Shaktikanta Das: సిలికాన్‌ బ్యాంక్‌ దివాలా.. భారత్‌ బ్యాంకులను హెచ్చరించిన ఆర్బీఐ

ఆస్తులకు, అప్పులకు మధ్య సమతుల్యత లోపించినప్పుడు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆర్బీఐ (RBI) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ (Shaktikanta Das) భారత్‌ బ్యాంకులను హెచ్చరించారు. అమెరికా బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఏర్పడిన సంక్షోభమే దీనికి ఉదాహరణ అని చెప్పారు.

Published : 17 Mar 2023 22:35 IST

దిల్లీ: అగ్రరాజ్యం అమెరికాలో వరుసగా రెండు బ్యాంకులు దివాలా తీసిన నేపథ్యంలో భారత బ్యాంకింగ్‌ వ్యవస్థను ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ హెచ్చరికలు చేశారు. ఆస్తులకు, అప్పులకు మధ్య సమతుల్యత లోపిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఆర్థిక సమతుల్యతకు ఈ రెండూ ప్రమాదమేనన్న ఆయన.. ప్రస్తుతం అమెరికా బ్యాంకింగ్‌ వ్యవస్థలో కొనసాగుతున్న సంక్షోభం అలాంటిదేనని చెప్పారు. కోచిలో ఏర్పాటు చేసిన ఫెడరల్‌ బ్యాంక్‌ ఫౌండర్‌ కేపీ హోర్మిస్‌ స్మారకోత్సవ సభలో ఆయన మాట్లాడారు. దేశీయ ఆర్థిక రంగం స్థిరంగా ఉందని, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. మారకపు రేట్లలో కొనసాగుతున్న అస్థిరత కొనసాగుతున్నప్పటికీ, ముఖ్యంగా అమెరికా డాలర్‌ విలువ పెరిగినప్పటికీ.. దాని ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండబోదని శక్తికాంత దాస్‌ వెల్లడించారు. భారత్‌ విదేశీ రుణాలన్నీ నిర్వహించదగ్గవేనని చెప్పారు.

పరిమితికి మించి డిపాజిట్లు స్వీకరించడం వల్లే అమెరికాలోని ఓ బ్యాంక్‌ సంక్షోభంలో పడిందని శక్తికాంతదాస్‌ పరోక్షంగా ప్రస్తావించారు. క్రిప్టో కరెన్సీ అందుబాటులోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పేందుకు అమెరికాలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభమే ఉదాహరణ అని ఆయన చెప్పారు. ఎప్పటి నుంచో క్రిప్టోని ఆయన వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్‌ తన ప్రసంగంలో జీ 20 సమావేశాలకు భారత్‌ అధ్యక్షత వహించడాన్ని ఎక్కువగా ప్రస్తావించారు. అమెరికా డాలర్‌ విలువ పెరుగుదల వల్ల విదేశీ రుణాలతో సమస్య ఎదుర్కొనే దేశాలకు సాయం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద కూటమి జీ20 ముందుకురావాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులతో సతమతమవుతున్న దేశాలకు యుద్ధప్రాతిపదికన ఆర్థిక సాయం చేయాలని ఆయన కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని