New Credit card rules: గడువులోగా క్లోజ్‌ చేయకపోతే జారీ సంస్థకు ఫైన్‌!.. క్రెడిట్‌కార్డ్‌ కొత్త రూల్స్‌ ఇవే

New Credit card rules: వినియోగదారుల అంగీకారం లేకుండా కొత్త కార్డులను జారీ చేయడం లేదా ఉన్న కార్డుల పరిమితిని పెంచడం లాంటివి చేయొద్దని కార్డు జారీ సంస్థలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది.

Published : 23 Apr 2022 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వినియోగదారుల అంగీకారం లేకుండా కొత్త కార్డులను జారీ చేయడం లేదా ఉన్న కార్డుల పరిమితిని పెంచడం లాంటివి చేయొద్దని కార్డు జారీ సంస్థలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. క్రెడిట్‌ కార్డు బిల్లుల వసూలు కోసం వినియోగదారులను ఎలాంటి ఒత్తిడి, వేధింపులకూ గురిచేయొద్దని కార్డు సంస్థలు, థర్డ్‌ పార్టీ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. రూ.100 కోట్ల విలువ దాటిన వాణిజ్య బ్యాంకులు సొంతంగా లేదా కార్డు సంస్థలు/ఎన్‌బీఎఫ్‌సీలతో కలిసి క్రెడిట్‌ కార్డులను జారీ చేయొచ్చని తెలిపింది. వీటితో పాటు క్రెడిట్‌ కార్డు క్లోజింగ్‌కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను ఆర్‌బీఐ జారీ చేసింది. క్రెడిట్‌ కార్డు క్లోజ్‌ చేయాలని వచ్చిన అభ్యర్థనపై నిర్దేశించిన గడువులోగా స్పందించకుంటే రోజుకు రూ.500 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నిబంధనలన్నీ జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.

ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవీ..

  • క్రెడిట్‌ కార్డును క్లోజ్‌ చేయాలని వినియోగదారుల నుంచి అభ్యర్థనను గౌరవంగా స్వీకరించాలి. కార్డుదారుడు బకాయిలన్నీ చెల్లించనట్లయితే వారంలోగా క్రెడిట్‌ కార్డును క్లోజ్‌ చేయాలి.
  • క్రెడిట్‌ కార్డు మూసివేత సమాచారాన్ని ఇ-మెయిల్‌, ఎస్సెమ్మెస్‌ ఇతర పద్ధతుల ద్వారా వినియోగదారుడికి తెలియజేయాలి.
  • క్రెడిట్‌ కార్డు క్లోజ్‌ అభ్యర్థన కోసం వివిధ రకాల మార్గాలు అందుబాటులో ఉంచాలి. హెల్ప్‌లైన్‌, ఇ-మెయిల్‌, ఐవీఆర్‌, వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ఓ లింక్‌ వంటివి ఏర్పాటు చేయాలి.
  • ఒకవేళ క్రెడిట్‌కార్డు క్లోజ్‌ చేయాలని అభ్యర్థన వచ్చిన వారంలోపు క్లోజ్‌ చేయకుంటే జారీ సంస్థ రోజుకు రూ.500 చొప్పున ఖాతాదారుడికి చెల్లించాలి.
  • ఏడాదికి పైగా క్రెడిట్‌ కార్డును వినియోగించకపోతే కార్డు జారీ సంస్థ అలాంటి కార్డులను క్లోజ్‌ చేయొచ్చు. ముందు ఆ సమాచారాన్ని కార్డుదారుడికి చేరవేయాలి. ఒకవేళ సదరు వ్యక్తి 30 రోజుల్లోగా స్పందించకుంటే కార్డు జారీ సంస్థనే నేరుగా క్లోజ్‌ చేయొచ్చు. ఆ సమాచారాన్ని క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీతో పంచుకోవాలి.
  • అలాగే కార్డు క్లోజ్‌ చేసిన తర్వాత కూడా ఏవైనా మిగులు అమౌంట్‌ ఉంటే కార్డుదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఆర్‌బీఐ సూచించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని