Card tokenisation: కార్డు టోకనైజేషన్‌ గడువు మళ్లీ పొడిగింపు

Card tokenisation: క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు టోకనైజేషన్‌ (Card tokenisation) గడువును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మరోసారి పొడిగించింది.

Published : 24 Jun 2022 19:45 IST

దిల్లీ: క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు టోకనైజేషన్‌ (Card tokenisation) గడువును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మరోసారి పొడిగించింది. ఈ విధానం అమలుకు గడువు జూన్‌ 30తో ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మరో మూడు నెలలు పొడిగిస్తూ సెప్టెంబర్‌ 30ని తుది గడువుగా పేర్కొంది. టోకనైజేషన్‌ విధానం అమలుకు భాగస్వామ్య పక్షాలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా, వారి విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

వినియోగదారుల సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లకు చిక్కకుండా ఉండేందుకు ఆర్‌బీఐ టోకనైజేషన్‌ విధానాన్ని తీసుకొచ్చింది. తొలుత ఈ విధానాన్ని ఆర్‌బీఐ 2020 మేలో ప్రతిపాదించింది. 2021 జూన్‌ 30వ తేదీని గడువుగా నిర్ణయించారు. అయితే, పేమెంట్‌ అగ్రిగేటర్లు, వ్యాపారులు, బ్యాంకులు సన్నద్ధత వ్యక్తం చేయకపోవడంతో ఆ గడువు తేదీని 2021 డిసెంబర్‌ 31కి మార్చారు. అప్పటికీ మరోసారి గడువు పొడిగించాలని వినతులు రావడంతో ఆర్‌బీఐ మరో ఆరు నెలలు గడువు పొడిగించింది. తాజాగా మరో మూడు నెలలు సమయం పొడిగించారు.

ఏమిటీ టోకనైజేషన్..?

అమెజాన్‌, స్విగ్గీ, ఓలా, నెట్‌ఫ్లిక్స్‌.. ఇలా నిత్యం చాలా యాప్స్‌/వెబ్‌సైట్లు వాడుతూ ఉంటాం. వాటిలో మన క్రెడిట్‌ కార్డు/ డెబిట్‌ కార్డు వివరాలను ఉపయోగించి లావాదేవీలు చేస్తుంటాం. కొత్తగా కొనుగోలు చేసే వారు కార్డుకు సంబంధించిన అన్ని వివరాలూ (కార్డు నంబర్‌, ఎక్స్‌పైరీ డేట్‌, సీవీవీ) ఇచ్చి, తర్వాత ఓటీపీ ఎంటర్‌ చేయడం ద్వారా లావాదేవీ పూర్తి చేస్తుంటారు. మరోసారి అదే యాప్‌/వెబ్‌సైట్‌లో లావాదేవీ చేసినప్పుడు మన కార్డు వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ఆ వివరాలేవీ ఎంటర్‌ చేయకుండానే పని పూర్తి చేసేయొచ్చు. ఇలా మనం కార్డు వివరాలు ఇచ్చినప్పుడు మన సున్నితమైన సమాచారం ఆయా సంస్థల వద్ద నిక్షిప్తమై ఉంటుంది. దీనివల్ల సైబర్‌ నేరగాళ్లు ఆయా సంస్థల వెబ్‌సైట్లలోకి చొరబడినప్పుడు మన వివరాలు వారి చేతికి చిక్కుతాయి. దీనికి చెక్‌ పెట్టేందుకు ఆర్‌బీఐ ఈ టోకనైజేషన్ ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది.

ఒకసారి టోకనైజ్‌ చేస్తే కేవలం సీవీవీ, ఓటీపీ ఎంటర్‌ చేసి లావాదేవీని పూర్తి చేయొచ్చు. ఒకవేళ టోకనైజ్‌ చేసేందుకు సదరు సంస్థకు అనుమతి ఇవ్వకుంటే మీరు లావాదేవీ జరిపే ప్రతిసారీ కార్డు వివరాలన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో కార్డు వివరాలు ఇస్తే ఆ వివరాలన్నీ సంస్థల వద్ద నమోదయ్యేవి. టోకనైజేషన్‌ పద్ధతిలో అలా నమోదు కావు. టోకనైజేషన్‌ విధానంలో కార్డు వివరాలేమీ మర్చంట్‌ ప్లాట్‌ఫామ్‌లు, పేమెంట్‌ గేట్‌వేలు నిక్షిప్తం చేయడానికి వీలుండదు. ‘టోకెన్‌’గా వ్యవహరించే ప్రత్యామ్నాయ కోడ్‌ సాయంతో లావాదేవీని పూర్తి చేయొచ్చు. వినియోగదారుడి నుంచి కార్డు టోకనైజేషన్‌ వినతులను స్వీకరించే సంస్థను టోకెన్‌ రిక్వెస్టర్‌గా వ్యవహరిస్తారు. ఈ సంస్థ వినియోగదారుడి వినతిని కార్డ్‌ నెట్‌వర్క్‌ సంస్థకు పంపిస్తుంది. కార్డు జారీదారు సమ్మతితో కార్డు, టోకెన్‌ రిక్వెస్టర్‌, డివైజ్‌ కాంబినేషనల్‌లో టోకెన్‌ను కార్డ్‌ నెట్‌వర్క్‌ సంస్థ జారీ చేస్తుంది. ఇలా కార్డు వివరాలకు బదులుగా ‘టోకెన్‌’ ఇవ్వడాన్ని టోకనైజేషన్‌ అంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని