపయోగిస్తుండటం గమనార్హం. 


Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని