Unclaimed deposits: బ్యాంకుల వద్ద అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు ఎన్నో తెలుసా?

Unclaimed deposits: దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్‌ చేయని డిపాజిట్లు (Unclaimed deposits) పెరుగుతున్నాయి. గతేడాది ₹39,264 కోట్లుగా ఉన్న ఈ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ₹48,264 కోట్లకు చేరింది.

Updated : 26 Jul 2022 21:37 IST

ముంబయి: దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో ఎవరూ క్లెయిమ్‌ చేయని డిపాజిట్లు (Unclaimed deposits) పెరుగుతున్నాయి. గతేడాది ₹39,264 కోట్లుగా ఉన్న ఈ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ₹48,264 కోట్లకు చేరింది. వార్షిక నివేదికలో ఈ విషయాన్ని ఆర్‌బీఐ (RBI) ఇటీవల వెల్లడించింది. ఈ క్రమంలో అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్‌ మొత్తాలను క్లెయిమ్‌ చేసుకోవాలని సూచిస్తూ ఆర్‌బీఐ జాతీయ స్థాయిలో క్యాంపెయిన్‌ నిర్వహించనుంది. అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు 8 రాష్ట్రాల్లో అధికంగా ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. తమిళనాడు, పంజాబ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, బెంగాల్‌, కర్ణాటక, బిహార్‌, తెలంగాణ/ఏపీ ఈ జాబితాలో ఉన్నాయి. క్యాంపెయిన్‌లో భాగంగా ఈ 8 రాష్ట్రాల్లో స్థానిక భాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్‌లో సైతం  ఆర్‌బీఐ ప్రచారం నిర్వహించనుంది. 

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. సేవింగ్స్‌/ కరెంట్‌ అకౌంట్‌లో ఉండే మొత్తాలను 10 ఏళ్ల పాటు నిర్వహించకపోతే దాన్ని అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లుగా పేర్కొంటారు. మెచ్యూరిటీ పూర్తయ్యి 10 ఏళ్లు అయినా టర్మ్‌ డిపాజిట్‌ మొత్తాలు క్లెయిమ్‌ చేయకపోతే వాటినీ అన్‌క్లెయిమ్డ్‌గానే పరిగణిస్తారు. ఈ మొత్తాన్ని ఆర్‌బీఐ నిర్వహించే ‘డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ ఫండ్‌’కు తరలిస్తారు.

సేవింగ్స్‌ ఖాతాలు, కరెంట్‌ ఖాతాలు క్లోజ్‌ చేయకపోవడం, ఖాతాలను నిర్వహించలేకపోవడం, డిపాజిటర్‌ ప్రాణాలు కోల్పోయిన సందర్భాల్లో అతడి వారసులు గానీ, చట్టబద్ధ వారసులుగానీ ఆ మొత్తాన్ని క్లెయిమ్‌ చేయని కారణంగా అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్‌ మొత్తాలు పెరిగిపోతున్నట్లు ఆర్‌బీఐ విశ్లేషించింది. అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లుగా గుర్తించినప్పటికీ డిపాజిటర్లు గానీ, అతడి వారసులు/ చట్టబద్ధ వారసులు ఆ మొత్తాన్ని వడ్డీతో సహా పొందే వీలుంది. ఈ ఉద్దేశంతోనే క్యాంపెయిన్‌ నిర్వహించనున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని