RBI Rate hike: అనుకున్నదాని కంటే ఎక్కువే వడ్డించిన ఆర్‌బీఐ.. EMIలు మరింత భారం!

RBI Rate hike: అంతా ఊహించినట్లుగానే రెపోరేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) పెంచింది..

Updated : 05 Aug 2022 15:54 IST

RBI Hikes Rates: అంతా ఊహించినట్లుగానే రెపోరేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) పెంచింది. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే (Repo Rate) వడ్డీరేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.40 శాతానికి చేర్చినట్లు శుక్రవారం ప్రకటించింది. పరిశ్రమ వర్గాలు అంచనా వేసినట్లు 35 బేసిస్‌ పాయింట్లు కాకుండా ఆర్‌బీఐ మరింత అధిక పెంపునకు మొగ్గుచూపడం గమనార్హం. కొవిడ్‌ సంక్షోభం తర్వాత ఆర్‌బీఐ (RBI) వరుసగా మూడోసారి రెపోరేటు (Repo Rate)ను పెంచింది. మే నెలలో అనూహ్యంగా సమావేశమై 40 బేసిస్‌ పాయింట్లు.. జూన్‌ ద్వైమాసిక సమీక్షలో మరో 50 పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ఆ భారాన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు వెంటనే బదలాయించాయి. తాజా మార్పును ముందే అంచనా వేసిన కొన్ని బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించేశాయి. ఫలితంగా గృహ, వాహన, ఇతర రుణాల నెలవారీ వాయిదా (EMI)లు మరింత భారం కానున్నాయి.

ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు.. వృద్ధికి సహకారం అందించేందుకు సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణపై దృష్టి సారిస్తామని ఆర్‌బీఐ గత సమీక్షలోనే తెలిపింది. అంటే రెపోరేటు మరింత పెంచుతామనే సంకేతాలు అప్పుడే ఇచ్చింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం సర్దుబాటు వైఖరిని పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ తాజాగా ఉద్ఘాటించింది. ఈనెల 3న ప్రారంభమైన ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల (Monetary Policy Committee decisions)ను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ (Shaktikanta Das) శుక్రవారం వెల్లడించారు.

కొవిడ్‌ ముందే వృద్ధిరేటు మందగించడంతో.. రెపోరేటును 2019 ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ తగ్గిస్తూ వచ్చింది. కొవిడ్‌ తొలిరోజుల్లో 2020లో మార్చి, మే నెలల్లో 75 బేసిస్‌ పాయింట్లు; 40 బేసిస్‌ పాయింట్ల చొప్పున కోత వేసింది. 2019 నుంచి 2020 మేలోపు రెపోరేటులో 250 బేసిస్‌ పాయింట్ల మేర కోత విధించి, రికార్డు కనిష్ఠమైన 4 శాతానికి చేర్చింది. ఆ తర్వాత 11 సార్లు ద్వైమాసిక సమీక్ష జరిగినా రేట్లు సవరించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మేలో 40 బేసిస్‌ పాయింట్లు పెంచి, 4.40 శాతం చేసింది. జూన్‌లో మరో 50 బేసిస్‌ పాయింట్లు పెంచి, 4.90 శాతం, ఇప్పుడు మరో 50 పాయింట్లు పెంచి 5.40 శాతానికి చేర్చింది. దీంతో కీలక వడ్డీరేట్లు కొవిడ్‌-19 ముందు స్థాయికి చేరాయి. రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచేందుకు పరపతి విధాన కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. రెపో రేటుకు తగ్గట్లుగా స్టాండింగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేట్లను కూడా 50 బేసిస్‌ పాయింట్లు పెంచి వరుసగా 5.15 శాతం, 5.65 శాతానికి ఆర్‌బీఐ చేర్చింది.

శక్తికాంత దాస్‌ ప్రకటనల్లోని కీలకాంశాలు..

వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఇంకా అధికంగానే ఉంది. ద్రవ్యోల్బణం ఇంకా లక్ష్యిత పరిధి అయిన 6 శాతానికి పైనే ఉండనుందని అంచనా.

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాల్లో ఎటువంటి మార్పులూ చేయకుండా 7.2 శాతంగానే కొనసాగించారు. అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల వల్ల ప్రపంచ వృద్ధి నెమ్మదించడం మన ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపించొచ్చని ఆర్‌బీఐ హెచ్చరించింది. 

రానున్న రోజుల్లో వంటనూనెల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్‌బీఐ సామాన్యులకు కాస్త ఊరట కలిగించే విషయాన్ని చెప్పింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాలను 6.7 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పారు. 

బ్యాంకింగ్‌ వ్యవస్థలోని అదనపు ద్రవ్యలభ్యత ఏప్రిల్‌-మేలో ఉన్న రూ.6.7 లక్షల కోట్ల నుంచి రూ.3.8 లక్షల కోట్లకు తగ్గింది.

త్రైమాసికం వారీగా వృద్ధిరేటు అంచనాలు..

  • ఏప్రిల్‌-జూన్‌: 16.2%
  • జులై-సెప్టెంబరు: 6.2%
  • అక్టోబరు-డిసెంబరు: 4.1%
  • జనవరి-మార్చి: 4.0%
  • 2023-24 తొలి త్రైమాసికంలో: 6.7%

ద్రవ్యోల్బణ అంచనాలు ఇలా..

  • జులై-సెప్టెంబరు: 7.1%
  • అక్టోబరు-డిసెంబరు: 6.4%
  • జనవరి-మార్చి: 5.8%
  • 2023-24 తొలి త్రైమాసికంలో: 5.0%

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని