RBI Repo Rate: ఆర్‌బీఐ అనూహ్య నిర్ణయం.. కీలక వడ్డీరేట్ల పెంపు!

అత్యవసరంగా భేటీ అయిన ఆర్‌బీఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు గవర్నర్‌ శక్తికాంతదాస్‌ బుధవారం ప్రకటించారు....

Updated : 04 May 2022 16:12 IST

ముంబయి: ద్రవ్యోల్బణం (Inflation) అంతకంతకూ పెరుగుతుండడంతో ఆర్‌బీఐ (RBI) అప్రమత్తమైంది. సామాన్యులపై ధరల భారాన్ని తగ్గించే దిశగా చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు బుధవారం అత్యవసరంగా భేటీ అయిన ఆర్‌బీఐ (RBI) అనూహ్య నిర్ణయం తీసుకుంది. రేపో రేటు (Repo Rate) సహా కీలక వడ్డీరేట్ల (Key Lending rates)ను పెంచుతున్నట్లు ప్రకటించింది.

రెపో రేటు (Repo Rate)ను 40 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు గవర్నర్‌ శక్తికాంతదాస్‌ (Shaktikanta Das) బుధవారం ప్రకటించారు. దీంతో రెపోరేటు 4.40 శాతానికి చేరింది. పెంచిన రేటు తక్షణమే అమల్లోకి వస్తుందని గవర్నర్‌ (RBI Governor) వెల్లడించారు. క్యాష్‌ రిజర్వ్‌ రేషియో (CRR)ను సైతం 50 బేసిస్‌ పాయింట్లు పెంచారు. దీంతో సీఆర్‌ఆర్‌ (CRR) 4.50 శాతానికి చేరింది. ఇది మే 21 నుంచి అమల్లోకి రానుంది. ఆగస్టు 2018 తర్వాత ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచడం ఇదే తొలిసారి.

ద్రవ్యోల్బణాన్ని (Inflation) అదుపు చేసేందుకు సర్దుబాటు ధోరణిని ఉపసంహరించుకునే యోచనలో ఉన్నట్లు శక్తికాంతదాస్‌ ప్రకటించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణాన్ని ఆందోళనకర స్థాయికి చేరుస్తుండడంతో అత్యవసరంగా భేటీ కావాల్సి వచ్చిందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం నెమ్మదిస్తోందన్నారు. వృద్ధిరేటు (Growth Rate) అవకాశాలను మెరుగుపర్చడం లేదా స్థిరీకరించాలన్న లక్ష్యంతోనే రేట్ల పెంపు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఇప్పటికీ ద్రవ్య విధానంలో సర్దుబాటు వైఖరినే అవలంబిస్తున్నట్లు తెలిపారు. కానీ, దాన్నే జాగ్రత్తగా చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే కరోనా మహమ్మారి సంక్షోభ నివారణకు ప్రకటించిన ఉద్దీపనలను ఆతిచూచి ఉపసంహరిస్తామని తెలిపారు. విదేశీమారక ద్రవ్య నిల్వలు 600 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు శక్తికాంతదాస్‌ తెలిపారు. అలాగే జీడీపీలో రుణాల శాతం సైతం తక్కువగానే ఉందని వివరించారు.

ఏప్రిల్‌లో జరిగిన ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల ప్రకటనలోనే రేట్ల పెంపుపై ఆర్‌బీఐ సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, జూన్‌లో జరిగే తదుపరి ఎంపీసీ సమావేశం వరకు వేచిచూస్తారని అంతా భావించారు. ఆహార వస్తువులు ప్రియం కావడంతో ఫిబ్రవరిలో 6.07 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం.. మార్చిలో 6.95 శాతానికి చేరింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ధరలు భగ్గుమంటున్నాయి. కోళ్ల పెంపకానికి వాడే దాణా, పొద్దుతిరుగుడు నూనె వంటివాటి ధరలు గణనీయంగా పెరిగాయి. మరోవైపు టోకు, రిటైల్‌ ద్రవ్యోల్బణాల మధ్య అంతరం జనవరిలో 4.7 శాతం అయితే, ఇప్పుడు 2.3 శాతానికి తగ్గింది. ఈ పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా పరపతి సమీక్షకు ముందే రేట్ల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.

ఆర్‌బీఐ నిర్ణయం నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం 2:37 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1120 పాయింట్లు పడి 55,849 వద్ద చలిస్తోంది. నిఫ్టీ 345 పాయింట్లు దిగజారి 16,721 వద్ద ట్రేడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని