RBI Hikes repo rate: రెపోరేటు మరో అరశాతం పెంపు

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచింది....

Updated : 30 Sep 2022 15:11 IST

‘‘ఇప్పటికే కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌లోని ఉద్రిక్తతల వంటి రెండు అతిపెద్ద కుదుపులను ఎదుర్కొన్నాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానాల వల్ల తలెత్తే ఉత్పాతం మధ్యలో ఉన్నాం. అమెరికా డాలర్‌ గరిష్ఠాలకు చేరింది. ఆహార, ఇంధన ధరలు పెరిగాయి. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక విధానాల పర్యవసానాల ప్రభావాన్ని చవిచూస్తున్నాం. ప్రపంచ దేశాల వృద్ధి మందగించింది. ఇవన్నీ వర్ధమాన దేశాలకు ఓ సవాల్‌గా నిలుస్తున్నాయి’’

 - ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ 

RBI Hikes repo rate: పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచింది. రెపో రేటు (Repo Rate)ను మరో 0.50 శాతం పెంచి, 5.90 శాతానికి చేర్చింది. ఈ మేరకు ఈనెల 28-29ల్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. మేలో 0.40 శాతం; జూన్‌, ఆగస్టులో 0.50 శాతం చొప్పున, తాజాగా మరో 0.50 శాతం పెంచడంతో 4 నెలల వ్యవధిలోనే రెపోరేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ) 1.90 శాతం పెరిగింది. 

ఈఎంఐలు మరింత భారం..

ప్రస్తుతం అన్ని బ్యాంకులూ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్కుగా రెపోరేటును తీసుకుంటున్నాయి. దీంతో బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేందుకు ఏమాత్రం ఆలస్యం చేయవు. అంటే ఏప్రిల్‌లో 6.5-7 శాతం వడ్డీరేటుకు లభించిన రుణం, ఇప్పుడు 8.5 శాతానికి మించే అవకాశాలున్నాయి. దీనివల్ల ఇప్పటికే రుణాలు తీసుకున్న వారి నెలవారీ వాయిదా మొత్తం/రుణం చెల్లింపు కాలం పెరుగుతుంది. బ్యాంకు రుణం తీసుకుని, కొత్తగా ఇల్లు కొనాలని అనుకునే వారికీ ఇబ్బందే. ఆదాయానికి తగ్గట్లు ఇచ్చే రుణం మొత్తం తగ్గుతుంది. దీంతో చేతి నుంచి అధికంగా మార్జిన్‌ మనీ చెల్లించాల్సి వస్తుంది. ఇల్లు, వాహనం, వ్యక్తిగత రుణాలు తీసుకున్నవారి ఈఎంఐ మరింత పెరుగుతుంది. దీంతో నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం పడి సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటిదాకా మూడు దఫాల్లో మొత్తం 140 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును ఆర్‌బీఐ పెంచింది. చివరి రెండు సార్లు 50 బేసిస్‌ పాయింట్ల చొప్పున సవరించింది. ద్రవ్యోల్బణ నియంత్రణ కోసమే ఈ చర్యలు చేపడుతున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు, రుణ రికవరీపై ప్రభావం పడకుండా వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

అంతా ద్రవ్యోల్బణ మహిమే..

మూడు నెలలుగా తగ్గుతూ వచ్చిన రిటైల్‌ ద్రవ్యోల్బణం, మళ్లీ ఆగస్టులో 7 శాతానికి పెరిగిన విషయం తెలిసిందే. ఆర్‌బీఐ సౌకర్యవంత స్థాయి అయిన 6 శాతానికి ఎగువన రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదు కావడం వరుసగా ఇది ఎనిమిదో నెల కావడం గమనార్హం. రిటైల్‌ ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఏప్రిల్‌లో 7.79 శాతం గరిష్ఠానికి చేరినప్పటికీ.. మే నెలలో 7.04 శాతానికి; జూన్‌లో 7.01 శాతానికి; జులైలో 6.71 శాతానికి తగ్గింది.పారిశ్రామికోత్పత్తి వృద్ధి సూచీ జులైలో 2.4 శాతానికి పరిమితమైంది. ఇది 4 నెలల కనిష్ఠ స్థాయి. ఈ రెండు గణాంకాలు ఆర్థిక వ్యవస్థకు మళ్లీ ఆందోళన కలిగించేలా ఉన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు అలముకొంటున్నప్పటికీ.. రేట్ల పెంపు విషయంలో ఆర్‌బీఐ ముందుకే వెళ్లింది.

గవర్నర్‌ ప్రసంగంలోని మరిన్ని కీలకాంశాలు..

 • ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గందరగోళం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం కొనసాగుతోంది. 
 • సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణను ఆర్‌బీఐ కొనసాగిస్తుంది. 
 • దేశంలో ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగా ఉన్నాయి.
 • అంతర్జాతీయ ముడి చమురు ధరల్లో ఇటీవల వచ్చిన దిద్దుబాటు కొనసాగితే.. ద్రవ్యోల్బణం విషయంలో ఉపశమనం లభించే అవకాశం ఉంది. 
 • రెండ్రో త్రైమాసిక గణాంకాలను పరిశీలిస్తే ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్నాయి. ప్రైవేటు వినియోగం పుంజుకుంటోంది.
 • బహిర్గత కారణాల వల్ల వస్తువుల ఎగుమతిపై ప్రతికూల ప్రభావం పడింది.
 • బ్యాంకుల రుణ వితరణ 16.2 శాతం వృద్ధితో వేగంగా పెరిగింది.
 • డాలర్‌కు అనుగుణంగానే రూపాయి విలువ కదలాడుతోంది. సెప్టెంబరు 28 నాటికి రూపాయి విలువ 7.4 శాతం తగ్గింది.
 • భారత విదేశీ మారక నిల్వలు 537.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.
 • వృద్ధి అంచనాలు: ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి కుదించింది. రెండో త్రైమాసికం (క్యూ2)- 6.3%; క్యూ3- 4.6%; క్యూ4- 4.6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
 • ద్రవ్యోల్బణ అంచనాలు: ఈ ఏడాది ద్రవ్యోల్బణ అంచనాలను ఆర్‌బీఐ 6.7 శాతంగా కొనసాగించింది. రెండో త్రైమాసికంలో 7.1 శాతం, మూడో త్రైమాసికంలో 6.5 శాతం, నాలుగో త్రైమాసికంలో 5.8 శాతం ఉంటుందని అంచనా వేసింది. 2023-24 తొలి త్రైమాసికంలో 5.9 శాతంగా ఉంటుందని లెక్కగట్టింది. 
Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts