Published : 01 Aug 2022 14:45 IST

Interest Rates: ఈసారి వడ్డీరేట్లు ఎంత పెరగొచ్చు? నిపుణుల అంచనాలిలా ఉన్నాయ్‌..

ముంబయి: అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వు ఇటీవల వడ్డీరేట్లను పెంచిన నేపథ్యంలో ఆ ప్రభావం భారతదేశ ద్రవ్య విధానంపై ఉంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ రిజర్వు బ్యాంకు ఈసారి పాలసీ సమీక్షలో కీలక వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందని తెలిపారు. దాదాపు 35 బేసిస్‌ పాయింట్ల వరకు పెంపు ఉండొచ్చని అంచనా వేశారు.

దేశ ద్రవ్య పరపతి విధానంలో క్రమంగా సర్దుబాటు వైఖరి వీడనున్నామని గత సమీక్షలోనే ఆర్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్టు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష ఈ నెల 3 నుంచి ప్రారంభం కానుంది. గత ఆరు నెలలుగా రిటైల్‌ ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ ఆర్‌బీఐ లక్ష్యిత పరిధి అయిన 6 శాతానికి ఎగువనే నమోదువుతున్న విషయం తెలిసిందే. దీంతో వడ్డీరేట్లను క్రమంగా పెంచాలని నిర్ణయించింది. మే నెలలో 40 పాయింట్లు, జూన్‌ మరో 50 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో ప్రస్తుతం రెపోరేటు 4.9 శాతానికి చేరింది. కరోనా సంక్షోభానికి ముందు ఉన్న 5.15 శాతంతో పోలిస్తే ఇది ఇంకా తక్కువే.

  • ఈ వారంలో జరిగే సమీక్షలో రెపోరేటును కరోనా మునుపటి స్థాయికి తీసుకెళ్లాలని ఆర్‌బీఐ కమిటీ నిర్ణయించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. తర్వాతి నెలల్లో దాన్ని మరింత పెంచే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో కీలక వడ్డీరేట్లను 35 బేసిస్‌ పాయింట్లు పెంచొచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా గ్లోబల్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ తెలిపింది. అయితే, మరింత కఠినంగా వ్యవహరించాలని ఆర్‌బీఐ భావిస్తే 50 బేసిస్‌ పాయింట్ల పెంపునూ కొట్టిపారేయలేమన్నారు. ధరలు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో కాస్త మెతకగా ఉండొచ్చనుకుంటే 25 పాయింట్ల పెంపునకే పరిమితం అయ్యే అవకాశం ఉందన్నారు.
  • ఫెడరల్‌ రిజర్వు 2022లో వడ్డీరేట్లను 225 బేసిస్‌ పాయింట్ల మేర పెంచగా.. ఆర్‌బీఐ 90 పాయింట్లతో సరిపెట్టుకొంది. అమెరికా సెంట్రల్‌ బ్యాంకు అనుసరిస్తున్న కఠిన వైఖరి ప్రభావం ఆర్‌బీఐపైనా ఉండొచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నివేదిక తెలిపింది. అయితే, ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే.. రేట్ల పెంపు విషయంలో ఆర్‌బీఐ అంత దూకుడుగా వెళ్లాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఏదైనా ఉత్పాతం జరిగితే తప్ప.. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఫలితంగా ఆగస్టులో 25 బేసిస్‌ పాయింట్లు.. తర్వాతి రెండు సమీక్షల్లో మరో 25 పాయింట్లు పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రభుత్వ సూచనల మేరకు ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ లక్ష్యిత పరిధిని 2%-6%గా నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. జనవరి నుంచి ఇది 6 శాతం ఎగువనే ఉంటోంది. జూన్‌లో 7.01 శాతంగా నమోదైంది.
  • రేట్ల పెంపు విషయంలో ఫెడ్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఇతర కేంద్ర బ్యాంకులు వ్యవహరిస్తున్నంత కఠినంగా ఆర్‌బీఐ తమ విధానాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదని హౌసింగ్‌.కామ్‌ సీఈఓ ధ్రువ్‌ అగర్వాత్‌ తెలిపారు. తమ అంచనా ప్రకారం రేపో పెంపు 20-25 పాయింట్ల మధ్య ఉండొచ్చన్నారు.
  • వచ్చే రెండు త్రైమాసికాల పాటు ఆర్‌బీఐ దృష్టి ధరల స్థిరీకరణపైనే ఉంటుందని డీబీఎస్‌ గ్రూప్‌ రీసెర్చ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ ఆర్థికవేత్త రాధికా రావు తెలిపారు. జులై-సెప్టెంబరులోనూ ద్రవ్యోల్బణం అధికంగా ఉంటుందని పరిగణనలోకి తీసుకొని రేట్ల పెంపు 35 బేసిస్‌ పాయింట్లు ఉండొచ్చని తెలిపారు. తర్వాత వరుసగా మూడుసార్లు మరో 25 పాయింట్ల చొప్పున పెంచి 6 శాతం వద్ద స్థిరీకరించే అవకాశం ఉందన్నారు.
Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని