RBI governor: ఆమోదించలేని రిస్క్‌లతో వృద్ధి ఎప్పటికీ రాదు: బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్‌ చురక

అంగీకరించలేని రిస్క్‌లును తీసుకొని బ్యాంకులు వ్యాపారాలు చేయకూడదని ఆర్‌బీఐ (RBI) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు.

Published : 20 Jun 2024 17:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్యాంకులు లాభాల కోసం రిస్క్‌లు తీసుకోవడం మానుకోవాలని ఆర్‌బీఐ (RBI) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ హితవు పలికారు. కాలేజ్‌ ఆఫ్‌ సూపర్‌వైజర్స్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులు లాభాల కోసం కొన్ని రకాల రిస్కలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇలాంటి చర్యలతో లాభాలు ఏమాత్రం రావని అభిప్రాయపడ్డారు. సంక్షోభాలను ముందే పసిగట్టి వాటిని నివారణ చర్యలు తీసుకోవడమే ఆర్‌బీఐ బాధ్యతని దాస్‌ అన్నారు. అలాగని ప్రతి సందర్భంలో సంక్షోభాలను గుర్తించలేమని.. కానీ, నూరు శాతం ప్రయత్నిస్తామన్నారు. 

ఈ సందర్భంగా సెక్యూరిటీ రహిత రుణాల మంజూరుపై ఆర్‌బీఐ సమయానికి చర్యలు తీసుకొందని శక్తికాంత్‌ దాస్‌ పేర్కొన్నారు. ఫలితంగానే ఈ మార్కెట్‌ కొంత మందగించిందని.. లేకపోతే దీనిలోని బలహీనతలు పెరిగి సమస్య తీవ్రమయ్యేదన్నారు. వ్యాపారం పెరగడానికి ఆలోచనలు మంచివేనని.. అలాగని ఏమాత్రం ఆమోదించలేని నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పారు. బలమైన రిస్క్‌ నియంత్రణ వ్యవస్థ సుదీర్ఘకాలం విజయానికి అవసరమని పేర్కొన్నారు.

సమస్యలను పసిగట్టడమే తమ విధి అని ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు. పర్యవేక్షణ చాలా కఠిన ప్రక్రియగా మారిపోతోందన్నారు. ప్రపంచం సంక్లిష్టంగా మారుతున్న వేళ మన పర్యవేక్షణ వ్యూహాలు సమయానుగుణంగా ఉండాలని శక్తికాంత దాస్‌ వెల్లడించారు. అలాగని తరచూ నియంత్రణ నిబంధనలను మార్చడం తమ ఉద్దేశం కాదని వివరించారు. కొవిడ్‌ వ్యాప్తి సమయం కంటే ప్రస్తుతం భారత్‌ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని వివరించారు. బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల వద్ద ఎన్‌పీఏలు, మొండి బకాయిలు గణనీయంగా తగ్గడంతో దేశీయ ఫైనాన్షియల్‌ వ్యవస్థ బలంగా ఉందన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు