RBI: ఆర్‌బీఐ కొరడా.. ఎస్‌బీఐ సహా 3 బ్యాంకులకు పెనాల్టీ

RBI imposes penalty on 3 banks: ఎస్‌బీఐ సహా మూడు ప్రభుత్వరంగ బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొరడా ఝుళిపించింది. నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు జరిమానా విధిస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది.

Updated : 25 Sep 2023 20:00 IST

ముంబయి: నిబంధనలు పాటించడంలో విఫలమైన కారణంగా మూడు ప్రభుత్వరంగ బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొరడా ఝుళిపించింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో (SBI) పాటు ఇండియన్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌కు భారీగా పెనాల్టీ వడ్డించింది. రుణాలు, అడ్వాన్సులు- చట్టబద్ధ ఇతర పరిమితులు; ఇంట్రా గ్రూప్‌ లావాదేవీలు, రుణాలకు సంబంధించిన మార్గదర్శకాలు పాటించడంలో విఫలమైన కారణంగా ఎస్‌బీఐకి రూ.1.30 కోట్లు జరిమానా విధిస్తున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

రుణాలు- అడ్వాన్సులతో పాటు, కేవైసీ, 2016లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (డిపాజిట్లపై వడ్డీ రేట్లు) మార్గదర్శకాలు పాటించడంలో విఫలమైనందుకు ఇండియన్‌ బ్యాంక్‌కు రూ.1.62 కోట్లు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌, అవేర్‌నెస్‌ ఫండ్‌ స్కీమ్‌ విషయంలో కొన్ని నిబంధనలు పాటించనందుకకు పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌కూ రూ.1 కోటి పెనాల్టీ వేసింది. ఎన్‌బీఎఫ్‌సీకి సంబంధించిన కొన్ని నిబంధనలు ఉల్లంఘించడంలో విఫలమైన కారణంగా ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌కు రూ.8.80 లక్షలు జరిమానా విధించినట్లు తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించినందుకే బ్యాంకులకు, ఎన్‌బీఎఫ్‌సీలకు జరిమానా విధించామని, వినియోగదారుల సేవలకు వీటితో ఎలాంటి సంబంధం లేదని ఆర్‌బీఐ పేర్కొంది.

అదే జరిగితే.. భారత్‌లో అతిపెద్ద ఐపీఓ టాటా గ్రూప్‌ నుంచే

సహకార బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు

ముంబయి వేదికగా నడుస్తున్న ది కపోల్‌ కోపరేటివ్‌ బ్యాంక్‌ లైసెన్సును ఆర్‌బీఐ రద్దు చేసింది. తగినంత మూలధనం, ఆదాయానికి అవకాశాలు క్షీణించడంతో పాటు డిపాజిటర్లకు సొమ్ము చెల్లించలేని స్థితికి బ్యాంక్‌ చేరడంతో లైసెన్సును రద్దు చేసినట్లు తెలిపింది. ఇకపై ఎలాంటి బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిర్వహించకూడదని ఆదేశించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. బ్యాంకు డిపాజిటర్లకు డిపాజిట్‌ ఇన్సురెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (DICGC) కింద గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు డిపాజిట్‌ మొత్తం అందుకుంటారని, 96.09 శాతం మందికి పూర్తి డిపాజిట్లు అందుతాయని ఆర్‌బీఐ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని